పసి గుండెకు గురిపెట్టే ఫీవర్‌ | Explanation of Rheumatic Heart Disease in Childrens | Sakshi
Sakshi News home page

పసి గుండెకు గురిపెట్టే ఫీవర్‌

Apr 5 2026 12:08 AM | Updated on Apr 5 2026 12:08 AM

Explanation of Rheumatic Heart Disease in Childrens

చిన్నపిల్లల్లో జలుబు చేయడం చాలా మామూలు విషయం. జలుబు తర్వాత కాస్తంత  గొంతునొప్పి రావడమూ మామూలే. వీటితో పాటు జ్వరం కనిపించడం చాలా సాధారణమే. అయితే ఇలా జ్వరమూ (హైఫీవర్‌), జలుబూ, గొంతునొప్పి కనిపించడమన్నది సాధారణమే కదా అంటూ మామూలుగా తీసుకోవడం సరికాదంటున్నారు వైద్య నిపుణులు.

 ఈ మామూలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదనీ, అదే చాలా తీవ్రమైన రుమాటిక్‌ ఫీవర్‌గా పరిణమించి చిన్నారుల ‘గుండె’నూ దెబ్బతీస్తుందంటే అది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అది వాస్తవం. అందుకే ఒక్కోసారి ఈ చిన్న లక్షణాలనూ చాలా సీరియస్‌గా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. అదెప్పుడో తెలుసు కునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం.

చిన్న పిల్లల్లో వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. చిన్న పిల్లలకు జలుబు చేశాక వారు గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఓ చిన్న సమస్యగానే చూడకూడదని తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే...  జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్‌కు ఇన్ఫెక్షన్‌ వచ్చే టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఇక కొందరిలో గ్రూప్‌–ఏ స్ట్రె΄్టోకోకస్‌ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చినట్లయితే... దానికి డాక్టర్‌ సూచించే పూర్తి స్థాయి యాంటీబయాటిక్స్‌ కోర్సు వాడాలి.  

అలా వాడకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్‌ ఫీవర్‌ అనే మరో సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. అలా జలుబు, జ్వరాల తర్వాత మళ్లీ మరోసారి జ్వరం... మునుపు డాక్టర్లు ఇచ్చిన అవే మందులు వాడుతూ నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే అది రుమాటిక్‌ ఫీవర్‌కు దారి తీసే ప్రమాదమూ ఉందని తల్లిదండ్రులకు ఏమాత్రం తెలిసే అవకాశం ఉండదు. అందుకే జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి.

రుమాటిక్‌ ఫీవర్‌తో ఎలాంటి ప్రమాదం వస్తుందంటే... 
రుమాటిక్‌ ఫీవర్‌ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రుమాటిక్‌ ఫీవర్‌ వచ్చిన తర్వాత భవిష్యత్తులో అది గుండె కవాటాల (వాల్వ్స్‌)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతుంది.

లక్షణాలు.. 
మొదట జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ మరోమారు జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటి మీద ర్యాష్‌ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్‌ ఫీవర్‌గా అనుమానించాలి. అలాగే తొలుత ఈ లక్షణాలు కనిపించిన పిల్లల్లో... తర్వాత శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్‌ ఫీవర్‌ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలుగా పరిగణించి... ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. 

ఇక్కడ పేర్కొన్న అంశాలను బట్టి ఇది ఎంతో పెద్ద సమస్యగా అనిపిస్తున్నప్పటికీ... కేవలం ఒక పూర్తి కోర్సు యాంటీబయాటిక్‌ మందులతో దీన్ని పూర్తిగా నివారించవచ్చనీ, దాంతో పిల్లల అద్భుతమైన భవిష్యత్తును కాపాడుకోవచ్చని తల్లిదండ్రులు అవగాహన పెంచుకుంటే చాలు... పేరెంట్స్‌ ఆ చిన్నారి గుండెకు తగిన రక్షణ కల్పించినవారవుతారు. 

చికిత్స / నివారణ
వాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా తగిన చికిత్స అందిస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్‌తోనే సమస్య పూర్తిగా సమసిపోతుంది. కానీ తొలిదశల్లో ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె వైఫల్యానికీ (హార్ట్‌ ఫెయిల్యూర్‌కూ) దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ ఆపరేషన్‌ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది గానీ...  చాలా కొద్దిమంది పిల్లల్లోనే ఇలా జరిగే అవకాశముంది.

 మరికొందరు చిన్నారుల్లో జీవితాంతమూ బ్లడ్‌థిన్నర్స్‌ (రక్తం పలుచబార్చే మందులు) కూడా వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు... వారికి ఆ గర్బధారణ కూడా ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జబులు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకుండా ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి. అంతేకాదు... ఇలా జలుబు, గొంతునొప్పి, జ్వరం  వచ్చిన పిల్లల విషయంలో వారు తగినంత వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్‌ హైజీన్‌) పాటించేలా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే.

డా‘‘ శివనారాయణ రెడ్డి వెన్నపూస
సీనియర్‌ నియోనేటాలజిస్ట్‌ – పీడియాట్రీషియన్‌

నిర్వహణ: యాసీన్‌

Advertisement
 
Advertisement
Advertisement