నీట్‌గా ఉందాం..ఆ మొక్కల చిక్కులొద్దు! | Health Tips: Fungal infections: Pathogenesis antifungals and alternate | Sakshi
Sakshi News home page

'ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌': నీట్‌గా ఉందాం..ఆ మొక్కల చిక్కులొద్దు!

May 12 2026 4:58 PM | Updated on May 12 2026 5:05 PM

Health Tips: Fungal infections: Pathogenesis antifungals and alternate

మొక్కలు నేల మీదే పెరుగుతూ ఉంటాయన్నది అపోహ. కానీ అవి నేల మీదే కాదు... మానవుల చర్మం సహా అన్ని రకాల జంతువుల దేహాల మీదా, మొక్కల మీద కూడా పెరుగుతుంటాయి. మనుషుల చర్మం మీదే కాదు... వెంట్రుకల మీదా, గోళ్ల మీద కూడా పెరుగుతాయి. దీనికి తార్కాణాలను మనం చాలాసార్లు అనుభవించే ఉంటాం. కానీ అవి మన దేహం మీద పెరిగే ‘ఫంగస్‌’ కారణంగా అని తెలియదు. ఉదాహరణకు తప్పని పరిస్థితుల్లో తడి అండర్‌వేర్‌ తొడుక్కున్న సమయాల్లో గజ్జల్లో ఒరుసుకుపోయినట్లు కావడం, తొడలు, పిరుదులు, ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద చర్మం నల్లబారి దురదగా అనిపించడం, గోరు మీద గోరుచుట్టు... ఇవన్నీ ఫంగస్‌ పెరుగుదల వల్ల కనిపించేవే. వీటినే ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ లేదా ఫంగల్‌ డిసీజెస్‌గా పేర్కొంటారు. సాధారణంగా మన దేహంలోని అనేక చోట్ల పెరిగే ఫంగల్‌ డిసీజెస్‌ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం...

నిజానికి ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ అనేవి దేహంలో అక్కడా ఇక్కడా అని కాకుండా ఎక్కడైనా రావచ్చు. అందుకే ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను అబిక్విటస్‌ అంటారు. నిజానికి నేల (సాయిల్‌) మీద లేదా పండ్ల మీద కూడా కుళ్లుతున్నచోట ఇవి  మొలుస్తుంటాయి. పండ్లు కుళ్లడానికి కారణం ఈ ఫంగసే. 

వృథా పదార్థాలన్నీ మళ్లీ ఖనిజలవణాల్లా  రూపంలోకి మారిపోయి తమ మౌలికమైన అణువులుగా తనలో  కలిసిపోడానికి ప్రకృతి తన కోసమే ఈ ఫంగల్‌ రూపాలనుసృష్టించుకుందని చెప్పవచ్చు. అలా చూసినప్పుడు ఫంగస్‌ జీవులు ప్రకృతికి మేలే చేస్తాయి.

పూర్తిగా మొక్కలూ కావు... సూక్ష్మజీవులూ కావు... 
జీవశాస్త్రపరం (బయలాజికల్‌)గా చూసినప్పుడు మొదట్లో వాటిని మొక్కల్లోని ఒక విభాగంగా చూసేవారు. అందుకే వృక్షశాస్త్రం (బాటనీ)లోని ఒక విభాగంగానే వాటి అధ్యయనం కొనసాగేది. కానీ వాటిలోనే పలు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అవి పూర్తిగా మొక్కలూ కావనీ, అలాగని పూర్తిగా సూక్ష్మజీవుల కింద కూడా వాటిని పరిగణించలేమని తేలింది. 

దాంతో ఫంగస్‌లను ఇప్పటికీ వృక్షశాస్త్రవిభాగంలోనే చదువుతున్నప్పటికీ... వాటి గురించి చాలా లోతుగా, సూక్ష్మంగా అధ్యయనం చేసేవారు మాత్రం ఫంగస్‌లను ‘మైకాలజీ’ అనే ఓ ప్రత్యేక శాస్త్రవిభాగంగా పరిణమిస్తుంటారు.

ఫంగస్‌ రకాలు... 
ఫంగస్‌లోని రకాలను వర్గీకరించేటప్పుడు వాటిలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు...

ఆకృతిని బట్టి : వాటి ఆకారాన్నీ / ఆకృతిని బట్టి వర్గీకరణ చేస్తే... ఈస్ట్‌ అనీ, మౌల్డ్స్‌ అనీ వర్గీకరించవచ్చు, ఇందులో ఈస్ట్‌ అనేవి ఆహారాన్ని పులిసేలా చేస్తూ మనకు ఉపయోగపడుతుంటాయి. కానీ మౌల్డ్స్‌ మాత్రం ఆహారానికి బూజులా పట్టి మన ఆహారాలను తినడానికి యోగ్యం కాకుండా చేస్తాయి. (ఉదాహరణకు బ్రెడ్‌ను అలాగే వదిలేస్తే ఆకుపచ్చరంగులో బూజు రావడం మనకు తెలిసిందే).

స్పీషీస్‌ (ప్రజాతులను) ఆధారంగా: ఫంగస్‌ ప్రజాతులను అంటే వాటి స్పీషీస్‌ను బట్టి చూసినప్పుడు... డెర్మటోఫైట్‌ స్పీషీస్, క్యాండిడా స్పీషీస్, మలేసేజియా స్పీషీస్‌ అనే రకాలు ఉంటాయి. మన దేహంపై వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌లో చర్మంపై వచ్చేవి డర్మటోఫైట్స్‌ స్పీషీస్‌కు చెందినవనీ, ఇక గజ్జలు లేదా చర్మం ముడతల్లో వచ్చే ఎర్రటి ఇన్ఫెక్షన్‌ను క్యాండిడా స్పీషీస్‌వని చెప్పవచ్చు.

ఇన్ఫెక్షన్‌ తీవ్రతను బట్టి :  చర్మంపై వాటి తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే వాటిని ఉపరితలానికే పరిమితమయ్యేవి (సూపర్‌ఫీషియల్‌), చర్మంలోపల చాలా లోతుగా ఇన్ఫెక్ట్‌ చేసేవి (డీప్‌ స్కిన్‌) అని వర్గీకరించవచ్చు. సాధారణంగా చాలా రకాల ఇన్ఫెక్షన్స్‌ పైపైనే వస్తాయి. కానీ ఎయిడ్స్‌ వ్యాధి సోకినవారిలో వచ్చేవి చాలా డీప్‌ స్కిన్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ అయి ఉంటాయి.

ఎన్విరాన్‌మెంట్‌ను బట్టి చూస్తే : మన పర్యావరణంలో అవి పెరిగే చోటను బట్టి కూడా ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు నేల మీద పెరిగేవాటిని జియోఫిలిక్‌ అనీ, జంతువులపై నివసించేవాటిని జూఫిలిక్‌ అనీ, కేవలం మానవుల దేహంపైనే పెరిగేవాటిని ‘యాంథ్రపోఫిలిక్‌’ అని అంటారు.

సాధారణంగా అడల్ట్స్‌లో వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు

టీనియా కార్పోరిస్‌ : ఇది టైకోఫైటాన్‌ రబ్రబ్‌ అనే పంగ్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌. ఇది  పాదాలూ, చేతులు, మర్మావయవాలు (ప్రైవేట్‌ ΄పార్ట్స్‌) మినహా దేహంలో ఎక్కడైనా వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. ఇది అన్ని వయసుల వారిలోనూ రావచ్చు. ముఖ్యంగా పాడిపశువుల, పందుల పెంపకంలో నిమగ్నమయ్యేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొందరిలో వారాలూ, నెలలూ, కొన్ని సందర్భాల్లో కొన్నేళ్ల పాటు కూడా ఏమాత్రం మానకుండా అదేపనిగా కనిపిస్తూ ఉంటుంది. చాలాసందర్భాల్లో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం దురద రావచ్చు. కొందరిలో మాత్రం చిన్నవి మొదలుకొని పెద్దగా ఉండే ఎర్రటి, గుండ్రటి, అంచులు ఉబ్బినట్టుగా కనిపించే ప్యాచ్‌లు రావచ్చు. 

ఈ గుండ్రటి అంచులు అన్ని పక్కలకూ వ్యాప్తిస్తూ... మధ్యలోని చర్మం మామూలుగా ఉండవచ్చు. ఇలా వచ్చే రింగులు ఒకదారితో మరొకటి కలిపిపోయేంతగా విస్తరిస్తూ పెద్దగా పెరగవచ్చు. కొన్నిసార్లు పగుళ్లూ, పొక్కల వంటివి (బ్లిస్టర్స్‌ అండ్‌ గ్రాన్యులోమా) వంటివీ కనిపించవచ్చు. వీటినే మాజోకాస్‌ గ్రాన్యులోమా అని పిలుస్తారు. కొన్నిసార్లు కొందరిలో అంతగా ప్రకాశవంతంగా లేని వెండిరంగులో ఉండే సోరియాఫార్మ్‌ మచ్చల వంటివీ కనిపించవచ్చు. ఇది జంతువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.

టీనియా క్రూరిస్‌ (ధోబీస్‌ ఇచ్‌) : ఇది ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద కనిపించే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. దీన్నే సాధారణంగా అందరూ ‘ధోబీస్‌ ఇచ్‌’ లేదా ‘జాక్‌ ఇచ్‌’ అని పిలుస్తారు. ఒక్కోసారి ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద గడ్డ›రూపంలో వచ్చి బాధిస్తుంటుంది. ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర చెమట పట్టి తడిగా, చెమ్మతో ఉండే చోట్ల ఇది ఎక్కువగా వస్తుంటుంది. సాధారణంగా బిగుతైన దుస్తులు ధరించడం వల్లా... అలాగే స్థూలకాయం కారణంగా బట్టలు బిగుతుగా ఉన్నప్పుడూ... ఇక చాలాకాలంగా కార్టికోస్టెరాయిడ్స్‌ వాడుతున్నవారిలోనూ ఈ సమస్య కనిపించడానికి అవకాశాలు ఎక్కువ. 

డయాబెటిస్‌ ఉన్నవారిలో ఈ సమస్య తరచూ వస్తూ ఉంటుంది. నెలల నుంచి ఏళ్ల తరబడి బాధిస్తూ ఉండే అవకాశాలు ఎక్కువ. గతంలో పాదాలకు ‘టీనియా పెడిస్‌’ అనే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు మరీ మరీ ఎక్కువ. ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద ఎర్రటి / నల్లటి మచ్చలతో... అలాగే తరచూ దురదతో చాలా అసౌకర్యానికి గురిచేస్తుంటుంది. అయితే ఇది వృషణాల సంచి చర్మంపైనా లేదా పురుషాంగం పైనా పాకడం మాత్రం చాలా చాలా అరుదు.

టీనియా మ్యాన్యువమ్‌ : ఇది చేతులకు వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. ఒక్కోసారి కాళ్లలో కూడా రావచ్చు. చేతులపై దురద వస్తుంటుంది. ఇన్ఫెక్షన్‌ వచ్చిన చోట... మధ్యనుండే చర్మం బాగానే కనిపిస్తున్నా అంచులు స్పష్టంగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంటుంది. అరచేతుల వెనకవైపున కనిపిస్తూ... ఒక్కోసారి అరచేతుల్లో పగుళ్లు కనిపిస్తుంటాయి. దీనికి పూత మందులు పనిచేయవు. నోటి ద్వారా (ఓరల్‌గా)  ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్‌ వంటి మందులు వాడాలి.

టీనియా పెడిస్‌ (అథ్లెట్స్‌ ఫూట్‌) : ఆటలాడే వయసున్న పిల్లల్లోనూ, యుక్తవయసువారిలోనూ ఇది కనిపించడం వల్ల దీన్ని ‘అథ్లెట్స్‌ ఫూట్‌’ అంటారుగానీ... ఆటలకూ దీనికి సంబంధం ఉండదు. అయితే అరుదుగా కొందరిలో 50 ఏళ్ల వయసు వారిలోనూ కనిపించవచ్చు. అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. బిగుతుగా ఉండే ΄పాదరక్షలు (ఫుట్‌వేర్‌) వాడేవారిలోనూ, పాదాలకు చెమట ఎక్కువగా పట్టేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 

ఇందులో ప్రధానంగా రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి. పాదానికి వచ్చినప్పుడు చర్మం పొట్టులా రాలవచ్చు. అలాగే కొందరిలో కాలి బొటనవేలి కింద పగులులా రావచ్చు. సాధారణంగా కాలివేళ్లలో నాలుగు, ఐదో వేలి మధ్యన కనిపిస్తుండవచ్చు. ఎక్కువగా నీళ్లలో ఉండేవారిలో కనిపిస్తుంటుంది. ఇందులో రెండు రకాలుంటాయి. 

మడమకూ, మడమ అంచులకు మాత్రమే పరిమితైన దాన్ని ‘మోకాసిన్‌ టైప్‌’ అంటారు. ఒకవేళ పాదం / మడమ అంతటా నీటిబుడగలు, తిత్తుల రూపంలో కనిపిస్తే దాన్ని ‘బ్లూలస్‌ టైప్‌’ అంటారు. కాస్తంత వదులుగా, సౌకర్యంగా ఉండే పాదరక్షలు ధరించడం, స్నానం తర్వాత పాదాలను బెంజోల్‌ పెరాక్సైడ్‌తో శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చు. అలాగే క్లాకిమాజోల్, మైకోనజోల్, కీటోకెనజోల్, ఎకోనజోల్‌ వంటి పూతమందులతోనూ దీనికి చికిత్స అందించవచ్చు.

క్యాండిడియాసిస్‌ : ఇది ఈస్ట్‌ తరహా ఫంగస్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌. సాధారణంగా నోటిలోనూ లేదా ప్రైవేట్‌ పార్ట్స్‌ (మర్మావయవాల) వద్ద వస్తుంటుంది. అక్కడ నిత్యం చెమట పడుతూ తడిగా, చెమ్మగా ఉండటం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. క్యాండిడే అబ్బిలెన్స్‌ అనే ఒక రకం ఫంగస్‌... మానవుల నోటి నుంచి మలద్వారం వరకు ఉండే జీర్ణవ్యవస్థకు చెందిన మార్గం (గ్యాస్ట్రో ఇంటస్టినల్‌ ట్రాక్‌)లో కాలనీలుగా ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉంటుంది. 

దీని లక్షణాలను బ్యాక్టిరియల్‌ లక్షణాలుగా పొరబడి యాంటీబయాటిక్స్‌ వాడేవారిలో దీని తీవ్రత మరింత పెరిగి బాధిస్తుంది. స్థూలకాయం, డయాబెటిస్, ఎయిడ్స్, చర్మం ఎక్కువగా పట్టే గుణం, ఎండోక్రైన్‌ సమస్యలూ, స్టెరాయిడ్స్‌ వాడటం, దీర్ఘకాలిక జబ్బులున్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మం ఎర్రబారడం, దోక్కుపోయినట్టుగా ఉండటం వంటి లక్షణాలతో వ్యక్తమవుతుంది. కొందరు మహిళల్లో ఇది రొమ్ముల కింది భాగంలో ఎర్రబారినట్టుగా వ్యక్తమవుతుంది.

ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద వచ్చే క్యాండిడియాసిస్‌ : ఇది పురుషుల్లో మర్మావవం వద్ద... అలాగే మహిళల్లో యోని వద్ద కనిపిస్తుండే ఒక రకం ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. ఇందులో వుల్వైటిస్, వుల్వోవెజినైటిస్, బెలనైటిస్, బెలనో΄ోస్థైటిస్‌ వంటి రకాలు ఉంటాయి. పూతమందులతో, నోటి ద్వారా వాడే మందులతో ఈ ఇన్ఫెక్షన్‌ను తగ్గించవచ్చు.

శోభి మచ్చలు (పిటిరియాసిస్‌ వెర్సికలర్‌) : తెలుగులో శోభిమచ్చలు అని పిలిచే ఈ తెల్లమచ్చలు / తెల్లపొడ కూడా ఒక రకం ఫంగస్‌ వల్లనే వస్తుంది. ఈ సమస్యలో ఎలాంటి నొప్పీ, బాధా లేకపోయినప్పటికీ కాస్తంత అసహ్యంగా కనిపిస్తూ కాస్మటిక్‌గా ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక్కోసారి ఒక మచ్చపైకి మరో మచ్చ పెరుగుతూ ‘మలసేజియా ఫర్‌ఫర్‌’ అనే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. 

ఎక్కువగా బాగా వేడి వాతావరణంలో ఉండేవారిలోనూ, బాగా చమటలు పడుతూ అవి త్వరగా ఆరి΄ోని పరిస్థితుల్లోనూ, జిడ్డు చర్మం ఉన్నవారిలోనూ ఈ సమస్య ఎక్కువ. అలాగే ఎయిడ్స్‌ వంటి జబ్బు ఉన్నవారిలో ఈ ఫంగస్‌ వచ్చే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో బాగా పెరుగుతుంది. కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా కనిపిస్తుంటుంది. కొందరిలో కాస్త దురదలూ కనిపించవచ్చు.

కొందరిలో ఈ సమస్యతో ఒక్కోసారి చర్మం పొట్టులా, పొలుసుల్లా రాలిపోతూ ఉండవచ్చు. ఛాతీ, భుజాలూ, మెడ, వీపు, పొట్ట, అరుదుగా కొందరిలో ప్రైవేట్‌ పార్ట్స్, తొడల వద్ద ఈ సమస్య కనిపించవచ్చు. కర్రదీపంలో చూసినప్పుడు ఈ సమస్య ఉన్నచోట చర్మం నీలి, ఆకుపచ్చ మెరుపుతో కనిపిస్తుంది. ఈ సమస్యకు కీటకెనజోల్‌ షాంపూలు వాడుతూ, కీటకెనజోల్‌ క్రీమ్, క్లాట్రిమాజోల్‌ క్రీమ్‌ వంటి పూత మందులు వాడుతూ... నోటి ద్వారా (ఓరల్‌గా) ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్‌ వంటి మందులు తీసుకోవడం ద్వారా చికిత్స చేయవచ్చు.

వెంట్రుకల్లో వచ్చే టీనియా రకాలు  
టీనియా క్యాపిటిస్‌ : ఇది రోమం అంకురంలో వచ్చే ఇన్ఫెక్షన్‌. టీనియా క్యాపిటిస్‌   మాడు మీద వస్తే పేనుకొరుకుడులా కనిపిస్తుంది. పిల్లల్లో యుక్తవయసుకంటే ముందుగా అంటే... 6 – 10 ఏళ్లవారిలో ఎక్కువగా వస్తుంటంది. తలలో పొలుసుల మాదిరిగా కనిపిస్తాయి. వెంట్రుకలు విరిగిపెతుంటాయి. తలలో మొటిమల్లా వస్తూ కొన్నిసార్లు అక్కడ చీము వంటి స్రావం కనిపిస్తుండవచ్చు. 

చివరగా... అక్కడి వెంట్రుకలన్నీ గుండ్రని ఆకృతిలో రాలిపోయి మచ్చలా (స్కారింగ్‌ అలొపేషియాగా) కనిపిస్తుంటుంది. ఇది స్కూలు పిల్లల్లో వచ్చినప్పుడు ఒక చిన్నారి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో ఉండే స్కూళ్లలో పిల్లలను దగ్గర దగ్గరగా కూర్చోబెట్టినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. 

ఒక్కోసారి ఒకరు వాడిన దువ్వెనను మరొకరు వాడినప్పుడూ ఇది వ్యాప్తి చెందుతుంటుంది. ఇందులోని ఒక రకాన్ని ‘బ్లాక్‌ డాట్‌’ అంటారు. ఇందులో మాడుపైన రోమమూలంలో వెంట్రుక విరిగిపోతుంది. వెంట్రుక మూలం దగ్గర క చుక్కలాగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి ఉబ్బిన చుక్కల గుంపు అంతా ఒక ప్యాచ్‌లా కనిపిస్తుంటుంది.

ఇక ‘గ్రే ప్యాచ్‌’ అనే మరోరకం మచ్చ వచ్చిన చోట కూడా వెంట్రుకలన్నీ విరిగిపోయి... అక్కడ ఓ గోధుమ రంగు ప్యాచ్‌లా అది కనిపిస్తుంటుంది. ఈ ప్యాచ్‌లో పొలుసులన్నీ కాస్తంత ఎరుపురంగుకు తిరిగి మచ్చలా కనిపిస్తాయి. ఈ సమస్యలోనూ వెంట్రుకలన్నీ విరిగి రాలిపోయి పేనుకొరుకుడు మచ్చలా కనిపిస్తాయి. కర్రమంట వెలుగులో చూస్తే ఈ మచ్చ... ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది.

టీనియా బార్బే : ఇది మాత్రం గడ్డంలో వచ్చి... అక్కడ పేనుకొరుకుడులా కనిపిస్తుంది. కొన్నిసార్లు మీసంలోనూ కనిపిస్తుంది. గడ్డం లేదా మీసంలోని వెంట్రులన్నీ రాలిపోవడంతో అక్కడ పేనుకొరుకుడు మచ్చ కనిపిస్తుంది.

ఆగ్మినేట్‌ ఫ్యాలుక్యులైటిస్‌ : ఇది కూడా కీకన్‌ లాగే ఎర్రటి మచ్చలతో కనిపించేదే అయినా... దీనిలో నొప్పి తీవ్రత తక్కువ.

ఫేవస్‌ : ఇందులో రోమమూలంలో ఎర్రగా కనిపిస్తుంటుంది. వెంట్రుకలు ఒకదానితో మరొకటి కలిసి పోయినట్లుగా చిక్కుబడినట్టుగా అల్లుకుపోయి కనిపిస్తుంటాయి. వెంట్రుకల మొదళ్లలో మొదటి ఎరుపురంగులో కనిపించేవి కాస్తా తర్వాత ఉబ్బినట్టుగా పసుపు పొక్కుల్లా కనిపిస్తుంటాయి. 

రోమంతో పాటుగా అక్కడి చర్మం కూడా శిథిలమై వెంట్రుక కుప్పగా పడిపోవడం వల్ల అది పసుపు పొక్కులా కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి నుంచి దుర్వాసన కూడా రావచ్చు. ఒక్కోసారి వెంట్రుకలన్నీ రాలిపోయి పేనుకొరుకుడుగా కనిపించవచ్చు.

పిల్లల్లో సమస్య నివారణ / చికిత్స...
స్కూలు పిల్లల తల ఆరోగ్యంగా ఉందా లేదా అని తల్లిదండ్రులు తరచూ వాళ్ల తలలను / మాడును పరిశీలిస్తూ ఉండాలి.

కీటోకొనజాల్‌తో పాటు సెలేనియమ్‌ సల్ఫైడ్‌ ఉన్న షాంపూలతో తల స్నానం చేయిస్తూ ఉండటం వల్ల ఫంగస్‌ల వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చు.

పైపూత (టాపికల్‌ మెడిసిన్‌)గా రాయాల్సిన యాంటీ ఫంగల్‌ పూత మందులను వాడటం ద్వారా కొన్ని రకాల ఫంగస్‌లకు చికిత్స చేయవచ్చు.

నోటి ద్వారా యాంటీ ఫంగల్‌ మందులు ఇవ్వడం ద్వారా చేసే చికిత్స : గ్రీసియోఫల్విన్‌ మందులుగా చెప్పే యాంటీ ఫంగల్‌ మందులతో ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించవచ్చు. ఇక వాటితో పాటు టెర్బినాఫిన్స్, ఇట్రాకెనజోల్, ఫ్లూకోనజోల్, కీటాకెనజోల్‌ వంటి మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ల విచక్షణ మేరకు చర్మంపైన వచ్చే ఎర్రటి మచ్చలను తగ్గించడానికి అవసరమైతే కొన్నిసార్లు కార్టికోస్టెరాయిడ్స్‌ కూడా ఇవ్వాల్సిరావచ్చు. పరిస్థితి కాస్త తీవ్రమై... ఇన్ఫెక్షన్‌ గనక మొదటి దశ దాటిపోతే అది బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ కూడా సోకే (సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌) దశకు చేరితే అప్పుడు యాంటీబయాటిక్స్‌ కూడా ఇవ్వాల్సి రావచ్చు.

గోళ్లకు వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌...

టీనియా అన్‌గ్యువమ్‌ : ఇది గోరు (నెయిల్‌ ప్లేట్‌)కు వచ్చే ఫంగస్‌. ట్రైకోఫైటాన్, రబ్రమ్, ట్రైకోఫైటాన్‌ మెంటారోఫైట్స్, ఎపిడర్మోఫైటాన్‌ ఫ్లోకసమ్‌ వంటి ఫంగల్‌ రకాల వల్ల ఈ ఇన్ఫెక్షన్స్‌ వస్తుంటాయి. ఇందులో గోటికి ఇరువైపులా ఉండే గోరుభాగం పైకి వచ్చిన చర్మం ముడతల నుంచి వ్యాపిస్తుంది. గోరు తన పారదర్శకతను క్రమంగా కోల్పోతుంది. 

శిథిలం అవుతుంది. కట్‌ చేసినప్పుడు స్పష్టంగా తెగకుండా... పొట్టుగా రాలిపోతుంది. యుక్తవయసుదాటిన వారిలో, బలహీనమైన గోళ్లు ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలెక్కువ. ఇందులో డిస్టల్‌ అండ్‌ ల్యాటరల్‌ సబ్‌ అన్‌గ్యువల్‌ ఒనైకోమైకోసిస్, సూపర్‌ఫీషియల్‌ వైట్‌ ఒనైకోమైకోసిస్, ప్రాక్సిమల్‌ సబ్‌ అన్‌గ్యువల్‌ ఒనైకోమైకోసిస్‌ వంటి రకాలూ ఉంటాయి. 

త్వరగా చికిత్స తీసుకుంటే త్వరగా తగ్గే అవకాశం. పూతమందులు పనిచేయవు. ఇట్రకెనజోల్, టర్బినాఫిన్‌ వంటి మందులు వాడాలి. చివరగా... ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, ఎప్పుడూ తగిన హైజీన్‌ పాటిస్తూ శుభ్రంగా ఉండేవారిలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు చాలా తక్కువ. అందుకే ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల నివారణలో కీలక భూమిక పోషిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.

డాక్టర్‌ విజయ గౌరి బండారు, సీనియర్‌ కన్సల్టెంట్‌ డర్మటాలజిస్ట్‌ అండ్‌ కాస్మటాలజిస్ట్‌ 

Advertisement
 
Advertisement
Advertisement