3 ఏప్రిల్ గుడ్ ఫ్రైడే
మన అతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది... ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడు ఆయెను.అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసేను – యెషయా 53:4,5,12.
పైన ఉటంకించిన ప్రవచనాలన్నీ క్రీస్తు మరణం ద్వారా నెరవేరాయి. యేసు మాంసయుక్త దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరుస్తున్నాడు అనునది పౌలు యొక్క క్రీస్తు మరణ సువార్త సందేశం. ‘క్రీస్తు యేసు– మరణమును నిరర్థకం చేశాడు’ అన్న పౌలు బోధలు ఉజ్జీవం కలిగించుటలో ప్రసిద్ధికెక్కాయి.
ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించునట్లు యేసు మరణం పొందాడు.దీని భావం ఏమంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. ఆత్మకు మరణం లేకున్నా పాపం వలన క్షమాపణ పొందని పాప జీవితం వలన నిత్య మరణం అనే స్థితి సంభవిస్తుంది. అది అడ్డుకొని తన మీద వారి మరణం వేసుకొని ఇలా పాపం వలన ప్రతి ఒక్కరికి ప్రాప్తించే పాప శిక్షను తాను భరించాడు.
సర్వమానవాళి అనబడే దేవుని పిల్లలు రక్తమాంసములు గలవారు. దేవుడు వీరిని రక్షించమని వీరిని క్రీస్తు వశం చేశాడు. మరణం యొక్క బలం గలవాడు సాతాను. విధేయ మార్గం మినహా మరో మార్గం లేదు. ఆ అపవాదిని మరణం ద్వారానే నశింపచేయాలి. జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిన మానవాళిని విడిపించుటకు యేసు కూడా రక్త మాంసాలలో పాలి భాగస్థుడు కావలసివచ్చింది. యేసు చేసిన ఒక గొప్ప అసాధారణ బోధ ఏమంటే, ‘నేను మీతో చెప్పునది ఏమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము’ ఇలాంటి స్వభావం గల వ్యక్తి, అతడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు.
‘నేను దేవుని కుమారుడను’ అన్న విషయం మరచి తన్ను తాను రిక్తునిగా చేసికొని శ్రమలను ఆహ్వానిస్తూ శ్రమలకు ఎదురువెళ్ళాడు. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనుటకు ఎల్లవేళలా సంసిద్ధుడయ్యాడు. అలాంటి ఆయన ఆకారంలో మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడు. దేవుని సంకల్పానికి విధేయంగా లోబడిన క్రీస్తు వంటి విధేయుడు ఈ భూమ్మీద మరొకడు లేడు.
‘ఎందుకనగా మనము ఆయనయందు దేవుని నీతి ఆగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను’ ( 2కొరిం«థీ 5:21 ). ‘క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మ శాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది’ (గలతీ 3:13,14, 1కొరింథీ 12:3 ).
పరిశుద్ధుడైన ఆ మహాదేవునితో పాపముగా చేయబడి సిలువ మ్రానున వ్రేలాడే శాపగ్రస్తుడిగా ఉన్న యేసుకు ఆ దేవ దేవుని ఎడబాటును ఇలా చూస్తాము. ‘ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు –‘ఏలీ, ఏలీ, లామా సబక్తానీ’ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం... యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను’ (మత్తయి 27 : 45–50).
‘దేవుడు తన సొంతకుమారుని పాప శరీరాకరముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను’ (రోమా 8:3,4 ). లోక పాపములను మోసికొనిపోయే దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తు విధేయతా బలియాగం నిత్యం గుర్తుంచుకొంటూ ఆయన వచ్చువరకు ఆ ప్రభువు మరణమును ప్రచురించవలసిన విధేయులమై ఉంటున్నాము.
‘అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును’ (హెబ్రీ 9:28 )
ఈ వచన భావం దేవుని యెడల తిరుగుబాటు చేసే అవిధేయుల పాపములను తన మీద వేసుకొని క్రీస్తు మరణించాడు అనునదే. పాపము లేకుండా రెండోసారి రావడం అంటే మొదటిసారి పాపముతో వచ్చాడు అని కాదుగాని, మానవాళి పాపమును తనమీద వేసుకున్నాడు. ఇందువలననే క్రీస్తు మరణం అనేకుల జీవితాలను కదిలిస్తూ వారిని విధేయులుగా మారుస్తూ ఉంది.
‘నేను దేవుని కుమారుడను’
అన్న విషయం మరచి తన్ను తాను రిక్తునిగా చేసికొని శ్రమలను ఆహ్వానిస్తూ శ్రమలకు ఎదురువెళ్ళాడు.
∙ జేతమ్


