
ఇండో–పాక్ యుద్ధం మొదలై అప్పటికి పదహారు రోజులు– ఆరోజు 1965 సెప్టెంబర్ 5, ఉదయం ఆరున్నర గంటలకు పాకిస్తాన్ యుద్ధవిమానాలు రెండు కొండలను చాటు చేసుకుని, భారత భూభాగంలోకి దూసుకొస్తున్నాయి. అవి శత్రుదుర్భేద్యమైన శాబర్‌జెట్ ఫైటర్ విమానాలు. జమ్ము–కశ్మీర్‌లోని తావి బ్రిడ్జిని సమీపించేలోగానే అక్కడి శిఖరం పైనుంచి భారత ఎయిర్‌క్రాఫ్ట్ గన్ గర్జించింది. మూడువేల అడుగుల ఎత్తులో 1300 కిలోమీటర్ల వేగంతో వస్తున్న శాబర్‌జెట్ విమానం పేలిపోయింది.
ఆ విమానాన్ని కూల్చిన వీరుడు మన ఆంధ్రుడు హవల్దార్ తాతా పోతురాజు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న శాబర్‌జెట్ విమానాలను 1942 నాటి మన పాత గన్‌లతో కూల్చడం సాధ్యం కాదనే భావనతో ఉన్న నాటి భారత సైన్యానికి పోతురాజు గురితప్పకుండా ఛేదించిన లక్ష్యం స్ఫూర్తినిచ్చింది. అదే ఉత్సాహంతో అప్పటి 27 ఏడీ రెజిమెంట్ ఏకంగా పన్నెండు పాక్ యుద్ధ విమానాలను కూల్చింది. ఇంతటి స్ఫూర్తికి కారకుడైన హవల్దార్ పోతురాజుకు భారత ప్రభుత్వం నాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ పురస్కారాన్ని బహూకరించింది.
తెనాలి సమీపంలోని నిజాంపట్నం గ్రామంలో రైతు కుటుంబంలోని ఐదుగురు కుమారుల్లో నాలుగోవాడు పోతురాజు, ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతుండగా ఒకరోజు తండ్రితో కలిసి పొలం వెళ్లి, వేరుశెనక్కాయలు ఆరబెట్టారు. అటుగా వెళుతున్న బావాజీపాలెం సైనికులు అక్కడాగి వేరుశెనక్కాయలు తింటూ కాసేపు కూర్చున్నారు. ‘నేను మిలటరీకి పనికొస్తానా?’ అని పోతురాజు వారిని అడిగాడు. తప్పకుండా పనికొస్తావని బదులిచ్చారు. ఎలాగోలా సైన్యంలో చేరాలనే కోరిక పుట్టింది. తండ్రికి భోజనం తీసుకువస్తానని చెప్పి, ఇంటికి బయలుదేరిన పోతురాజు, అటునుంచి అటే గుంటూరు ఆర్మీ సెలక్షన్స్‌కు వెళ్లాడు.
అందులో ఎంపికయ్యాక నాసిక్‌లో శిక్షణకు పంపారు. ఆవిధంగా 1958లో 18 ఏళ్ల వయసులో పోతురాజు సైన్యంలోకి ప్రవేశించాడు. అక్కడ స్పెషల్ టెస్ట్‌లో మంచి మార్కులు తెచ్చుకోవటంతో ‘యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్ ’ శిక్షణనిచ్చారు. స్క్రీన్ పై రకరకాల విమానాల కదలికలను గుర్తించే ‘స్పాటింగ్ టెస్ట్’లో పోతురాజు నూరుశాతం మార్కులు తెచ్చుకోవడంతో 27 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌లోకి తీసుకున్నారు. 1965 ఆగస్టు 14 నుంచి పాక్‌తో యుద్ధం తలెత్తినప్పుడు పోతురాజు ఆర్మీ మెయిల్ సర్వీస్‌లో ఉన్నారు.
సెప్టెంబర్ ఒకటి నుంచి పాకిస్తాన్ ఎయిర్ ఎటాక్ చేయటానికి సిద్ధంగా ఉందని గూఢచార వర్గాల సమాచారం రావడంతో జమ్ము ఎయిర్‌ఫీల్డ్‌కు, బ్రిడ్జికి ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ వెళ్లాయి. పోతురాజు గన్ కూడా వెళ్లింది. యుద్ధం చేయకుండా డాక్ సర్వీసులో కొనసాగేందుకు పోతురాజుకు మనసొప్పలేదు. రెజిమెంట్ కమాండర్‌ను కలిసి, తనను యుద్ధానికి పంపాల్సిందేనని పట్టుబట్టాడు. పోతురాజు పట్టుదలకు ముచ్చటపడ్డ కమాండర్, 1965 సెప్టెంబరు 1న తావి బ్రిడ్జి రక్షణ అప్పగించారు.
సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పాకిస్తాన్‌కు చెందిన రెండు శాబర్‌జెట్ విమానాలు రాడార్లకు అందనంత తక్కువ ఎత్తులో దూసుకొస్తుండటం బైనాక్యులర్‌లో గమనించిన పోతురాజు ఉలిక్కిపడ్డాడు. తన దగ్గరున్న సమచార సాధనంతో కమాండర్‌ను సంప్రదిస్తే, ‘కచ్చితంగా గుర్తించగలిగితే కొట్టు. ఆ బాధ్యత నీదే!’ అన్నారు. శిక్షణలో నేర్చుకున్న పరిజ్ఞానంతో అప్పటికే వాటిని శాబర్‌జెట్‌గా పోల్చుకున్నాడు పోతురాజు. వెంటనే ఫైరింగ్ ఓపెన్ చేశాడు. మొదటి శాబర్‌జెట్ కెనోబీపై గురితప్పకుండా పేలిన గుండుకు ఫర్లాంగు దూరంలోని సిటీలో పడిపోయింది. రెండో
విమానం డైవ్ కొట్టి గన్ రేంజికి దూరంగా వెళ్లిపోయింది. ఈ పరిణామానికి భారత సైన్యం రెట్టించిన ఉత్సాహంతో విజృంభించి, ఒక్కో ఏరియాను స్వాధీనం చేసుకుంటూ సియోల్‌కోట వరకు వెళ్లాయి. ఆ తరుణంలో తాష్కెంట్ ఒప్పందంతో యుద్ధం ఆగిపోయింది. తర్వాత పోతురాజును భారత ప్రభుత్వం ‘వీరచక్ర’ అవార్డుతో సత్కరించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంతో పోతురాజుకు సెలవు మంజూరుచేసి పంపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పోతురాజుకు ఘనసత్కారాలు జరిగాయి. ఒంగోలులో ఒక ట్రక్కుపైన ఎయిర్‌క్రాఫ్ట్ ఏర్పాటుచేసి తనను కూర్చోబెట్టి చేసిన ఊరేగింపు మరిచిపోలేదని అంటారు పోతురాజు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పోతురాజు ముక్తివాహిని సైన్యంలో పనిచేశారు.
రాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ అవార్డు అందుకున్న సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి తనను పరిచయం చేసినపుడు, ఆమె రెండు చేతులు జోడించి నమస్కరించారు. అప్పుడు పోతురాజు ‘హాత్ జోడ్‌కే నమస్తే నహీ కర్‌తా! సోల్జర్ సెల్యూట్ కర్‌తా! నైతో షేక్‌హాండ్ లేతా హై!’అని వినమ్రంగా చెప్పాడు. ఆ మాటలకు ఎంతగానో సంతోషించిన ప్రధాని ఇందిరాగాంధీ ‘ఓకే! ఆప్ వీర్ జవాన్ హై!’ అని షేక్‌హ్యాండ్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.
1965 యుద్ధం ముగిసిన కొంతకాలానికి వివాహం చేసుకున్న పోతురాజుకు బాధ్యతలు వచ్చిపడ్డాయి. తండ్రి మరణంతో మరింత పెరిగాయి. పదహారున్నర సంవత్సరాల సర్వీసుతో 1975లో హవల్దార్‌గా స్వచ్ఛంద విరమణ చేశారు. అప్పటికే ఆ కుటుంబం తెనాలిలో స్థిరపడింది. గుంటూరులో ఆర్టీసీ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. 1998లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా రిటైరయ్యారు. ప్రస్తుతం శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు.
బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి
(చదవండి: చాకిరీనే ఆమె నౌకరీ)