కిమ్ కర్దాషియాన్:'రోజుకు 35 సప్లిమెంట్లు తీసుకుంటా' | Health Tips: Kim Kardashian Says She Takes 35 Supplements A Day | Sakshi
Sakshi News home page

Kim Kardashian: 'రోజుకు 35 సప్లిమెంట్లు తీసుకుంటా': ఆరోగ్యానికి మంచిదేనా?

May 21 2026 5:32 PM | Updated on May 21 2026 6:14 PM

Health Tips: Kim Kardashian Says She Takes 35 Supplements A Day

అమెరికన్ రియాలిటీ టెలివిజన్ స్టార్, మోడల్, బిలియనీర్‌ కిమ్ కర్దాషియాన్ రోజకు 35 సప్లిమెంట్లు తీసుకుంటుందట. వాటిని రోజుకు మూడుసార్లుగా విభజించుకుని మరి తీసుకుంటానని ఇటీవల అమీ పోలర్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్నప్పుడు ఆమెనే స్వయంగా తెలిపింది. దీని కారణంగా 'పిల్ ఫెటీగ్' (మాత్రల అలసట)తో బాధపడుతున్నానని కూడా తెలిపింది. అయితే ఆ ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోలేక కొన్నాళ్లు ఆపేసినట్లు తెలిపింది. అయితే కొద్దిరోజుల్లనే మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రతిరోజూ ఈ మందులను నేరుగా శరీరంలోకి ఎక్కించుకునేలా ఐవీ డ్రిప్‌ ఉంటే బాగుండును ప్రతిసారి వర్క్‌టైంలో గుర్తుపెట్టుకుని వేసుకోలేక అవస్థ పడుతున్నా అని బాధగా చెబుతుంది. అసలు నిజంగా ఒక మనిషి ఇన్ని సప్లిమెంట్లు తీసుకోవచ్చా? ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అంటే..

సప్లిమెంట్లు అదనపు పోషణను అందించి, పోషకాహార లోపాలను భర్తీచేయడంలో సహాయపడినప్పటికీ, రోజుకు 35 సప్లిమెంట్లు అంటే.. సురక్షితం కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి తీవ్రమైన హాని అని, అవయవాలు దెబ్బతినొచ్చు లేదా జీర్ణ సమస్యలు, కణజాలంలో విషపదార్థాలు పేరుకుపోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

సప్లిమెంట్లు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని నొక్కి చెబుతున్నారు. ఇవి కేవలం పోషకాహార లోపాలకు చికిత్స చేయడానికి, ఇతర వ్యాధులకు , అనారోగ్య సమస్యల నుంచి బయపడటానికి ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా శరీరం కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె లను నిల్వ చేసుకోగల సామర్థ్యం కారణంగా, వాటిని అధికంగా తీసుకుంటే చాలా ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. 

అంతేకాకుండా, కొన్ని సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయానికి నష్టం, మూత్రపిండాల్లో రాళ్లు, జీర్ణ సమస్యలు, నరాల దెబ్బతినడం, ఔషధాల మధ్య ప్రతిచర్యలు తదితరాలు సంభవిస్తాయని అన్నారు. ఇదేదో  ట్రెండ్‌లా లేదా సెలబ్రిటీలు వాడుతున్నారనో అస్సలు తీసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు.  

సప్లిమెంట్లను అధికంగా తీసుకుంటే వచ్చే ఆరోగ్య ప్రమాదాలు

1. విటమిన్ విషప్రభావం (విటమిన్ టాక్సిసిటీ)
అధిక మోతాదు తీసుకోవడం వల్ల మూత్రపిండాల దెబ్బతినడం, కాలేయం దెబ్బతినడం, కడుపునొప్పి, విరేచనాలు, నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

2. ఖనిజాల అధిక భారం (మినరల్ ఓవర్‌లోడ్)
విటమిన్ల మాదిరిగానే, ఖనిజాల అధిక భారం కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, సప్లిమెంట్ల రూపంలో తీసుకునే అదనపు ఐరన్ తీవ్రమైన జీర్ణాశయ సంబంధిత సమస్యలను కలిగించి, కాలక్రమేణా కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

ప్రమాదకరమైన ఔషధ రియాక్షన్‌ (డ్రగ్ ఇంటరాక్షన్స్)
సప్లిమెంట్లు శరీరం మందులను ప్రాసెస్ చేసే విధానాన్ని మార్చగలవు. ఉదాహరణకు, విటమిన్ కె రక్తాన్ని పల్చబరిచే మందుల (బ్లడ్ థిన్నర్స్) ప్రభావాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అధిక వినియోగం
బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, ఎనర్జీ బార్‌లు,  జ్యూస్‌ల వంటి అనేక రోజువారీ ప్రాసెస్ చేసిన ఆహారాలలో విటమిన్లను అధికంగా కలుపుతారు. రోజువారీ మల్టీవిటమిన్‌ల తోపాటు నిర్దిష్ట లక్షిత సప్లిమెంట్లు తీసుకుంటే మాత్రం తెలియకుండానే అధికంగా తీసుకునే ప్రమాదం ఉంటుందట
పరిగణించవలసిన భద్రతా చిట్కాలు

ఏ రకమైన ఆహార సప్లిమెంట్లు అయినా వాడే ముందు వైద్యుల పర్యవేక్షణ, సలహాలు, సూచనలతో తీసుకోవాలి. అలాగే మనం వాడే సప్లిమెంట్లు మంచి నమ్మదగిన బ్రాండ్‌వేనా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సప్లిమెంట్‌ వాడుతున్నప్పుడు వికారం, కడుపు నొప్పి, కామెర్లు, గుండె దడ లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణమే వైద్యులను సంప్రదించి వాడొచ్చో లేదా నిర్థారించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ప్రిజర్వేటివ్స్‌..! ఈ బామ్మ చేసే ఐస్‌క్రీమ్‌కి ఫిదా అవ్వాల్సిందే..)

 

 

Advertisement
 
Advertisement
Advertisement