
మనింట్లో తాతయ్య భోజనం చేసిన కంచం, నానమ్మ ఉపయోగించిన వంట పాత్రలు వంటివి ఉంటే, వాటిని ప్రేమగా, మురిపెంగా చూసుకుంటూ ఎంతో అపురూపంగా దాచుకుంటాం. అలాంటిది, ఆయన దగ్గర దాదాపు కొన్ని వందల సంవత్సరాల నాటి పురాతన వస్తువులు ఉన్నాయి. వాటిని రకరకాల ప్రాంతాల నుంచి సేకరించి, తన ఇంటినే మ్యూజియంగా మార్చారు సిద్దిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సే. ఇత్తడి, రాగి వస్తువులను ఇంట్లోని షోకేసులలో చూడచక్కగా అమర్చారు.
అప్పటి నుంచే మొదలు
ఫారూక్ హుస్సేన్‌కు చిన్నప్పటి నుంచి నిజాం కాలంలో వినియోగించిన వస్తువులు, పురాతన వస్తువులు అంటే ఎంతో ఇష్టం. దీంతో వాటిని సేకరించే పనిలో పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన బషీరుద్దీన్ బాబూఖాన్, జాఫర్ జావేద్ ఇళ్లల్లో చూసిన తర్వాత వాటిపై మరింత మక్కువ పెంచుకున్నారు. పురాతన వస్తువులు ఎక్కడ విక్రయిస్తారో అన్వేషణ సాగించి మరీ, వాటిని సేకరిస్తూ వస్తున్నారు.
లండన్ నుంచి కొనుగోలు
ఫారూక్ హుస్సేన్ కూతురు, అల్లుడు లండన్ లో నివాసం ఉంటున్నారు. వారి దగ్గరికి ఏడాదికి ఒకసారి వెళ్లి వస్తుంటారు. అలా వెళ్లినప్పుడు 2008లో ఒకరోజు లండన్‌లో సండే మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ పలు పురాతన వస్తువులను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి లండన్ వెళ్లినప్పుడల్లా అక్కడ పురాతన వస్తువులను కొనుగోలు చేసి, తీసుకురావడం మొదలుపెట్టారు.
లండన్ నుంచే కాకుండా, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు; మన దేశంలోని ప్రధాన నగరాలైన కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నైలతో పాటు ఇతర నగరాలకు వెళ్లినప్పుడు అక్కడ విక్రయిస్తే అక్కడి నుంచి సైతం కొనుగోలు చేశారు. పాన్‌దాన్, పావు, చాయ్‌కేడ్, టుటిక లోటా, వగల్‌దాన్ – ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తువులను తీసువచ్చారు.
సేకరించిన వస్తువులతో
వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అపురూపమైన వస్తువులన్నింటినీ తన సిద్దిపేట, హైదరాబాద్ ఇళ్లలోని ముందు గదుల్లో ప్రదర్శించేందుకు వీలుగా ప్రత్యేకంగా ర్యాక్‌లను తయారు చేయించారు. ఆయన ఇంటికి వచ్చేవారంతా వాటిని చూసి అబ్బురపడుతూ, వాటి గురించి అడిగి తెలుసుకుంటుంటారు. ఫారూక్ వారికి వాటి చరిత్రను, విశేషాలను ఓపికగా వివరిస్తుంటారు.
ఇంకా వస్తున్నాయి
లండన్‌లో సండే మార్కెట్‌లో నచ్చిన వస్తువులను కొనుగోలు చేసి తన కూతురు ఇంట్లో భద్రపరుస్తున్నారు. లండన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చే సమయంలో కొన్ని తీసుకుని వస్తున్నారు.
విమానంలో 45 కిలోల బరువు మాత్రమే అనుమతించడంతో దానికి సరిపడే పరిమాణంలోనే తీసుకువస్తున్నారు. విమాన ప్రయాణాల్లో నిబంధనల కారణంగా అక్కడ కొనుగోలు చేసిన వాటిలో దాదాపు 100 కిలోల మేరకు వస్తువులు అక్కడే ఉండిపోయాయి. వీలు చిక్కినప్పుడు వాటిని ఇక్కడికి తీసుకువస్తానని ఫారూఖ్ చెబుతున్నారు.
ముప్పయి దేశాల నాణేలు
మన దేశంలో వాడుకలో లేకుండా పోయిన పాతకాలం అణా పైసల నాణేల నుంచి పావలాల వరకు ఎన్నో పాత నాణేలు కూడా ఫారూక్ సేకరణలో ఉన్నాయి. వీటితో పాటు నిజాం కాలంలో ఉపయోగించిన సిక్కా నాణేలు కూడా ఉన్నాయి.
మనదేశంతో పాటు విదేశాలకు చెందిన నాణేలను సేకరించడాన్ని ఆయన హాబీగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు సుమారుగా ముప్పయికి పైగా దేశాలకు చెందిన నాణేలను దాదాపు ఐదువందలకు పైగా సేకరించారు.
అల్లుడు సండే మార్కెట్‌కు తీసుకవెళ్లాడు....
మా బిడ్డ ఇంటికి లండన్ వెళ్లాం. అక్కడ కాలక్షేపం కాకపోవడంతో మా అల్లుడు సండే మార్కెట్‌కు తీసుకవెళ్లాడు. ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకున్న పురాతన వస్తువులు అక్కడ కనిపించాయి. దీంతో చాలా వస్తువులను లక్షలు పెట్టి కొనుగోలు చేశాను.
ఇంట్లో వాటి కోసం ప్రత్యేకంగా ర్యాక్‌లు చేయించాను. మా ఇంటికి వచ్చిన వారందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తారు. ‘ఇవన్నీ మీ తాతలు వినియోగించినవా?’ అని అడుగుతారు. చిన్నప్పటి నుంచి పురాతన వస్తువుల మీద ఇష్టం ఉండటంతో కొనుగోలు చేస్తున్నా అని చెబుతుంటారు ఫారూక్ హుస్సేన్.
గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట
(చదవండి: స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్..!)