Health Tips: బర్త్‌ ప్లాన్‌ అంటే ఏమిటి? డెలివరీ టైమ్‌లో..

Health Tips By Bhavana Kasu: What Is Birth Plan Detail Explanation - Sakshi

డాక్టర్‌ సలహా

నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. చాలా ఆసుపత్రుల్లో బర్త్‌ ప్లాన్‌ ఆఫర్‌ చేస్తున్నారని తెలిసింది. అసలు ఈ బర్త్‌ ప్లాన్‌ అంటే ఏంటండీ? – కె. అమరజ, నాగర్‌ కర్నూల్‌

బిడ్డకు జన్మనివ్వడం అనేది ప్రతి తల్లికి మరచిపోలేని అనుభవం.. అనుభూతి. అలాంటి ప్రసూతికోసం ఉన్న చాయిసెస్‌ ఏంటో తెలుసుకుని వాటిల్లో మీరు సెలెక్ట్‌ చేసుకున్న చాయిస్‌ను ముందుగానే డాక్టర్‌కు, స్టాఫ్, నర్సెస్, మిడ్‌వైఫ్‌కి తెలియజెప్పే అవకాశాన్ని బర్త్‌ ప్లాన్‌ ఇస్తుంది. ప్రసవ ప్రక్రియ ఎప్పుడు ఎలా మొదలవుతుందో చెప్పడం కష్టం.

డెలివరీ టైమ్‌లో ఎలా ఉండాలనుకుంటున్నారు డాక్టర్, స్టాఫ్‌ సపోర్ట్‌ ఎంత వరకు కావాలనుకుంటున్నారు.. ఎలాంటి వాతావరణంలో ప్రసవాన్ని కోరుకుంటున్నారు.. ఎలాంటి మందులు వాడాలి.. పెయిన్‌ రిలీఫ్‌కి ఏవి కావాలి .. ప్రసవమప్పుడు ఎలాంటి సాయం పొందాలనుకుంటున్నారు.. వంటి విషయాలన్నిటినీ మీరు, మీ భర్త ఇద్దరూ కలసి డాక్టర్స్‌తో చర్చించే అవకాశాన్ని ఈ బర్త్‌ ప్లాన్‌ ఇస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే బర్త్‌ ప్లాన్‌ అనేది మీ ప్రసవానికి ఒక గైడ్‌ లాంటిది. దీని గురించి ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెల మధ్యలో ఎప్పుడైనా గైనకాలజిస్ట్‌తో డిస్కస్‌ చేయొచ్చు. మీకు ప్రెగ్నెన్సీతో పాటు ఏ ఇతర అనారోగ్య సమస్యలు లేకపోతే ఇప్పుడు మీరు మీ బర్త్‌ ప్లాన్‌ను పూర్తిగా ఫాలో అవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీకు కానీ.. బిడ్డకు కానీ మెడికల్‌ ఇంటర్‌వెన్షన్‌ అవసరమయ్యి డాక్టర్‌ మీ బర్త్‌ ప్లాన్‌ను ఫాలో కాలేకపోతే ఆ విషయాన్ని మీకు ముందుగానే చెప్పి మీకున్న ఆప్షన్స్‌ గురించి డిస్కస్‌ చేస్తారు.

ఈ బర్త్‌ ప్లాన్‌లో.. మీ డెలివరీ టైమ్‌లో మీతోపాటు ఎవరు ఉండాలనుకుంటున్నారు.. మీ హజ్బెండ్‌ లేక మీ అమ్మగారు, లేదంటే మిడ్‌వైఫ్‌ లేక ఫ్రెండ్‌ .. ఇలా మీరు ఎవరిని కోరుకుంటున్నారు.. మీతో పాటు ఎవరు ఉండాలనుకుంటున్నారో సజెషన్స్‌లో ముందే పేర్కొనవచ్చు..

మీ ప్రసవమప్పుడు  బీన్‌ బాగ్స్, బర్తింగ్‌ బాల్స్, మాసాజెస్, లేదా అటూ ఇటూ నడవడం వంటి వాటిలో ఏవి కావాలనుకుంటున్నారు.., సంగీతం వినాలనుకుంటున్నారా? ఒకవేళ సంగీతం వినాలనుకుంటున్నట్టయితే  మంద్రమైన సంగీతాన్ని ఇష్టపడ్తారా? పెద్ద సౌండ్‌ అంటే చిరాకుగా ఉందా? మంద్రమైన కాంతి లేదా బ్రైట్‌ లైట్‌.. మరీ చల్లగా ఇష్టమా? లేక వేడిగా.. వెచ్చగా ఇష్టమా? ఎలాంటి పెయిన్‌ రిలీఫ్‌ కావాలనుకుంటున్నారు? పారాసిటమాల్, ఎంటోనాక్స్‌ (గ్యాస్‌), ఇంజెక్షన్స్, ఎపిడ్యూరల్‌ ఎనాల్జెసికా? సహజంగా నొప్పులు పెరగాలనుకుంటున్నారా?

లేక ఇంజెక్షన్స్, మాత్రలతో నొప్పులను పెంచమంటారా? ముందే వాటర్‌ బ్రేక్‌ (ఉమ్మనీరు పోయేలా)అయ్యేలా చేయమంటారా? లేదా సహజంగా బ్రేక్‌ అయ్యేవరకు వేచి చూస్తారా? మాయ సహజంగానే పడిపోవాలా? లేక ఇంజెక్షన్స్‌ ద్వారానా? బిడ్డ బొడ్డు తాడు ఎవరు కట్‌ చేయాలి? మీరా? మీ భర్తా? లేక మిడ్‌వైఫ్‌ చెయ్యాలా? బిడ్డకు మీ పాలు పడతారా? లేక పోత పాలా? వంటి కొన్ని ఆప్షన్స్‌ను గైనకాలజిస్ట్‌ ఒక బుక్‌లెట్‌ రూపంలో మీకు తెలియజేస్తారు.

మీరు చర్చించుకొని ఆ ఆప్షన్స్‌ను ఎంచుకోవచ్చు. మీకు ఎప్పుడు నొప్పులు వచ్చినా ఈ బుక్‌లెట్‌లో మీరు ఇచ్చిన ఆప్షన్స్‌ను డాక్టర్లు ఫాలో అవుతారు. ఒకవేళ మీది హై రిస్క్‌ ప్రెగ్నెన్సీ అయితే ఎలాంటి ఆప్షన్స్‌ను ఫాలో అయితే మీకు సేఫ్‌గా ఉంటుందో వాటిని డాక్టర్లు మీకు సూచిస్తారు. వీటిన్నిటి వల్ల ప్రసవాన్ని గొప్ప అనుభవంగా.. మంచి అనుభూతిగా మలచుకునే వీలు ఉంటుందన్నమాట.  
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 
చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్‌నర్‌కు సంబంధించి
Beard Shaving: రోజూ షేవింగ్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top