బట్టతలను అడ్డుకుందామిలా...!

How To Postpone Baldness With Food And Treatment - Sakshi

జీన్స్‌ నిర్దేశిస్తాయి

పురుషులకు మాత్రమే బట్టతల సమస్య ఉంటుందని భావిస్తాం కానీ, చాలామంది మహిళల్లో సైతం ఈ సమస్య కనిపిస్తుంది. నల్ల జుట్టు తెల్లబడడం ఎంత బాధపెడుతుందో, కళ్లముందే జుట్టరాలి బట్టతల రావడం అంతకన్నా ఎక్కువగా బాధిస్తుంది. ముఖ్యంగా యుక్తవయసులో బట్టతల రావడం మానసికంగా కుంగదీస్తుంది. అసలు మనిషిలో బట్టతల ఎందుకు వస్తుంది? మానవ జన్యువుల్లోని బాల్డ్‌నెస్‌ జీన్స్‌ ఆండ్రోజెనిటిక్‌ అలోపిసియా బట్టతల వచ్చేందుకు కారణమని సైన్సు చెబుతోంది. జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లు, తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం కూడా బట్టతల విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. 

మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర పలు సమయాల్లో వచ్చే హార్మోనల్‌ మార్పులు బట్టతలను ప్రేరేపిస్తాయి. పురుషుల్లో కానీ, స్త్రీలలో కానీ గుండెవ్యాధులు, బీపీ, షుగర్, గౌట్, ఆర్థరైటిస్‌ తదితరాలకు వాడే మందులు బట్టతలకు కారణమవుతుంటాయి. బట్టతలను అడ్డుకోవడం చాలా కష్టం, కానీ దాన్ని జాప్యం చేయవచ్చని నూతన పరిశోధనలు చెబుతున్నాయి. జన్యుసంబంధిత కారణాలు, ఇతరత్రా కారణాలతో వచ్చే బట్టతలను పూర్తిగా ఆపలేకున్నా, చాలా సంవత్సరాలు అడ్డుకోవచ్చన్నది సైంటిస్టుల మాట.

సాధారణంగా జుట్టు రాలిపోవడమనేది పురుషుల్లో, స్త్రీలల్లో ఒక ప్రత్యేక ఆకారంలో ఆరంభమవుతుంది. దీన్ని ఎంపీబీ (మేల్‌ పాట్రన్‌ బాల్డ్‌నెస్‌) లేదా ఎఫ్‌పీబీ (ఫిమేల్‌ పాట్రన్‌ బాల్డ్‌నెస్‌) అంటారు. ఎంపీబీ ఉన్నవారిలో 20–30 ఏళ్లు వచ్చేసరికి నెత్తిపై ఎం అక్షరం ఆకారంలో జుట్టు రాలడం ఆరంభమై బట్టతల స్టార్టవుతుంది. 80 సంవత్సరాలు వచ్చేసరికి దాదాపు ప్రతిఒక్క మగవారిలో ఎంపీబీ కనిపిస్తుంది. ఆడవారిలో మెనోపాజ్‌ తర్వాత ఎఫ్‌పీబీ కనిపిస్తుంటుంది. పైన చెప్పిన ఆండ్రోజెనిటిక్‌ అలపీనియా వల్లనే ఈ ఎంపీబీ, ఎఫ్‌పీబీలు సంభవిస్తాయి. అలాగే ఇతర కారణాలు దీన్ని వేగవంతం చేస్తాయి. 

మగవారిలో బట్టతల తల్లితరఫు తాతను బట్టి వస్తుందని ఒక పుకారు ఉంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. పురుషుల్లోని ఎక్స్, వై క్రోమోజోముల్లో ఎక్స్‌ క్రోమోజోము తల్లి నుంచి వస్తుంది. బట్టతల జన్యువులు ఈ ఎక్స్‌ క్రోమోజోమ్‌లో ఉంటాయి కాబట్టి తల్లి తరపు తాత నుంచి బట్టతల వస్తుందని భావించారు. అయితే బట్టతలకు కారణమయ్యే జన్యువులు దాదాపు 63కాగా, వీటిలో కేవలం కొన్ని మాత్రమే ఎక్స్‌ క్రోమోజోములో ఉన్నట్లు 2017లో పరిశోధన తేల్చింది. అందువల్ల అటు తండ్రి ఇటు తల్లి తరఫు ఎవరికి బట్టతల ఉన్నా, అది వారసత్వంగా సంక్రమించే అవకాశముంది. 

బ్రేకులు వేయడం ఎలా?
►పైన చెప్పినట్లు జెనిటికల్‌ లేదా ఇతర కారణాల వల్ల వచ్చే బట్టతలను 
►పూర్తిగా ఆపలేకపోయినా, దాని ప్రక్రియను మందగింపజేయవచ్చని 
►పరిశోధకులు చెబుతున్నారు. మరి ఆ మార్గాలేంటో చూద్దాం...

►ప్రతి సమస్యకు ఎవరైనా ముందు చెప్పే పరిష్కారం ఒక్కటే.. ఆరోగ్యవంతమైన జీవన శైలి. అంటే బాలెన్స్‌ డైట్‌ అది కూడా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, రోజువారీ జీవనంలో ఒత్తిడిని తగ్గించుకోవడంతో బట్టతలతో పాటే పలు జీవన సంబంధిత సమస్యలను అడ్డుకోవచ్చు. 

►మైల్డ్‌ షాంపూను తరచూ వాడడం, బయోటిన్‌ ఉన్న మసాజ్‌ ఆయిల్స్‌తో తలపై మసాజ్‌ చేయడం ద్వారా హెయిర్‌లాస్‌ను మందగింపజేయవచ్చు. అలాగే స్కాల్ప్‌కు వాడే సీరమ్స్‌లో విటమిన్‌  ఏ, ఈ ఉండేలా చూసుకోవాలి. ఈ రెండూ జుట్టు రాలడం అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

►చాలామంది తడిజుట్టును చిక్కుతీయడానికి బలప్రయోగాలు చేస్తుంటారు. జుట్టు తడిసినప్పుడు బలహీనదశలో ఉంటుందని, ఈ సమయంలో దీన్ని బలంగా గుంజడం వల్ల కుదుళ్లు చెడిపోయి హెయిర్‌లాస్‌ తీవ్రతరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చిక్కుతీయాలంటే బ్రష్షులు, దువ్వెనల బదులు చేతివేళ్లను వాడడం ఉత్తమం.

►వెల్లుల్లి, ఉల్లి, అల్లం రసాలు జీర్ణకోశానికి మంచివని చాలామంది భావిస్తారు. కానీ ఇవి జుట్టుకు కూడా ఎంతో మంచివని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిలో ఏదో ఒక రసాన్ని రాత్రి నిద్రపోయే ముందు నెత్తికి పట్టించి పొద్దునే కడిగేయడం ద్వారా వారంరోజుల్లో మంచి ఫలితాన్ని పొందవచ్చు. గ్రీ¯Œ టీ బ్యాగ్స్‌ను నీళ్లలో వేసి గంట ఉంచిన తర్వాత ఆ నీటిని నెత్తికి రాయడం కూడా సత్ఫలితాన్నిస్తుంది. 

►నెత్తిపై రాసే మైనోక్సిడిల్‌ లేదా నోటితో తీసుకునే ఫినాస్టిరైడ్‌ లాంటి  మందులను బట్టతల నెమ్మదింపజేసేందుకు డాక్టర్లు సూచిస్తుంటారు. 

►నెత్తిపై రాసే మైనోక్సిడిల్‌ లేదా నోటితో తీసుకునే ఫినాస్టిరైడ్‌ లాంటి  మందులను బట్టతల నెమ్మదింపజేసేందుకు డాక్టర్లు సూచిస్తుంటారు. 

►కొంతమంది నిపుణులు నెత్తిమీద జుట్టు సాంద్రత పెంచుకోవడానికి లేజర్‌ థెరపీని సూచిస్తున్నారు. దీంతోపాటు ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా ఇంజెక్షన్లను వాడడం ద్వారా తలపై జట్టు పెరుగుదలను ప్రేరేపించవచ్చు. అయితే ఈ విధానాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిఉంది. 

మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండడం, జుట్టుకు సంబంధించి సరైన కేర్‌ తీసుకోవడం, చుండ్రులాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడడంవంటివి పాటించడంతో బట్టతల రాకను వాయిదా వేయవచ్చు. – డి. శాయి ప్రమోద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top