
నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం
‘అమ్మో పులి’ అనుకునే రోజులు కావు ఇవి. ‘అయ్యో పులి’ అనుకునే రోజులు. పులుల మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో వాటి పరిరక్షణకు నడుం కట్టిన అగ్రగణ్యులలో దిల్లీకి చెందిన లతికానాథ్ ఒకరు. ‘టైగర్ ప్రిన్సెస్’గా పేరు తెచ్చుకున్న లతిక చూడని అడవి లేదు. తన కెమెరా కన్ను ప్రపంచంలోని ఎన్నో పులుల విషయాలను, విశేషాలను, విషాదాలను ఆవిష్కరించింది.
చిన్నప్పుడు లతికను తల్లిదండ్రులు నేషనల్ పార్క్‌కు తీసుకువెళ్లడం వల్ల ఆమెలో జంతువులపై ఆసక్తి, ప్రేమ పెరుగుతూ వచ్చాయి. జంతు పరిరక్షణ ఉద్యమ విశేషాలు వినడం, ఆ ఉద్యమాల్లో పాల్గొనడం లతిక కన్జర్వేషన్ ఎకాలజిస్ట్, ఫోటోగ్రాఫర్‌గా రూపుదిద్దుకోవడానికి కారణం అయింది.
‘పులుల పరిరక్షణకు సంబంధించి మీరు చేసిన కృషిని డాక్యుమెంట్ చేయండి’ అంటూ లతికను సంప్రదించిన నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ నిర్వాహకులు ఆమెకు ‘టైగర్ ప్రిన్సెస్’ అనే బిరుదును ప్రదానం చేశారు. ‘డిస్కవరీ’ చానెల్ కోసం లతిక చేసిన ‘వైల్డ్ థింగ్స్’ డాక్యుమెంటరీ పాపులర్ అయింది. మన దేశంలో పులుల పరిరక్షణ, మేనేజ్‌మెంట్‌పై పరిశోధన చేసిన తొలి భారతీయురాలిగా లతిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
పులుల ఉనికి, సంరక్షణకు సంబంధించిన అరకొర సమాచారం ఒక పరిమితిగా ఉండేది. ఆ పరిమితిని లతిక పరిశోధనలు అధిగమించాయి. డా. జార్జ్ షాలర్ తరువాత ఆ స్థాయిలో పులులపై పరిశోధన చేసిన వ్యక్తిగా లతికకు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం పులుల పరిరక్షణ, మేనేజ్‌మెంట్‌కు సంబంధించి అధ్యయనాలు ఎక్కువగానే జరుగుతున్నాయి.
‘గతంలో పోల్చితే పులుల పరిరక్షణపై ఎక్కువగా అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ, పరిశోధన, అధ్యయనం అనేవి ఇప్పటికీ అంత సులభంగా ఏం లేవు. కావు. వైల్డ్‌లైఫ్ బయాలజిస్ట్, ఫొటోగ్రాఫర్‌గా చెప్పుకోదగ్గ స్థాయిలో జీవించడం కష్టంగా ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పులుల సంరక్షణకు సంబంధించి అధ్యయనాన్ని ప్రోత్సహించాలి’ అంటుంది లతిక.
ప్రయాణాలు అంటే ఇష్టపడే లతిక యాభైకిపైగా దేశాలకు వెళ్లింది. ఎన్నో అడవులలో పులులతో సహా ఎన్నో జంతువుల ఫోటోలు తీసింది. ‘ప్రతి ఫోటోగ్రాఫ్‌కు ఒక కథ ఉంది. నేను చూసిన ప్రతి పులి నా మనసులో ముద్రించుకుపోయింది. ప్రతి పులి తనకు సంబంధించి ఒక కథ చెబుతున్నట్లుగానే ఉంటుంది. అవి క్షేమంగా ఉండాలని ఎప్పుడూ ప్రార్థించేదాన్ని’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళుతుంది లతిక.
లతిక తీసుకువచ్చిన ఫొటోగ్రాఫ్స్ కలెక్షన్ ‘హిడెన్ ఇండియా’ సమస్త జంతుజాలాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకానికి వాడిన ముఖచిత్రం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. అడవిలో ఒక శిథిల వృక్షం వెనకాల నుంచి భయంగా చూస్తూ ఉంటుంది పులి. ఆ పులి కళ్లు చెప్పకనే ఏవో బాధలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. పిల్లల కోసం లతిక రాసిన ‘తక్దీర్ ది టైగర్ క్లబ్’ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఇరవై భాషలలోకి అనువాదం అయింది.
‘మనుషుల మనుగడ జంతువుల మనుగడతో ముడిపడి ఉంది. స్వల్పకాల స్వార్థప్రయోజనాల కోసం వాటికి హాని చేయడం అంటే భవిష్యత్ కాలంలో మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడమే’ అంటున్న లతికానాథ్ అకాడమిక్ రిసెర్చ్ నుంచి కన్జర్వేషన్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి కన్సల్టెన్సీ వరకు పులుల పరిరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.
వాటిని చూడడం అదృష్టం
నేను పులులకు సమీపంలో ఉన్నప్పుడు, వాతావరణం వేడిగా ఉందా, చల్లగా ఉందా? అసౌకర్యంగా ఉందా? ఆకలిగా ఉందా? అనే స్పృహ ఉండదు. పులులు మాత్రమే నాకు కనిపిస్తాయి. పిట్ట కావచ్చు, పులి కావచ్చు వాటిని చూడడం అదృష్టంగా భావిస్తాను. వాటిని చూసినప్పుడల్లా వాటి పరిరక్షణకు ఇంకా ఏదైనా చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది.
– లతికానాథ్