జగమెరిగిన యేసు పాదయాత్రలు | Important Things In The Bible That Zetham Says | Sakshi
Sakshi News home page

జగమెరిగిన యేసు పాదయాత్రలు

May 28 2026 11:16 AM | Updated on May 28 2026 12:28 PM

Important Things In The Bible That Zetham Says

సూర్యాస్తమయంతో కొత్తరోజుప్రారంభం అయ్యే బైబిలు సంబంధిత ఆనాటి కాలమానం ప్రకారంగా చూస్తే, రాత్రి చివరిభాగమైన రేయి నాలుగవ ఝాములో యేసు పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి కొండ్రపాంతానికో, అరణ్యప్రదేశానికో వెళ్ళిప్రాతఃకాలం వరకు తన తండ్రియైన దేవునికిప్రార్థనలు, యాచనలు సమర్పించి వచ్చాకే రోజువారీ పాదయాత్రలతో సేవా పరిచర్యలకు సమాయత్తం అయ్యేవాడు.

యేసు తాను ఆ రాత్రి బస చేసిన చోట నుండి బాట ఎక్కితే, ఇలా సామాన్య జనంబాట పడితే చాలు! పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఆలయ అధికారుల గుండెల్లో గుర్రాలు పరుగెత్తేవి. వీరి భయాందోళనలకు, ఈర్ష్య ద్వేషాలకు అంతేలేదు. యేసు జనాల్లోకి వస్తే తప్పక వారికి ఏదో ఒక మేలు చేసే తీరతాడు అని వారు బలంగా స్థిరంగా నమ్మేవరకు పోయింది.

అదికాకుంటే ఏదో ఒక అద్భుతంతో ప్రజలను ఆకట్టుకొని తన వెంట తిప్పుకుంటాడు అనేది వీరి అంతరంగ ఆలోచన. దీంతో వారు ఆయన మీద పన్నని కుట్ర లేదు. వారి కుయుక్తులు, కుతంత్రాలు సరేసరి. యేసును వెంబడించే వారిని చూస్తూ తట్టుకోలేని పరిసయ్యులు, పండితులు ‘ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహం శాపగ్రస్తమైనదని’ అంటూ తమ సొంత ప్రజలను కూడా ద్వేషించే స్థాయికి వారు దిగజారారు. గర్విష్టులుగా అహంకారులుగా యేసు పాదయాత్రలు అడ్డుకొని పరిస్సయ్యులు సాధించింది ఏదిలేదు.

‘దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారినందరిని స్వస్థతపరచుచు సంచరించుచుండెను’ – అపొ. కా. 10:38. బీదలకు ఆహారం పెట్టడం, రోగులకు స్వస్థత చేకూర్చడం, దెయ్యాల నుండి విడిపిస్తూ వారి ఆత్మలను అన్నీ బంధకాల నుండి విమోచించడం సత్యం బోధిస్తూ స్వతంత్రులనుగా చేయడం ధర్మశాస్త్ర పండితులకు ఇది ఏమాత్రం రుచించేదికాదు. పాత నిబంధన అను ధర్మశాస్త్రానికి ముగింపు పలుకుతూ సర్వసత్యం అను క్రొత్త నిబంధననుప్రారంభించేది ఆయనే అనేది కొంతమంది సద్భక్తులకే తెలుసు.

పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఈ కోణంలో ఆలోచన చేయక గుడ్డిగా మెస్సీయ మీద నిందలు వేస్తూ ద్వేషంతో దాడులకు తెగబడేవారు. ఆయన తన జ్ఞానం చొప్పున తెలివిగా తప్పించుకొన్న సందర్భాలు అనేకం. అయినా యేసు తన పాదయాత్రలు, దేవుని రాజ్య సువార్త వ్యాప్తి ఆపేవాడు కాదు. తన తండ్రి పని విషయమై ఆసక్తితో యేసు ఎక్కడా తగ్గక ఆగక ముందుకే సాగాడు. ఆనోట ఈనోట విన్న నోటి మాటల ద్వారానే అన్ని దేశాలకు చేరి ఆయన పాదయాత్రలు తక్కువ రోజుల్లోనే అంతటా చర్చించుకొనే రీతిలో సుప్రసిద్ధమయ్యాయి. జగమెరిగిన పాదయాత్రలుగా చరిత్ర పుటలకెక్కాయి. – జేతమ్

Advertisement
 
Advertisement
Advertisement