కాఫీ వృద్ధాప్యాన్ని తగ్గించగలదా? | Health Tips: coffee intake linked to slower biological aging in People | Sakshi
Sakshi News home page

కాఫీ తాగే అలవాటు ఉందా? అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు

May 12 2026 11:35 AM | Updated on May 12 2026 11:39 AM

 Health Tips: coffee intake linked to slower biological aging in People

కాఫీ మితంగా తాగటం వల్ల ఆయుష్షు పెరుగుతుందనేది శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతూ వస్తున్నదే. అయితే తాజాగా ఆ విధంగా ఆయుష్షు పెరగడానికి మూల కారణాన్ని పరిశోధకులు కనిపెట్టారు. మన శరీర కణాల్లోనే ఆ మర్మం దాగి ఉందని టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీలోని వెటర్నరీ మెడిసిన్‌ అండ్‌ బయోమెడికల్‌ సైన్సెస్‌ అధ్యయనంలో తేలింది.

ఇంతవరకు తెలిసింది కాఫీలోని కొన్ని పదార్థాలు మన శరీరంలోని కణాలలో ఉండే ఒక నిర్దిష్ట ఎంజైమ్‌ను ప్రేరేపిస్తాయి. ఆ ఎంజైమ్‌ కణాల వయసు త్వరగా పెరగనివ్వకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ (మంట, వాపులు) నయం అవుతాయి. దాంతో హృద్రోగాలు వచ్చే ముప్పు తగ్గుతుంది. రోజుకు ఇన్ని కప్పులు అని మితంగా కాఫీ తీసుకోవడం వల్ల జీవక్రియలు మెరుగుపడి, వృద్ధాప్య లక్షణాలు నెమ్మదిస్తాయి.

ఇప్పుడు తెలుసుకున్నది మన శరీర ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని నిర్ణయించే కణ స్థాయిలోని ‘నియంత్రణ వ్యవస్థే’కాఫీ సేవించే అలవాటు ఉన్నవారిని ఆరోగ్యంగా ఉంచుతోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనినే ‘టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీ’ పరిశోధకులు ‘బయోలాజికల్‌ స్విచ్‌’అంటున్నారు. మనం సేవించే కాఫీ కణాల్లోని అటువంటి ఒక స్విచ్‌ను ఆన్‌ చేయడం ద్వారా మనం వృద్ధులుగా మారటాన్నినెమ్మదింపజేస్తోందన్న మాట.  

ఏమిటీ ‘బయొలాజికల్‌ స్విచ్‌’?  
మన శరీరంలోని కణాలలో కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు లేదా అణువులు ఉంటాయి. ఇవి బయట నుండి వచ్చే సంకేతాల (ఉదా: మనం కాఫీ తాగినప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు వచ్చే సంకేతాలు) ద్వారా శరీరంలో కొన్ని రసాయన ప్రక్రియలను ‘ఆన్‌’లేదా ‘ఆఫ్‌’అయ్యేలా చేస్తాయి. వీటినే బయోలాజికల్‌ స్విచ్‌లు అంటారు. 

కాఫీ తాగినప్పుడు అది శరీరంలోని ఒక నిర్దిష్ట స్విచ్‌ను ‘ఆన్‌’చేస్తుంది. ఈ స్విచ్‌ ఆన్‌ అయినప్పుడు మన కణాలు తమను తాము శుభ్రం చేసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. మేలు చేసే కొన్ని ఎంజైమ్‌లు కూడా విడుదల అవుతాయి. దీనివల్ల వృద్ధాప్యం లక్షణాలు ఆలస్యమవుతాయి. అలాగే మన శరీరంలోకి ఏదైనా వైరస్‌ చొరబడినప్పుడు,ఒక బయోలాజికల్‌ స్విచ్‌ ‘ఆన్‌’అయ్యి తెల్ల రక్తకణాలను యుద్ధానికి పంపిస్తుంది. వైరస్‌ చనిపోయాక, ఆ స్విచ్‌ మళ్లీ ‘ఆఫ్‌’అవుతుంది.  

సాక్షి స్పెషల్‌ డెస్క్‌

 

Advertisement
 
Advertisement
Advertisement