విలేజ్‌ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే!

Global Market For Desi Handicrafts: Pooja Shahi Surabhi Inspirational Journey - Sakshi

మారుమూల గ్రామాల్లో ఉన్న మహిళలు చదువుకోలేకపోవచ్చు. కానీ, వారి చేతుల్లో అందమైన మన ప్రాచీన కళావైభవం దాగుంటుంది. తరతరాలుగా వస్తున్న ఆ వైభవం ఇప్పటికీ మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఆ కళల పట్ల ఉన్న వారి ప్రతిభను ఆ గ్రామాలకే పరిమితం అవడం లేదు. దేశ సరిహద్దులు దాటుతున్నాయి.

మన దేశీయ హస్తకళలకు విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను గమనించి, ప్రాచీన హస్తకళలకు తిరిగి జీవం పోస్తున్న వారెందరో తమతో పాటు వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎదుగుతున్నారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని సురోలి గ్రామానికి చెందిన పూజా షాహి ఊళ్లో తయారు చేసిన హస్తకళలను అమెరికా–జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తోంది. 2009లో కొంతమందితో మొదలుపెట్టిన చిన్న స్టార్టప్‌ నేడు లక్షల టర్నోవర్‌ సాధిస్తోంది. నిరక్షరాస్యులైన ఇక్కడి మహిళలు తయారు చేసిన హస్తకళలను ఇప్పుడు అమెరికా, జర్మనీలకు పంపుతున్నారు.

అమ్మమ్మల కాలపు కళగా పేరొందిన క్రొయేషియా కళ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. దీనికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడి గ్రామీణ మహిళల జీవితాలను మార్చేసింది. ‘నేను ఇంటర్మీడియెట్‌ వరకు చదివాను. చిన్నప్పటి నుండి మా అమ్మ క్రొయేషియా నుండి వివిధ వస్తువులను తయారు చేయడం చూశాను. వాటి నుండి చాలా ప్రేరణ పొందాను.

మెల్లగా నా చెయ్యి కూడా క్రొచెట్‌ అల్లడం మొదలుపెట్టింది. రకరకాల బొమ్మలు, అలంకరణ వస్తువులు క్రొచెట్‌తో తయారు చేస్తూ, ఆర్డర్ల ద్వారా వాటిని ఇస్తుండేదాన్ని. తర్వాత్తర్వాత నా చుట్టూ మా ఊళ్లో ఉన్న మహిళలపైన దృష్టి పెట్టాను. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటిపని, వంటపని, పిల్లలపని.. దీంట్లో ఉండిపోతారు. ఈ ఆడవాళ్లు డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే వారి అదృష్టం మారుతుందనుకున్నాను.

అలా, వారి చేత కూడా సోఫాకవర్లు, టీవీ కవర్లు, ఊయల, వాల్‌ హ్యాంగర్లు, ఫొటో ఫ్రేములు, కర్టెన్లు, బాటిల్‌ హోల్డర్లు, వాలెట్లు తయారు చేయించేదాన్ని. ‘జాగృతి యాత్ర’ సంస్థ పరిచయం అయ్యాక ఈ ఉత్పత్తులను ఎలా అమ్మాలి అనే విషయాలపై అవగాహన వచ్చింది. ‘డియోరియా డిజైన్‌’ పేరుతో కంపెనీ ప్రారంభించాను. ఇది ఇప్పుడు సంపాదన క్రాఫ్ట్‌గా మారింది. 100 రకాల అలంకార వస్తువులు, 50 రకాలకు పైగా ఆభరణాలు, ఉపకరణాలను తయారుచేస్తున్నాం.

వీటిని అమెరికా, జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటివరకు 35 వేల మంది మహిళలు శిక్షణ పొందారు. రాబోయే మూడేళ్లలో పదివేల మంది మహిళలు పర్మినెంట్‌ ఉద్యోగులుగా పనిచేయాలన్న లక్ష్యంగా కృషి చేస్తున్నాను. మా డిజైన్స్‌కి ‘వన్‌ డిస్ట్రిక్ట్‌... వన్‌ ప్రొడక్ట్‌’ అని పేరు పెట్టారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నన్ను ‘దేవి’ అవార్డుతో సత్కరించి, మా పనిని అభినందించారు. మొదట్లో నా కుటుంబసభ్యులే నాకు మద్దతుగా నిలవలేదు. కానీ, నేడు నా హస్తకళల పనిలో నిమగ్నమవడంతో నేను విజయం సాధించాను అనిపించింది’ అంటారు పూజా షాహి. 

కుట్టుపనికి అంతర్జాతీయ మార్కెట్‌
గుర్తింపు మహిళలకు శక్తినిస్తుంది. ఏదైనా చేయగలరని భావించేలా చేస్తుంది. అప్పుడు వారు తమ విలువను అర్థం చేసుకుంటారు’ అంటారు స్వరా బో దబ్ల్యూ ఫౌండర్‌ ఆశా స్కారియా. కేరళలోని ఎట్టుమనూరు చెందిన ఆశా హస్తకళాకారులను గుర్తించి, వారి కళను మరింత శక్తిమంతం చేస్తుంది.

‘మహిళలు ఇంటి నుండి పనిచేస్తారు. వారు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉపాధిని కల్పించుకోవడంతో పాటు సాధికారికంగా ఉంచుతుంది’ అంటారు ఆమె. స్వరాబ్రాండ్‌ కళాకారులు తయారుచేసిన చీరలను అంతర్జాతీయంగా మార్కెట్‌ చేస్తుంది. దేశమంతటా గ్రామీణ మహిళలల్లో దాగున్న ప్రాచీన కుట్టుపని నైపుణ్యాలను పెంపొందింపజేస్తుంది.

ప్రస్తుతం పశ్చిమబెంగాల్, కేరళకు చెందిన కళాకారులతోపాటు దుంగార్‌పూర్‌లోని వారితోనూ, మహిళా కళాకారులను సమీకరించిన స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంది. అంతేకాదు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని మహిళలు లేదా మానవ అక్రమ రవాణా నుండి రక్షించబడిన మహిళలకు మద్దతుగా స్వరా పనిచేస్తుంది. 

కళల పట్ల అభిరుచితో...
సుర్భి అగర్వాల్‌ జోద్‌పూర్‌లో స్పెషాలిటీ హాస్పిటల్‌ను నడుపుతున్న తన కుటుంబ వ్యాపారాన్ని విడిచిపెట్టి కళ పట్ల ఆమెకున్న అభిరుచిని అందిపుచ్చుకుంది. దేశంలోని వెనుకబడిన మహిళలకు సహాయం చేయాలనుకుంది. రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని హస్తకళాకారులతో కలిసి, గృహాలంకరణ ఉత్పత్తులను తయారుచేయడానికి ‘ది ఆర్ట్‌ ఎక్సోటికా’ను ప్రారంభించింది.

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా హస్తకళాకారులతో కలిసి గృహాలకంరణ ఉత్పత్తులను తయారు చేయిస్తూ, వాటిని అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని నేత కార్మికులకు సహాయం చే యడానికి ఆమె తన గ్యారేజ్‌ నుంచి వర్క్‌ ప్రారంభించింది. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు హస్తకళలను, చేనేత ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది సుర్బి. 
చదవండి: ‘100 రకాల’ డ్రాగన్‌ రైతు! ఒక్కో మొక్క రూ. 100 నుంచి 4,000 వరకు అమ్మకం!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top