Margaret Bourke White: మార్గరెట్‌ కెమెరా పనితనం.. లీ కలం బలం.. వెరసి

Goparaju Narayana Rao Article On Photographer Margaret Bourke White - Sakshi

కాలరేఖలు

విభజన వేళ భారత్‌లో జరిగిన హింస ప్రపంచ చరిత్ర కనీ వినీ ఎరుగనిదని చరిత్రకారుల ఏకాభిప్రాయం. ఆ విషాదగాథ  ఆధారంగా వందల గ్రంథాలు వచ్చాయి. వేల పేజీల సృజనాత్మక సాహిత్యం వచ్చింది. మతావేశాలతో చెలరేగిన ఆ కల్లోలాలలో కోటి  నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మృతులు పది లక్షలని అంచనా. అపహరణకు గురైన వారు కావచ్చు, లైంగిక అత్యాచారాలకు బలైన వారు కావచ్చు– బాలికలు, యువతలు 75,000 నుంచి లక్ష. చరిత్ర చూడని భయానక శరణార్థి సమస్య వచ్చింది.

‘తమస్‌’ (భీష్మ సహానీ)’, ‘ఎ ట్రెయిన్‌ టు పాకిస్తాన్‌’ (కుష్వంత్‌సింగ్‌), ‘ది అదర్‌ సైడ్‌ ఆఫ్‌ సైలెన్స్‌’ (ఊర్వశీ బుటాలియా), ‘ఏ టైమ్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌’, ‘మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌’ (సల్మాన్‌ రష్దీ), పార్టిషన్‌ (బార్న్‌వైట్‌–స్పున్నర్‌), ‘ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌’ (ల్యారీ కోలిన్, డొమినిక్‌ లాపిరె), ‘మిడ్‌నైట్‌ ఫ్యూరీస్‌’ (నిసీద్‌ హజారీ) వంటి నవలలు, చరిత్ర పుస్తకాలలో, అమృతా ప్రీతమ్, ఇస్మత్‌ చుగ్తాయ్, గుల్జార్, సాదత్‌ హసన్‌ మంటో వంటి వారి వందలాది కథలలో ఆ విషాదం అక్షరబద్ధమైంది. జిన్నా ప్రత్యక్షచర్య పిలుపే ఇందుకు కారణం. 

కానీ విభజన నాటి విషాదాన్ని కెమెరా ద్వారా చిత్రబద్ధం చేసిన వారు మార్గరెట్‌ బర్కి వైట్‌. తేనెపట్టును తలపిస్తూ రైళ్లను ముసురుకున్న మానవ సమూహాలు, కిలో మీటర్ల మేర ఎడ్లబళ్లు, మంచం సవారీ మీద వృద్ధులు, భుజాల మీద పిల్లలు, బరువైన కావళ్లు, ఓ ఎత్తయిన ప్రదేశంలో తల పట్టుకు కూర్చున్న అబ్బాయి, కలకత్తా వీధులలో దిక్కులేకుండా పడి ఉన్న శవాల గుట్టలు.. ఇవన్నీ ఏదో సందర్భంలో, ఏదో ఒక పత్రికలో చూసి ఉంటాం. ఇవన్నీ మార్గరెట్‌ వైట్‌ (1904–1971) ధైర్య సాహసాల వల్ల చారిత్రక ఫ్రేములకెక్కినవే. ఒక మహా మానవ విషాదాన్ని ఆమె చారిత్రక దృష్టితో దృశ్యీకరించారు. ఆ నలుపు తెలుపు ఫొటోల్లోనూ ఎర్రటి నెత్తురు చూసిన అనుభూతి తెచ్చారామె. 

రెండో ప్రపంచయుద్ధం ముగియగానే ఇంగ్లండ్‌  భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడం ఖాయమని తేలింది. అప్పుడు మార్గరెట్‌ అమెరికా నుంచి వెలువడుతున్న ‘లైఫ్‌’ పత్రికలో పని చేసేవారు (తరువాత ‘టైమ్‌’ మ్యాగజీన్‌కు మారారు). చాలామంది అంతర్జాతీయ పత్రికల ప్రతినిధులూ, ఫొటోగ్రాఫర్ల మాదిరిగానే ఆమె కూడా (మార్చి, 1946) భారత్‌కు వచ్చారు. 

అసలు ఆమె ఉద్దేశం గాంధీజీ మీద వార్తా కథనం. కానీ ఆయన కార్యదర్శి చరఖా వడకడం వస్తేనే లోపలికి వెళ్లనిస్తామని చెప్పాడు. చాలా తొందరగా నేర్చుకుని వచ్చారామె. తీరా, ఆ రోజు సోమవారం. గాంధీజీకి మౌనవ్రతం. అయితే సహజ కాంతిలోనే ఫొటోలు తీయాలని, మూడు డిమాట్‌ ఫ్లాష్‌లు మాత్రమే ఉపయోగించాలన్న షరతులతో మొత్తానికి అనుమతించారు.

గాంధీజీ రాట్నం ముందు కూర్చుని పేపర్‌ క్లిపింగ్స్‌ చూసుకుంటున్నారు. అలాగే ఫొటో తీశారు మార్గరెట్‌. గాంధీకి అత్యంత ప్రియమైన రాట్నం ముందు కూర్చుని ఉన్న ఫొటోల్లో ఇదే అద్భుతం. సహజ కాంతిలో తీయడంతో గాంధీజీ రుషిలా కనిపిస్తారు. చాలాసార్లు గాంధీ వెంటే పర్యటించారామె. జిన్నా, అంబేడ్కర్, నెహ్రూ వంటి ప్రముఖులందరి ఫొటోలు తీశారు. వార్తలు రాయడానికి ఈమెతోనే వచ్చారు ‘లైఫ్‌’ పత్రికా రచయిత్రి లీ ఎలీనన్‌. మార్గరెట్‌ కెమెరా పనితనానికి లీ కలం బలం తోడైంది. 

ఇలాంటి సమయంలో భారత్‌లో మహిళలు పనిచేయలేరని చాలామంది హితవు పలికారు. రవాణా సదుపాయాలు ఉండవని చెప్పారు. యువతులను అపహరించడం సర్వసాధారణం. ప్రాణాలకు ముప్పు సరే. అవన్నీ నిజమే అయినా మార్గరెట్‌ తట్టుకుని నిలబడ్డారు. అప్పటికి ఆమె వయసు పాతిక లోపే. ఒక పాత జీప్‌లో కెమెరా సామగ్రి, టైప్‌ రైటర్, ఇతర వస్తువులతో లాహోర్‌ వెళుతుంటే ఒకచోట శరణార్థుల గుంపు దాడి చేసింది కూడా. కానీ సైనికులు రక్షించారు. అమృత్‌సర్‌ దగ్గర బియాస్‌ నది వద్ద రైలు పట్టాలకు ఎడమ వైపున ఈగలు వాలుతున్న 17 శవాలను గమనించారామె.

ఒక నదిలో కుళ్లి ఉబ్బిన శవాల వైపే చూస్తున్న రాబందులను చూశారు. ఆకలితో చనిపోయిన నాలుగేళ్ల బాలుడిని లాహోర్‌ కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌ పక్కన ఖననం చేస్తున్న దృశ్యం చూశారు. జబ్బు పడిన మహిళను భుజం మీద మోసుకుంటూ వస్తున్న సిక్కును కెమెరాలో బంధించారు. ఈ సిక్కుతో పాటే భారత్‌కు బయలుదేరిన భారీ గుంపు (కఫిలా)లో 103 మందిని మధ్యలోనే చంపారు. ఇవన్నీ ఆమె ‘హాఫ్‌ వే టు ఫ్రీడమ్‌’ అన్న స్వీయ రచనలో నమోదు చేశారు.

మరునాడే అమెరికా ప్రయాణమనగా, మార్గరెట్‌ గాంధీజీని కలుసుకున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. ప్రయాణం రోజే గాంధీజీ హత్య జరిగింది. ఆదరాబాదరా వెళ్లారామె. శవం దగ్గరకు రానిచ్చినా, ఫొటోకు అనుమతి ఇవ్వలేదు. అయినా కెమెరాకు రహస్యంగా పని చెప్పబోయారు. ఫ్లాష్‌ వెలిగింది. అంతా ఆగ్రహించారు. కెమెరాలో రీలు లాగేసి, అక్కడ నుంచి గెంటేశారు.  కెమెరా లెన్స్‌ లేదా ఆమె కళ్లు గమనించినదే అయినా అదంతా దేశ విభజన నాటి విషాద చరిత్రే. కానీ ఆ కంటికీ, ఆ లెన్స్‌కీ అందని విషాదం ఇంకా ఎంతో... ఎంతెంతో... ఉండిపోయింది. 
-డా. గోపరాజు నారాయణరావు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top