సిద్ధార్థుడి నుంచి బుద్ధుడి దాకా | Happy Buddha Purnima 2026 Special Story | Sakshi
Sakshi News home page

సిద్ధార్థుడి నుంచి బుద్ధుడి దాకా

May 1 2026 2:19 PM | Updated on May 1 2026 2:29 PM

Happy Buddha Purnima 2026 Special Story

మనిషిలోని క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, భయం వంటి దుర్గుణాలను ప్రోత్సహిస్తున్న కొద్దీ అవి పేట్రేగి పోతుంటాయి. వాటిని అదుపు చేయడానికి ధ్యానం ఒక మార్గం. ధ్యానమంటే మనలోకి మనం ప్రయాణించడం.మన గురించి మనం అలోచించుకోవడం. మంచి మనిషిగా బతుకుతూ మనుషులందరినీ సమానత్వ భావనతో ప్రేమించడం. 

పాప ప్రక్షాళన ఎలా సాధ్యం? 
ఒక పండితుడు తెల్లవారు జామున చలికాలంలో నదిలో మళ్ళీ మళ్ళీ మునుగుతున్నాడు. వణికిపోతూ కూడా మునిగి లేస్తున్నాడు.
బుద్ధుడు:: అంతగా వణికి పోతున్నారు. అలా నీళ్ళలో మునుగుతూ ఉంటే జబ్బు పడతారుకదా?
పండితుడు: నేను తెలియక చాలా పాపాలు చేశాను. ఈ పవిత్ర గంగలో 108 సార్లు మునిగితే, పాపాలు ప్రక్షాళనమవుతాయి. చేసిన పాపాలకు పరిహారం చేసుకుంటున్నాను. 
బుద్ధుడు: పాప ప్రక్షాళన తర్వాత, ముందు జబ్బు పడిమంచాన పడతారు. అయినా, మీ కాలి కింద కప్ప ఉంది. చూసుకున్నారా? దాన్ని చంపుతూ పాపాలు ఎలా కడుక్కుంటారూ?
పండితుడు: అయ్యో చూసుకోలేదు మహాత్మా! – అంటూ, కాలు తీసి పక్కకు జరిగాడు.
బుద్ధుడు: పాప ప్రక్షాళన మీరు చెప్పినట్టే జరిగితే, గంగలో ఉండే చేపలు, తాబేళ్ళూ వంటి నీటి జంతువులకు ఎప్పుడో మోక్షం దొరికేది కదా? మీ వివేకాన్ని తట్టి లేపండి! మీరు ఏమి తప్పులు చేశారో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకోండి! అంతే!! సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం అక్కడే వెతకాలి! నీటిలో మీరు ఎన్నిసార్లు మునిగి లేచినా, మీరు చేసిన తప్పులు ఒప్పులు కావు. తప్పు జరిగిన చోటే సరి చేసుకునే మార్గముంటుంది. దాన్ని అన్వేషించండి.

పండితుడు: మహాత్మా! నిజమే మీరు చెప్పిన విధంగా చేస్తాను. నా కళ్ళు తెరిపించారు. మీకు నమస్సులు.
బుద్ధుడు: అన్ని అనర్థాలకు అజ్ఞానమే కారణం. పూజల వల్ల, వ్రతాల వల్ల, ఉపవాసాల వల్ల, బలుల వల్ల అజ్ఞానం దూరం కాదు. మనిషి, తనలోని వివేచనను తట్టి లేపాలి. అప్పా దీపోభావ! మనిషి తనకుతాను దీపంగా వెలిగితే, అజ్ఞానాంధకారం దరిదాపుల్లోకి రాదు.

దైవ ప్రార్థన దేనికీ? 

వేద వేదాంగాలు మధించిన ఒక రుషి పుంగవుడు బుద్ధుణ్ణి సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. ‘పూజలు, నోములు, ప్రార్థనలకు ఫలితం ఏమీ ఉండదని చెపుతున్నారట. ఇది అన్యాయం కదా బుద్దా!’
బుద్ధుడు పక్కన ఉన్న నది వైపు తిరిగి ఇలా అన్నాడు– ‘మనం నదికి ఇటువైపు ఒడ్డున ఉన్నాం. అటువైపు ఒడ్డుకు చేరాలంటే ఏం చేయాలో చెప్పండి’ అన్నాడు.
రుషి: నదిలో నీళ్ళు తక్కవగా ఉంటే, నడిచిపోవచ్చు. లోతుగా ఉంటే ఈదుతూ వెళ్ళొచ్చు. లేదా పడవతో నది దాటొచ్చు.
బుద్ధుడు: సరే మీరు అన్నట్టు ఒకతను ఉన్నాడనుకోండి. అతను అంత దూరం నడవలేడు. ఈత రాదు. సమయానికి పడవ కూడా లేదు. అప్పుడు, దైవ ప్రార్థన మొదలు పెట్టి, ఆ అవతల ఒడ్డే తన దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాడనుకోండి. ఫలితం ఉంటుందా చెప్పండి?
రుషి: ఫలితం ఎలా ఉంటుంది? వాడంతటి మూర్ఖుడు మరొకడు ఉండడని అర్థం! ఎలాగో ప్రయత్నించి నది దాటడానికి ఉపాయం ఆలోచించాలి తప్ప, అలాంటి సమయంలో దైవప్రార్థన ఎందుకు పనికొస్తుంది?
బుద్ధుడు:: అయితే, ఇందాక మీరు అడిగిన ప్రశ్నను మరొకసారి గుర్తు చేసుకోండి.
రుషి: అవును బుద్దా! నిజమే – మీరు చెప్పిన విషయం ఆలోచిస్తే నాకు సమాధానం దొరుకుతూ ఉంది. ప్రార్థనలతో, విశ్వాసాలతో పని జరగదు. పని జరగడానికి ఏది చేయాలో అది చేయకుండా ఊరికే చేసే దైవ ప్రార్థనలతో ఏ పనీ జరగదు. నన్ను వాస్తవంలోకి తీసుకొచ్చినందుకు ఇవే నా నమస్సులు!

-ప్రొ.దేవరాజు మహారాజు , వ్యాసకర్త సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Advertisement
 
Advertisement
Advertisement