సూపర్‌ ఎల్‌ నినో భయం వద్దు.. సిద్ధం కండి! | funday special Story | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఎల్‌ నినో భయం వద్దు.. సిద్ధం కండి!

May 10 2026 12:42 PM | Updated on May 10 2026 12:43 PM

funday special Story

ప్రపంచానికి ప్రళయ ఘంటికలు వినిపిస్తున్నాయి. ఈ మే నెల నుంచి భూగోళం నిప్పుల కొలిమిలా మారబోతోంది! పసిఫిక్‌ మహా సముద్రం నుంచి అప్పుడే సంకేతాల అలజడి కూడా మొదలైంది! చరిత్రలోనే ఇది అత్యంత ‘మండే ఎండల’ ఏడాది అవబోతోంది. ఇప్పటి వరకు మనం విన్నది ‘ఎల్‌ నినో’ అనే మాట మాత్రమే. ఇప్పుడు వింటున్నది ‘సూపర్‌’ ఎల్‌ నినో! ఏమైనా కానివ్వండి. భయం వద్దు. సిద్ధం కండి. భద్రంగా ఉండండి.

ఈ ఏడాది మే, లేదా జూన్‌ నెలల నాటికే బలమైన సూపర్‌ ‘ఎల్‌ నినో’ పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించింది . ఈ శతాబ్దంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత వేగంగా పసిఫిక్‌ మహాసముద్రపు నీరు వేడెక్కుతోందట! పర్యవసానమే సూపర్‌ ఎల్‌ నినో అంటున్నారు. అంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరబోతున్నాయి. ‘‘గత వందేళ్లలోనే ఇది అత్యంత బలమైన ఎల్‌ నినో కావచ్చు. సముద్ర ఉష్ణోగ్రతలు సగటు కంటే 1.5 సెల్సియస్‌ డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది’’ అని బ్రిటన్‌ వాతావరణ సంస్థ ‘మెట్‌ ఆఫీస్‌’ ప్రకటించింది.  

‘‘ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్‌ డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగి, ‘అత్యంత బలమైన’ ఎల్‌ నినో వచ్చే అవకాశం 25 శాతం వరకూ ఉంది’’ అని అమెరికా సముద్ర వాతావరణ సంస్థ ‘నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ ఎట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’ (ఎన్‌.ఓ.ఎ.ఎ.) హెచ్చరించింది.
వ్యక్తిగతంగా శాస్త్రవేత్తలు కూడా ‘భద్రం బీ కేర్‌ ఫుల్‌’ అంటున్నారు. ‘‘చాలా వాతావరణ నమూనాలు (క్లైమేట్‌ మోడల్స్‌) ఉష్ణోగ్రత పెరుగుదల 2 సెల్సియస్‌ డిగ్రీల లోపే ఉంటుందని చెబుతున్నప్పటికీ, అది 2 సెల్సియస్‌ డిగ్రీలను దాటే అవకాశం కూడా ఉండటం అన్నది ఆందోళన కలిగిస్తోంది’’ అని ‘యూనియన్‌ ఆఫ్‌ కన్సర్న్‌డ్‌ సైంటిస్ట్స్‌’ సంస్థ సభ్యులు డాక్టర్‌ మార్క్‌ అలెస్సీ కలవర పడుతున్నారు. ‘‘గత 140 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైన ‘ఎల్‌ నినో’ వచ్చే అవకాశం ఈ ఏడాది మే నెలలో ఉంది’’ అని న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్శిటీ వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ పాల్‌ రౌండీ అంటున్నారు. 

‘ఎల్‌ నినో’ అంటే తెలిసిందే
ప్రకృతిలో సహజంగా జరిగే మార్పుల్లో ‘ఎల్‌ నినో’ ఒకటి. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితలంలోని నీరు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెద్ద మార్పులు వస్తాయి. కానీ ఇప్పుడొస్తున్నది సూపర్‌ ఎలన్‌ నినో అంటున్నారు. అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్‌ డిగ్రీల కంటే ఎక్కువ పెరిగినప్పుడు సంభవించే పరిణామం. అయితే శాస్త్రవేత్తలు అధికారికంగా ‘సూపర్‌’ అనే ఈ పదాన్ని పెద్దగా వాడరు. వాతావరణ నమూనాలన్నీ  ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ‘ఎల్‌ నినో’ మరింత తీవ్రం కానుంది. అంటే ఈ మే నెల నుంచి రాబోయే రోజుల్లో ప్రపంచం భారీ ఎండలను, ఎండలతో పాటుగా అసాధారణ వాతావరణ మార్పులను, అకాల భారీ వర్షాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎల్‌ నినో అన్నది లక్షల ఏళ్లుగా ఉన్నదే అయినా, ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో కనిపిస్తున్న సంకేతాల ప్రకారం ఈ ఏడాది, చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన  ఎల్‌ నినోలలో ఒకటిగా నమోదయ్యే అవకాశం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వేడి ఎలా పెరుగుతుంది?
ఎల్‌ నినో సమయంలో, పసిఫిక్‌ మహాసముద్రంలో వేడెక్కిన నీరు అంతటా విస్తరిస్తుంది. దీనివల్ల భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. సముద్రంలోని ఈ వేడి, వాతావరణంలోకి విడుదలయ్యి, కొన్ని నెలల పాటు భూమిని వేడెక్కిస్తుంది. ఈ ఏడాది ఎల్‌ నినో, సూపర్‌ ఎల్‌ నినో అవొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. పసిఫిక్‌ మహాసముద్రంలో సాధారణంగా ఏప్రిల్‌ నెలలో ఉండే వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తును అంచనా వేయడం కష్టం. ఈ అడ్డంకిని శాస్త్రవేత్తలు ‘ఏప్రిల్‌ అడ్డంకి’ అంటారు. వాళ్ల పరిభాషలో అది ‘స్ప్రింగ్‌ ప్రిడిక్టబిలిటీ బారియర్‌’. అయినప్పటికీ, ఈసారి సూపర్‌ ఎల్‌ నినో వస్తుందని శాస్త్ర నిపుణులు గట్టిగానే చెబుతున్నారు.

ఎల్‌ నినో చరిత్రలో 2024
వాతావరణ మార్పు, ఎల్‌ నినో అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఎల్‌ నినో అనేది వాతావరణ మార్పుల వల్ల ఏర్పడేది కాదు. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ. అలాగే గ్రీన్‌హౌస్‌ ప్రభావం వల్ల ఎల్‌ నినో మరింత తీవ్రమవుతుందని చెప్పడానికి కూడా ఇప్పటి వరకు శాస్త్రవేత్తల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవు. వాతావరణ మార్పుల వల్ల భూమి వేడెక్కుతోంది. దీనికి బలమైన ఎల్‌ నినో కూడా తోడైతే, ఆ అదనపు వేడి కారణంగా ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోతాయి. గ్రీన్‌హౌస్‌ వాయువులు, బలమైన ఎల్‌ నినో కలవడం వల్లే 2024 చరిత్రలోనే అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచింది. ఇక ఇప్పుడు ‘సూపర్‌’ ఎల్‌ నినో వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో, ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు, లేదా కరువు కాటకాలు సంభవించ వచ్చు. 

ఈ ఏడాదే ఎందుకని?!
ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం, ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో భూమిపై దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, కరీబియన్‌ దీవులు, యూరప్, ఉత్తర ఆఫ్రికాలో ఈ ప్రభావం కనిపించవచ్చు. దీనివల్ల  దక్షిణమెరికా, తూర్పు ఆఫ్రికా ప్రాంతం, మధ్య ఆసియాలో విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది; ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో తీవ్రమైన కరవు ఏర్పడవచ్చు. ఆగ్నేయ ఆసియా దేశాలలో అడవులు అంటుకుని మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి, నీటి లభ్యత, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. 

‘సూపర్‌’ అనే మాట కొత్తది!
పసిఫిక్‌ మహాసముద్రంలో క్రమబద్ధంగా మారే వాతావరణ మార్పులను ‘ఎల్‌ నినో సదరన్‌ ఆసిలేషన్‌’(ఇ.ఎన్‌.ఎస్‌.ఓ.) అని పిలుస్తారు. ఇందులో ప్రధానంగా రెండు దశలు ఉంటాయి. ఒకటి: ‘ఎల్‌ నినో’ (వేడి దశ), రెండు : ‘లా నినా’ (చల్లని దశ). ఈ దశలు ప్రతి రెండు నుండి ఏడు సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, గాలులు వర్షపాతంలో ఊహించని మార్పులను కలిగిస్తాయి. ఇక, ఇ.ఎన్‌.ఎస్‌.ఓ.లోని మూడో దశ ‘తటస్థ స్థితి’. ఎల్‌ నినో ఈ ఏడాది తీవ్రంగా ఉంటుందని చెప్పటానికే దీనిని ‘సూపర్‌ ఎల్‌ నినో’ అని అభివర్ణిస్తున్నారు.

ఎల్‌ నినో : ఈ దశలో పసిఫిక్‌ మహాసముద్రం; మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీటి ఉపరితలం సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. భూమధ్యరేఖ వెంబడి తూర్పు నుండి పడమరకు వీచే గాలులు బలహీనపడతాయి. కొన్నిసార్లు ఇవి అందుకు భిన్నంగా పడమర నుండి తూర్పుకు వీస్తాయి. ఈ ప్రభావంతో ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోతాయి. కానీ పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలో వర్షాలు పెరుగుతాయి!

లా నినా : ఈ దశలో పసిఫిక్‌ మహాసముద్రం; మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీరు సాధారణం కంటే ఎక్కువగా చల్లబడుతుంది. తూర్పు నుండి వీచే గాలులు మరింత బలంగా మారుతాయి. ఆ ప్రభావంతో ఇండోనేషియాలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, కానీ పసిఫిక్‌ మహాసముద్ర మధ్య ప్రాంతంలో వర్షాలు తగ్గుతాయి.

తటస్థ స్థితి : ఇది ఎల్‌ నినో గానీ, లా నినా గానీ ఉండని సమయం. ఈ స్థితిలో పసిఫిక్‌ మహాసముద్ర ఉష్ణోగ్రతలు సాధారణంగా సగటు స్థాయిలోనే ఉంటాయి. 

్చ
పసిఫిక్‌ మహా సముద్రంలోనే ఎందుకు?
నిజానికి ఇతర మహాసముద్రాల్లో కూడా చిన్నపాటి వాతావరణ మార్పులు జరుగుతుంటాయి, కానీ ‘ఎల్‌ నినో’ అంతటి శక్తిమంతమైన మార్పులు కేవలం పసిఫిక్‌ మహాసముద్రంలోనే రావడానికి ముఖ్య కారణం ఆ సముద్ర పరిమాణం. ఉదా : అట్లాంటిక్‌ మహాసముద్రం ఒక నీళ్ల టబ్‌ లాంటిదైతే, పసిఫిక్‌ మహాసముద్రం ఒక పెద్ద చెరువు లాంటిది. టబ్‌లో నీటిని కదిలిస్తే చిన్న అలలు మాత్రమే వస్తాయి, కానీ పెద్ద చెరువులో నీరు కదిలితే అది చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఇక్కడా అంతే. పసిఫిక్‌ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ఎంత వెడల్పుగా ఉంటుందంటే, భూమధ్యరేఖ వద్ద ఇది భూమి చుట్టుకొలతలో దాదాపు సగానికి పైగా ఉంటుంది. పసిఫిక్‌ మహాసముద్రం చాలా విశాలంగా ఉండటం వల్ల, దాని తూర్పు ప్రాంతానికి (దక్షిణమెరికా), పశ్చిమ ప్రాంతానికి (ఇండోనేషియా) మధ్య ఉష్ణోగ్రతల్లో భారీ తేడా ఉంటుంది. ఈ భారీ తేడానే ప్రపంచవ్యాప్త గాలులను శాసిస్తుంది. చిన్న సముద్రాల్లో ఉష్ణోగ్రత తేడాలు తక్కువగా ఉంటాయి, కాబట్టి అవి వాతావరణాన్ని అంతగా ప్రభావితం చేయలేవు.

‘క్లైమేట్‌ మోడల్స్‌’ అంటే?

భూమి, సముద్రాలు, భూతలం పైన వాతావరణాలు ఎలా మారుతాయో అంచనా వేసే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్‌ ప్రోగ్రాములే ‘క్లైమేట్‌ మోడల్స్‌. ఇవి గాలి వేగం, ఉష్ణోగ్రత, గ్రీన్‌హౌస్‌ వాయువుల వంటి గణిత సమీకరణాలను ఉపయోగించి భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉండబోతుందో ముందే చెబుతాయి. శాస్త్రవేత్తలు వీటిని ఉపయోగించి ఎల్‌ నినో వంటి మార్పులను లెక్కిస్తారు.


‘బాల యేసు’ అని అర్థం!
‘ఎల్‌ నినో’ అనే పదం స్పానిష్‌ భాష నుండి వచ్చింది, దీని అర్థం ‘బాలుడు‘ లేదా ‘బాల యేసు’ (బేబీ జీసస్‌). పసిఫిక్‌ మహాసముద్రంలో ఈ వేడి నీటి ప్రవాహం సాధారణంగా డిసెంబర్‌ (క్రిస్మస్‌) సమయంలో కనిపిస్తుంది కాబట్టి, దక్షిణ అమెరికా జాలర్లు దీనికి ఆ పేరు పెట్టారు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశపు జాలర్లు వందల ఏళ్ల క్రితమే ఎల్‌ నినో ఉనికిని కనిపెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement