Inspirational Story: మెహందీ డిజైన్లు వేసుకుంటూ రైఫిల్‌ షూటర్‌గా ఎదిగిన బనారస్‌ అమ్మాయి

Pooja Verma Raised Money By Mehndi Designing To Fulfill Her Rifle Shooter Dream - Sakshi

రంగుల కల

అరచేతిలో అందమైన మెహిందీ డిజైన్లను నేర్పుగా వేస్తూ అందమైన జీవితం కోసం కలలు కంటూ ఉండేది పూజావర్మ. తన కలకో లక్ష్యాన్ని ఏర్పరుచుకుని రైఫిల్‌ షూటర్‌ కావాలనుకుంది. పండగలు, పెళ్ళిళ్లకు అమ్మాయి చేతుల్లో మెహిందీ డిజైన్స్‌ వేస్తూ అలా వచ్చిన డబ్బుతో షూటర్‌గా నైపుణ్యం సాధించింది. రాష్ట్రస్థాయి పోటీల్లో నెంబర్‌వన్‌ షూటర్‌గా నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనారస్‌ వాసి అయిన 26 ఏళ్ల పూజావర్మ తన కలను సాకారం చేసుకునేందుకు చేస్తున్న కృషి అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. 

పెద్ద పెద్ద కలలు కనగానే సరిపోదు, కలల సాధనకు ఎంతటి కష్టమైనా భరించాల్సిందే అని ఇరవై ఆరేళ్ల్ల పూజా వర్మను చూస్తే అర్ధమవుతుంది. సవాళ్లతో కూడిన ఆమె జీవనశైలి నవతరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇటీవల మీడియాకు వివరించిన ఆ స్ఫూర్తివంతమైన కథనం ఆమె మాటల్లోనే... 

అప్పుగా ఐదు లక్షలు
‘నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను. అక్కడ ఎన్‌సీసీ వల్ల క్రీడలపై ఆసక్తి ఏర్పడింది. అక్కడే షూటింగ్‌ రైఫిల్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో స్కూల్‌ నుంచే రైఫిళ్లు, బుల్లెట్లు ఉచితంగా వచ్చేవి. ఇది చాలా ఖరీదైన గేమ్‌ అని నాకు అప్పుడు తెలియదు. స్కూల్‌ అయిపోగానే ఉచితంగా వచ్చే అవకాశాలన్నీ పోయాయి. కానీ, షూటింగ్‌లో దేశం పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని కల కనేదాన్ని. అయితే, ఇంటి ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అమ్మ గృహిణి.

నాన్న డ్రైవర్‌. అన్నయ్య బట్టల దుకాణం నడుపుతున్నాడు. అక్క పెళ్లి కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సాధారణ కుటుంబంలోనైనా ఆడపిల్లలు పెద్ద పెద్ద కలలు కనడానికి వీలు లేదు. కానీ, నా కుటుంబం మాత్రం అడుగడుగునా నాకు అండగా నిలిచింది. 2015లో నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధం కావడానికి నాకు సొంత రైఫిల్‌ అవసరం. ఐదు లక్షలకన్నా తక్కువ ధరకు రైఫిల్‌ అందుబాటులో లేదు.

రోజుకు మూడు షిప్టులలో వేర్వేరు ఉద్యోగాలు చేసేదాన్ని. అయినా అంత డబ్బు సమకూరలేదు. అమ్మనాన్న, మా అన్న డబ్బు అప్పు తెచ్చి ఇచ్చారు. రైఫిల్‌ కొన్నాను. మొదటిసారి నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఏడు సంవత్సరాలుగా అప్పు తీరుస్తూనే ఉన్నాం. 

శిక్షణకు సాయం
నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ కోచ్‌ బిప్లాప్‌ గోస్వామిని కలిశాను. నాలో ఆసక్తి, ప్రతిభ గమనించి, డబ్బులు తీసుకోకుండానే శిక్షణ ఇవ్వడానికి సాయం చేశారు. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌ వరకు ఫెడరేషన్‌ సహాయంతో చాలా సార్లు రైఫిల్స్‌ను అరువుగా తీసుకున్నాను. ఇలాగే జిల్లా నుండి రాష్ట్రానికి తరువాత జాతీయస్థాయి పోటీలకు వెళ్లగలిగాను. షూటర్‌ ప్రాక్టీస్‌కు షూటింగ్‌ రేంజ్‌ అవసరం.

ఇతర క్రీడల మాదిరిగా పార్కులోనో, దగ్గరలో ఉన్న మైదానంలోనో ప్రాక్టీస్‌ చేయలేం. అందుకే రెండేళ్ల క్రితం డిస్ట్రిక్ట్‌ రైఫిల్‌ క్లబ్‌ ఆఫ్‌ బనారస్‌కు చేరుకున్నాను. క్లబ్‌ ఎంట్రీ ఫీజు 12 వేల రూపాయలు. ఇది నాకు చాలా పెద్ద మొత్తం. ఒకేసారి చెల్లించలేనని సిటీ మెజిస్ట్రేట్‌ ఆఫీసు చుట్టూ నెల రోజులు ప్రదక్షణలు చేస్తే, చివరకు వాయిదాల పద్ధతిలో డబ్బు కట్టడానికి అంగీకరించారు. జాతీయ స్థాయి శిబిరానికి వెళ్లడానికి రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు.

కానీ, కరోనాతో ఆ అవకాశమూ పోయింది. ఒక రైఫిల్‌ బుల్లెట్‌ ధర 30 నుంచి 32 రూపాయలు. ఒక గేమ్‌ ఆడటానికి కనీసం 70 నుంచి 80 బుల్లెట్లు ఖర్చవుతాయి. దీంతో అత్యంత ఖరీదైన క్రీడలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన బుల్లెట్లు కూడా అవసరం. దేశంలో ఎక్కడైనా ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరిగితే రిజిస్ట్రేషన్‌ ఫీజు, బుల్లెట్ల కొనుగోలు, బస–వసతి సదుపాయలు, ప్రయాణ ఖర్చులు.. అన్నీ కలిపి 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. వీలైనన్ని ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనడానికి నా వద్ద అంత డబ్బు లేదు. 

మెహందీ డిజైన్లు.. డ్రైవింగ్‌..
రాష్ట్రస్థాయి అధికారులను కలిశాను. కానీ, ఎలాంటి సాయమూ అందలేదు. చుట్టుపక్కల స్కూళ్లలో పిల్లలకు క్రీడలలో శిక్షణ ఇస్తుంటాను. పెళ్లి, వివిధ సందర్భాలలో జరిగే వేడుకలలో మెహందీ డిజైన్లు వేస్తాను. అమ్మాయిలకు డ్రైవింగ్‌ నేర్పిస్తాను. ఇలా రెండేళ్లపాటు కృషి చేస్తే కొంత డబ్బు జమయ్యింది. 2021 నుండి మళ్లీ ఆడటం ప్రారంభించాను. 43వ యుపి స్టేట్‌ రైఫిల్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధించాను.

స్టేట్‌ నెంబర్‌ 1 ర్యాంకులో నిలిచాను. ఇప్పుడు జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించడానికి శిక్షణ తీసుకుంటున్నాను.  బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికెల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశాను. మాస్టర్స్‌ చేయడానికి ప్రిపేర్‌ అవుతున్నాను’’ అని తన కల కోసం, లక్ష్య సాధనకు చేస్తున్న కృషి గురించి వివరిస్తుంది పూజావర్మ. 

లక్ష్య సాధనలో..
షూటింగ్‌ బోర్డ్‌లోని లక్ష్య కేంద్రాన్ని బుల్‌సీ షూటింగ్‌ లేదా బుల్స్‌ ఐ అంటారు. రైఫిల్‌ షూటింగ్‌ అంటే అంత సులువు కాదు. లక్ష్యాన్ని చాలా ఖచ్చితత్వంతో ఛేదించాలి. ‘మావలంకర్‌’ షూటింగ్‌ పోటీలో బెస్ట్‌ క్యాడెట్,  41వ రాష్ట్రస్థాయి షూటింగ్‌ పోటీల్లో త్రీ పొజిషన్‌ రైఫిల్‌లో బంగారు పతకం, ఆర్మీ క్యాంపు షూటింగ్‌లో బంగారు పతకాలు సాధించింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top