Kavitha Rajesh: సిక్‌ ఇండస్ట్రీతో ఎలా అనే ఆందోళన.. ‘రిస్క్‌ తీసుకోకపోతే గ్రోత్‌ ఉండదు’.. ఈ ఒక్క మాటతో..

Hyderabad: HMA Kavitha Rajesh Successful Journey In Telugu - Sakshi

రంగుల ప్రయాణం

‘రిస్క్‌ తీసుకోకపోతే గ్రోత్‌ ఉండదు’ కవితారాజేశ్‌కు ఆమె భర్త చెప్పిన మాట. ఆ స్ఫూర్తితోనే రిస్క్‌ తీసుకున్నారామె. ఒక రిస్క్‌ తర్వాత మరొక రిస్క్‌. రిస్క్‌ అంటే... ‘ప్రమాదం వెంట పరుగెత్తడం కాదు.. ప్రయోగాలతో కలిసి ప్రయాణం చేయడం’ ఇది ఆమె చెబుతున్న కొత్త నిర్వచనం.

హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ బాధ్యతల్లో ఆమెది తనదైన ప్రత్యేక శైలి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆమెది రంగులలోకం. సక్సెస్‌కి కలర్‌ ఉండదు... అన్ని రంగుల కలయికే సక్సెస్‌. కెమికల్‌ కలర్స్‌ నుంచి ఎకో ఫ్రెండ్లీ కలర్స్‌ వరకు సాగిన ఆమె సక్సెస్‌ఫుల్‌ జర్నీ.

‘‘మాది మెదక్‌ జిల్లా జోగిపేట. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. ఐఐఎమ్‌సీ నుంచి బీకామ్‌ ఆనర్స్‌ చేశాను. ఎల్‌ఎల్‌బీ కూడా చేశాను. ఉద్యోగం, లా ప్రాక్టీస్‌ కంటే పెద్దగా ఏదైనా చేయాలని ఉండేది. లైఫ్‌ హాయిగా గడిపేయాలనుకుంటే ఏదీ సాధించలేం. రిస్క్‌ అని భయపడుతూ ఉంటే జీవితం కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది.

రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా ప్రిపేర్‌ కావాలి. గెలిచి తీరడమే మన లక్ష్యం అయి ఉండాలి. ఇక రెండో ఆప్షన్‌ కోసం పక్కకు చూడకూడదు. మనవంతుగా పని చేస్తూ ఉంటే గెలుపు మనదై తీరుతుంది. కొన్నిసార్లు గెలుపు ఆలస్యం కావచ్చేమో కానీ గెలుపు రాకుండా ఉండదని నా నమ్మకం.

మా నాన్న వయసు రీత్యా... ఆయన నడిపిస్తున్న పెయింట్స్‌ ఇండస్ట్రీ అప్పటికే ఇబ్బందుల్లో ఉంది. మొదలు పెట్టడమే సిక్‌ ఇండస్ట్రీతో ఎలా అనే ఆందోళన ఉన్నప్పటికీ సాహసం చేశాను. మా హజ్బెండ్, అత్తగారు కూడా ప్రోత్సహించారు. లాభమైనా, నష్టమైనా అంతా కుటుంబంలోనే కాబట్టి మొదలు పెట్టమనే భరోసా ఇచ్చారు నాన్న. అలా ఓం సాయి ఆంధ్రా పెయింట్స్‌ని టేకోవర్‌ చేశాను.

ఏడాదికే లాభాల్లోకి వచ్చింది పరిశ్రమ. లాభాల్లోకి వచ్చిన వెంటనే రిలాక్స్‌ అయితే పరిశ్రమను విస్తరణ ఆగిపోతుంది. మాకు లెర్నింగ్‌ పీరియడ్‌ మూడేళ్లపాటు సాగింది. బాలానగర్‌లో ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదలైంది నా రంగుల ప్రస్థానం. ఇప్పుడది పదివేల చదరపు అడుగుల పరిశ్రమ. ఎలీప్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో గోల్డ్‌సీల్‌ గుర్తింపుతో నడుస్తోంది. ఐఎస్‌బీ గోల్డ్‌మ్యాన్‌ సాచె ప్రోగ్రామ్, ఎలీప్‌తో ప్రయాణం నన్ను బాగా తీర్చిదిద్దాయి.

ఇవాంకతో భేటీ
గోల్డ్‌ మ్యాన్‌ సాచ్‌ టెన్‌ థౌజండ్స్‌ నుంచి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ 2019కి హాజరయ్యే అవకాశం వచ్చిన ఏకైక భారతీయ మహిళను. గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ 2017 హైదరాబాద్‌లో జరిగింది. ఇవాంక ట్రంప్‌ కూడా వచ్చారు. ఆ సమావేశానికి ఆహ్వానం వచ్చిందంటే కారణం పరిశ్రమను విజయవంతంగా నడిపించడమే. ఒక విజయాన్ని మనం సాధిస్తే... మరికొన్ని విజయాలు వాటంతట అవే వచ్చి తోడు నిలుస్తాయి.

మహిళలకు నేను చెప్పేది ఒక్కటే... ‘మాకు తెలియదు’ అనుకోవద్దు. టెక్నాలజీ తెలియదు కాబట్టి, మేము ఇందులో సక్సెస్‌ కాలేము... అని భయపడే వాళ్లెందరో. ఇండస్ట్రీని నడిపించడానికి టెక్నాలజీ వచ్చి తీరాలనేమీ లేదు, టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకోవచ్చు.

కాలానుగుణంగా మారడానికి కొత్త అవసరాలకు తగినట్లు మనల్ని, మన పరిశ్రమను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలు. రసాయన రంగులతో మొదలైన నా పరిశ్రమ ఇప్పుడు డెకరేటివ్, ఇండస్ట్రియల్, స్పెషలైజ్‌డ్‌ పెయింట్స్‌తోపాటు ఎకో ఫ్రెండ్లీ టాయ్‌ పెయింట్స్‌ తయారీకి చేరింది. కొత్తగా ఏది ప్రవేశపెట్టాలన్నా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో పరిశోధనలు చేస్తాం. నాకు ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉండితీరాల్సిన అవసరం లేదు. అందుకు తగిన నిపుణులున్నారు. 

పని పంపకం
ఒకప్పుడు పనులన్నీ నా భుజాల మీదనే మోసేదాన్ని. ఆరోగ్యం పాడైన తర్వాత వర్క్‌ డెలిగేషన్‌ నేర్చుకున్నాను. ఇంజనీరింగ్, ఎంబీఏ, డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీగా నా లెక్చర్స్‌లో ‘మనం ఎదగాలి, మనతోపాటు పక్కవారిని ఎదగనివ్వాలి.

ఆ ఎదుగుదల ఆర్థికంగానూ, ఆ వ్యక్తి ఇండిపెండెంట్‌గా నిలబడగలిగేటట్లు కూడా ఉండాలి. ఒకరి ఎదుగుదలకు మనం తోడ్పడితే వారి నుంచి వెలువడే కృతజ్ఞతలే మనల్ని నిలబెడతాయి’ అని చెబుతుంటాను. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఐమా) కౌన్సిల్‌ మెంబర్‌ని, ఇండో– పసిఫిక్‌ స్టడీస్‌కి కౌన్సిల్‌ మెంబర్‌ని కూడా.

ఇన్ని బాధ్యతలలో అత్యంత చాలెంజింగ్‌ జాబ్‌ మా స్టీల్‌ మైన్స్‌ అపార్ట్‌మెంట్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలే’’ అన్నారామె నవ్వుతూ. పురాతన వస్తువుల సేకరణను ఇష్టపడే కవితారాజేశ్‌ ఇంట్లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ తయారు చేసిన ఫ్యాన్‌ ఇప్పటికీ తిరుగుతోంది. 

మేనేజ్‌మెంట్‌ ఓ నైపుణ్యం
మూడు వేలకు పైగా సభ్యులున్న హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎమ్‌ఎ) ప్రెసిడెంట్‌ బాధ్యతలు నిర్వర్తించడం నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. పాస్ట్‌ ప్రెసిడెంట్స్‌ నన్ను బాగా ప్రోత్సహించారు. 58 ఏళ్ల ఈ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌ బాధ్యతలు నిర్వహించిన మూడో మహిళను. మహిళల్లో బెస్ట్‌ అనిపించుకోవాలనే టార్గెట్‌ పెట్టుకోలేదు నేను.

ఇప్పటి వరకు పని చేసిన అందరు ప్రెసిడెంట్‌లలోనూ బెస్ట్‌గా నిలవాలనే లక్ష్యంతో పని చేశాను. ఆఫీస్‌ని ఆల్‌ ఉమెన్‌ ఆఫీస్‌గా మార్చాను. దేశవిదేశాల ఎంబసీలు, కాన్సులేట్‌లతో పని చేశాం. స్టూడెంట్స్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌ కోసం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ని కెనడా ఎంబసీతో అనుసంధానం చేయడం వంటివి చాలా చేశాం.

సోషల్‌ ఇంపాక్ట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రభుత్వ పాఠశాలలో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్‌ తవ్వించడం వంటివెన్నో... కోవిడ్‌ సమయంలో కూడా వందకు పైగా కార్యక్రమాలు నిర్వహించాం. కమిటీ సభ్యులందరినీ ఇన్‌వాల్వ్‌ చేస్తూ పోవడంతోనే ప్రెసిడెంట్‌గా నేను విజయవంతమయ్యాను.  – కవితా రాజేశ్, ప్రొప్రయిటర్‌ ఓం సాయి ఆంధ్రా పెయింట్స్, హైదరాబాద్‌ 
– వాకా మంజులారెడ్డి
ఫొటో : మోర్ల అనిల్‌ కుమార్‌
చదవండి: 
విలేజ్‌ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే
మెహందీ డిజైన్లు వేసుకుంటూ రైఫిల్‌ షూటర్‌గా ఎదిగిన బనారస్‌ అమ్మాయి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top