మండే ఎండల్లో పచ్చి ఉల్లిపాయలు తినొచ్చా? | Is It Okay To Eat Raw Onions During The Scorching Heat, Know Its Health Benefits, Myths And Risks Explained | Sakshi
Sakshi News home page

మండే ఎండల్లో పచ్చి ఉల్లిపాయలు తినొచ్చా?

May 31 2026 11:09 AM | Updated on May 31 2026 1:38 PM

Heatwave: Is It Okay To Eat Raw Onions During The Scorching Heat

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి పూర్వ కాలపు వేసవి చిట్కాలను ఆశ్రయిస్తున్నారు. మజ్జిగ నుంచి నానబెట్టిన సబ్జా గింజలు, పచ్చి ఉల్లిపాయల వరకు... సాంప్రదాయ చలవ చేసే ఆహారాలు ఇప్పుడు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. అయితే ఈ చిట్కాలలో కొందరు వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తినాలని కచ్చితంగా చెబుతుంటే, మరికొందరు ఇవి ఎసిడిటీకి కారణమవుతాయని, కాబట్టి వీటిని అస్సలు తినకూడదని నమ్ముతారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు నిజంగా పచ్చి ఉల్లిపాయలు తినవచ్చా? అవి సమస్యను మరింత తీవ్రం చేస్తాయా? వంటి ప్రశ్నలకు సమాధానం ఇదిగో..

డీహైడ్రేషన్‌ను తగ్గించడంలో పచ్చి ఉల్లిపాయలు సహాయపడతాయని చాలామంది నమ్ముతారు. పచ్చి ఉల్లిపాయలు వేడి వాతావరణంలో శరీరానికి కొన్ని విధాలుగా సహాయకరమే కానీ వాటిని ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి సమస్యలు కూడా రావచ్చు. తరతరాలుగా ఉల్లిపాయలకు, వేసవి కాలానికి బలమైన సంబంధం ఉంది. చాలా ఇళ్లలో, ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు భోజనంతో పాటు ఉల్లిపాయ ముక్కలు తింటారు. ఉల్లిపాయలు వడగాల్పులు నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయని  గ్రామాలు, చిన్న పట్టణాల ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు.

ఉల్లిపాయలు, ఎండ నుండి రక్షణకు సంబంధించి రాజస్థాన్‌లో ఒక ఆసక్తికరమైన సాంప్రదాయ పద్ధతి కూడా ఉంది. రాజస్థాన్‌లోని ఒక సాంప్రదాయం ప్రకారం, ప్రజలు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తమ ఛాతీపై, చెవుల వెనుక ఉల్లిపాయ పేస్ట్‌ను రుద్దుకుంటారు. సైన్స్ ప్రతి సాంప్రదాయ చిట్కాను పూర్తిగా నిర్థారించకపోవచ్చు. కానీ ఈ పద్ధతులు చాలా వరకు తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

వేసవి కాలంలో ఉల్లిపాయలను ఉపయోగించడానికి ప్రధాన కారణం నీటి శాతం. పచ్చి ఉల్లిపాయలలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇది తీవ్రమైన వేడి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, శరీరం చెమట ద్వారా నిరంతరం నీటిని కోల్పోతుంది. కాబట్టి, ఎక్కువ నీటి శాతం ఉన్న ఆహారాలు శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయి.

అయితే వేసవిలో ఉల్లిపాయలు ఉపయోగపడటానికి అది ఒక్కటే కారణం కాదు. సాంప్రదాయ వైద్యం ప్రకారం, ఉల్లిపాయ మన శరీరంపై చలవ చేసే ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్, ప్రిబయోటిక్స్, మంచి నీటి శాతం ఉంటాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. అలాగే పచ్చి ఉల్లిపాయలు వడదెబ్బ నుంచి పూర్తి రక్షణ ఇవ్వలేవని.. అవి తమలోని పోషకాలు, నీటి శాతం కారణంగా శరీరానికి తోడ్పడగలవు కానీ, అవి మంచినీళ్లు తాగడానికి ప్రత్యామ్నాయం కాదంటున్నారు.

కొంతమంది ఎటువంటి సమస్య లేకుండా ప్రతిరోజూ వీటిని తినగలిగినప్పటికీ, మరికొందరు ఎక్కువ పచ్చి ఉల్లిపాయలను తిన్న తర్వాత ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలను ఎదుర్కోవచ్చుని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు, జీర్ణక్రియలో వచ్చే ఇబ్బందులు మరింత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అధికంగా పచ్చి ఉల్లిపాయలు తిన్న తర్వాత కొందరు అసౌకర్యంగా భావించడానికి కారణం ఇదే. ఇక్కడ సమస్య ఉల్లిపాయది కాదు, దానికి మన జీర్ణవ్యవస్థ ఎలా స్పందిస్తుందనేది ముఖ్యం.

ఎసిడిటీతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయలు తిన్న తర్వాత మరింత సమస్యను ఎదుర్కొంటారు. పచ్చి ఉల్లిపాయలు నేరుగా వడదెబ్బకు కారణమవుతాయని చెప్పడానికి ప్రస్తుతం ఎటువంటి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, ఎక్కువ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల వికారం, ఎసిడిటీ, కడుపు నొప్పి కలిగితే.. హీట్‌వేవ్ సమయంలో మనిషిని మరింత నీరసపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement