ఆ బాధ వాళ్లకూ తెలియాలి | Sakshi
Sakshi News home page

ఆ బాధ వాళ్లకూ తెలియాలి

Published Sun, Sep 23 2018 4:35 AM

It is time to give a befitting reply to Pakistan, terrorists - Sakshi

జైపూర్‌ / ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ సైన్యం, ఉగ్రవాదుల అనాగరిక చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ గొంతును పాక్‌ సైనికులు కత్తితో కోయడం, కశ్మీర్‌లో పోలీసులను ఉగ్రవాదులు కిడ్నాప్‌చేసి హత్యచేసిన ఘటనలపై రావత్‌ ఈ మేరకు స్పందించారు. జైపూర్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారత జవాన్లపై పాకిస్తాన్‌ సైన్యం, ఉగ్రవాదులు పాల్పడుతున్న ఇలాంటి అనాగరిక, ఆటవిక ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పాక్‌ వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ బాధేంటో వాళ్లకూ తెలియాలి. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్‌ పాటించే అనారిగక, ఆటవిక విధానాలను భారత్‌ అనుసరించకూడదు’ అని తెలిపారు. సరిహద్దులో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను పాక్‌ సైన్యం తుపాకితో కాల్చి, గొంతు కోయడంపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కావనీ, దీనిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.  

యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: పాక్‌  
రావత్‌ వ్యాఖ్యలపై పాక్‌ తీవ్రంగా స్పందించింది. భారత్‌తో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే దేశ ప్రయోజనాల రీత్యా శాంతినే ఆకాంక్షిస్తున్నామని పాకిస్తాన్‌ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement