...ఆల్‌ ది బెస్ట్‌ | Explanation of Indian women nari shakti womens reservation bill | Sakshi
Sakshi News home page

...ఆల్‌ ది బెస్ట్‌

Apr 16 2026 4:18 AM | Updated on Apr 16 2026 4:18 AM

Explanation of Indian women nari shakti womens reservation bill

భారతీయ మహిళలకు ఆల్‌ ది బెస్ట్‌. చైతన్యవంతమైన తెలుగింటి మహిళలకు ఆల్‌ ది బెస్ట్‌. మేధస్సులో, దార్శనికతలో, భవిష్యత్తు నిర్మాణంలో గొప్ప దక్షత, దీక్ష కలిగిన మన నారీశక్తికి ఆల్‌ ది బెస్ట్‌. అదిగో... చట్టసభల్లో స్త్రీలకు సంబంధించిన గొప్ప ఘట్టానికి తెర లేవనుంది. నేటి నుంచి మహిళా  రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ జరగనుంది.  ఎన్నాళ్ల కల ఇది! ఎన్నో తరాల కల. అందుకే ఇది చారిత్రాత్మక ఘట్టం.  ప్రజాస్వామ్యంలో స్త్రీలకు సమాన భాగస్వామ్యం ఉందని చాటే అపురూప ఘట్టం.   ఇక చట్టసభల్లో స్త్రీల గళం మరింత బలంగా వినిపించాల్సిన  సమయం ఆసన్నమైంది. విధాన నిర్ణయాల్లో స్త్రీ దృక్పథం చేరితే  సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని స్త్రీలు చూపబోతున్నారు. ఇంటిని నడిపిన అనుభవంతో దేశాన్ని నడిపే సామర్థ్యం స్త్రీలకు ఉంది. ఈ బిల్లు  కేవలం సీట్ల గురించి కాదు, గౌరవం గురించి. ఆత్మగౌరవం గురించి. స్త్రీలు ద్వితీయశ్రేణి పౌరులు కాదని ఎలుగెత్తి చాటడం గురించి. ఈ సందర్భం స్త్రీల  పోరాటానికి, పట్టుదలకు తార్కాణం. చర్చ సజావుగా సాగి, బిల్లు కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిద్దాం.  ఒక కొత్తప్రారంభానికి సిద్ధమవుదాం. భారత నారీ శక్తికి మరోసారి ఆల్‌ ది బెస్ట్‌.   ... మీరు గెలవాలి!

మహిళలకు అధికారం ఇస్తే వారు ఎంత అద్భుతంగా పనిచేస్తారో అనడానికి మన గ్రామ పంచాయతీలే నిదర్శనం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 14.5 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తాగునీటిప్రాజెక్టుల అమలులో సుమారు 60% పైగా మెరుగుదల కనిపించినట్లు అధ్యయనాలు  సూచిస్తున్నాయి. ఇది మహిళా  నాయకత్వం స్థానిక  పాలనను  ప్రజల అవసరాలకు మరింత  దగ్గరగా తీసుకువస్తుందని 
స్పష్టంగా చూపిస్తుంది.

అప్పుడే సంపూర్ణ ప్రజాస్వామ్యం
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే,  పార్లమెంటులో మహిళలప్రాతినిధ్యం సగటున 27.5%గా ఉంది. మహిళ లప్రాతినిధ్యం పెరిగిన దేశాల్లో సమాజం ఎంతోవేగంగా అభివృద్ధి చెందిందని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, ప్రపంచంలోనే అత్యధికంగా 64% మంది మహిళలు  పార్లమెంటులో ఉన్న రువాండాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అక్కడ మహిళా నాయకత్వం వల్ల భూమిపై మహిళలకు సమాన హక్కులు కల్పించే చట్టాలు వచ్చాయి, ప్రస్తుతం అక్కడ 26% భూమి మహిళల పేరు మీదనే ఉంది. తల్లి మరణాల రేటు సగానికి పైగా తగ్గడమే కాకుండా, ఆడపిల్లలందరికీప్రాథమిక విద్య అందేలా అక్కడి మహిళా నాయకులు అద్భుతమైన కృషి చేశారు. అర్జెంటీనా వంటి దేశాల్లో 42.4% మంది మహిళలు చట్టసభల్లో ఉండటం వల్ల మహిళల హక్కులకు సంబంధించిన బిల్లుల సంఖ్య భారీగా పెరిగింది. కుటుంబాల్లో మహిళలు చేసే అప్రకటిత సేవలకు (అన్‌పెయిడ్‌ కేర్‌ వర్క్‌) గుర్తింపు తెచ్చేలా వారు విధానాలను మార్చగలిగారు.

సామాజిక జీవనం మారి పోయింది
స్వీడన్, నార్వే వంటి నార్డిక్‌ దేశాల్లో మహిళలప్రాతినిధ్యం 45% పైగా ఉండటం వల్ల అక్కడ సామాజిక జీవనమే మారి పోయింది. పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవడమే కాకుండా, తండ్రులకు కూడా సమానంగా పేరెంటల్‌ లీవ్స్‌ ఇచ్చేలా చట్టాలను రూపొందించారు. దీనివల్ల మహిళలు ఉద్యోగాల్లో, వ్యా పారాల్లో రాణించడానికి గొప్ప అవకాశం దక్కింది.  పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో కూడా 21% పైగా మహిళాప్రాతినిధ్యం ఉండటం వల్ల పేద కుటుంబాల సంక్షేమంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. జనాభాలో సగం ఉన్న మహిళలు నిర్ణయాధికారంలో భాగస్వాములు కావడం ద్వారా మాత్రమే సమ్మిళిత ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుంది. 

ఎన్ని సవాళ్లు ఉన్నా...
ఈ రిజర్వేషన్‌ల విధానం సమాన అవకాశాలు అనే రాజ్యాంగప్రాథమిక సూత్రాన్ని దెబ్బతీస్తుందని కొందరు విమర్శకులు భావిస్తారు. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక వారి అర్హతలు, ప్రజాబలం, సిద్ధాంతాల ఆధారంగా జరగాలి కానీ, కేవలం జెండర్‌ ఆధారంగా జరగకూడదని వారు వాదిస్తారు. చట్టసభల్లో మహిళలకు స్థానాలు కేటాయించినప్పటికీ, వాస్తవంగా వారి కుటుంబాల్లోని పురుషులే పెత్తనం చెలాయించే అవకాశం ఉందనే విమర్శలు బలంగా ఉన్నాయి. అలాగే, ఓటర్ల స్వేచ్ఛ పరిమితం అవుతుందని,  పార్టీల అంతర్గత విభేదాలు తలెత్తి భవిష్యత్తులో ఇతర వర్గాల నుండి కూడా ఇలాంటి కోటా డిమాండ్లు పుట్టుకొచ్చి వ్యవస్థను సంక్లిష్టం చేస్తాయనే ఆందోళనలు ఉన్నాయి. 

పలువురు మహిళా నాయకులు సైతం తమను కేవలం ఒక మహిళగా కాకుండా, తమ నాయకత్వ పటిమతో గుర్తింపు పొందాలని కోరుకోవడం కూడా గమనించాల్సిన అంశం. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మహిళలకుప్రాతినిధ్యం కల్పించే విధానం కేవలం రాజకీయ స్థానాలను పెంచే సాధారణ చర్య కాదు. ఇది భారతీయ సమాజాన్ని మరింత సమానత్వపూర్వకంగా మలిచే ఒక గొప్ప నిర్మాణాత్మక సంస్కరణ. చట్టసభల్లో మహిళలు అడుగుపెట్టడం వల్ల విధానాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మానవీయ కోణాన్ని సంతరించుకుంటాయి. చట్టసభల వేదికగా మహిళలు ధైర్యంగా మాట్లాడటం, బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువతులకు వారు సజీవ ఆదర్శంగా, మార్గదర్శకులుగా నిలుస్తారు.
– బాల లత మల్లవరపు 
సివిల్స్‌ మెంబర్, డైరెక్టర్, ధనిక్‌ భారత్‌

ప్రోత్సాహం అవసరం
మామూలుగా ఒక బిల్లు అమలు చేయనున్నారనే వార్త రాగానే అందరం థ్యాంక్స్‌ చెబుతాం... ఎన్నో మాట్లాడతాం. కానీ ఆ బిల్లు  పాస్‌ అవ్వాలి.. అంతటితో ఆగకూడదు... అమలు చేశాక దాని తాలూకు పనులు సరిగ్గా జరుగుతున్నాయా... లేదా అనేది ముఖ్యం. ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రతిసారీ మహిళల కోసం ఏదో చేస్తాం అని మాటలు చెబితే చాలామంది నమ్మే పరిస్థితుల్లో లేరు. చెప్పినది అమలు చేయాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇలాంటివి అమలు చేసినా... చేయక పోయినా అన్ని రంగాల్లో మహిళలు తమను నిరూపించుకుంటున్నారు. 

 పాలిటిక్స్, జర్నలిజమ్, డాక్టర్స్, పైలట్స్‌... ఇలాంటి రంగాల్లో ముందుంటున్నారు. కష్టమైనా, ఒడిదుడుకులు ఎదురైనా తమ కలలను నిజం చేసుకుంటున్నారు. అయితే జనరల్‌గా మహిళల శాతం ఏ రంగంలో అయినా తక్కువే ఉంటోంది. అంతెందుకు? పొలిటికల్‌ మీటింగ్స్‌ తీసుకోండి... 20 మంది మగవాళ్లు ఉంటే అందులో ఓ ముగ్గురు లేదా నలుగురు మహిళలు ఉంటే అది పెద్ద విషయం. అదే ఒక బిల్లు  పాస్‌ అయినప్పుడు, అది ఒక ‘లా’ అయినప్పుడు కేటాయించిన ‘శాతం’లో మహిళలకు పూర్తి అవకాశం దక్కుతుంది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మహిళలదే. రూరల్‌ ఏరియాస్‌లో కొన్ని చోట్ల ఇంకా మహిళల పట్ల కాస్త వివక్ష ఉందనిపిస్తోంది. చె΄్పాలంటే ఈ విషయంలో నార్త్‌ కంటే సౌత్‌ కొంత బెస్ట్‌. అక్కడితే  పోలిస్తే ఇక్కడ మహిళలకు ప్రోత్సాహం కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే ‘గ్రాస్‌ రూట్‌’ లెవల్‌లో ఉన్న అమ్మాయిలకు ఇంకా ఎంకరేజ్‌మెంట్‌ అవసరం.

 ఇప్పుడు మారుమూలప్రాంతాల్లో కూడా అమ్మాయిలను చదివిస్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్లను ఎంకరేజ్‌ చేయాలి. ‘గ్రాస్‌ రూట్‌’ లెవల్‌ నుంచి ఆ నెక్ట్స్‌ లెవల్‌ వరకూ అందరూ ముందుకు వస్తే అప్పుడు మొత్తం 33 శాతం రిజర్వేషన్‌ ఫుల్‌ అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఆ చట్టం అమలులోకి తెచ్చినా మహిళలు సద్వినియోగం చేసుకోక పోతే ఇక ఉపయోగం ఏం ఉంటుంది? అందుకే ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలచుకున్నాను. కాస్త ధైర్యంగా మాట్లాడే మహిళలను ఎలా ఎదగనివ్వకుండా చేయాలా... అని కొంతమంది చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడి, అనుకున్నది సాధించిన మహిళలు ఉన్నారు. వాళ్లని స్ఫూర్తిగా తీసుకోవాలి. మహిళలకు కేటాయించినవి దక్కించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ముందుకు రండి... నిరూపించుకుని నిలబడండి.      
    – జయసుధ, నటి

ఇదో గొప్ప ముందడుగు
ఈ 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు మహిళా సాధికారతకు భరోసా ఇస్తుంది. నారీ శక్తి కేవలం మాటలకే పరిమితం కాదు, ప్రధాని దానిని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, చెందుతుంది అంటే మహిళలకు సాధికారత కల్పించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ బిల్లు వ్యవస్థపై,  పాలకవర్గంపై విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. ఈ బిల్లు ఒక గొప్ప ముందడుగు, ఒక కల నిజమైన క్షణం.                        
– ఖుష్బూ, నటి

స్ఫూర్తిదాయకం
33 శాతం బిల్లు అనేది కచ్చితంగా ఆహ్వానించదగ్గది. మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించే ఇలాంటి నిర్ణయాలు స్వాగతించదగ్గవి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటే బాగుంటుంది. రాజకీయాలైనా, సినిమా అయినా... ఏ రంగం అయినా మనకు వచ్చిన చాన్స్‌ని ఉపయోగించుకోవాలి. సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి. క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ఇలాంటి రిజర్వేషన్లు ఉండవు. కానీ, 33 శాతం అనేది ఇతర రంగాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు ఇవ్వాలి. అలాగే ఎవరో ఒకరు ప్రోత్సహించాలని ఆశించకుండా అమ్మాయిలు తమకు తాముగా కూడా ముందడుగు వేయాలి.                           
– మానస శర్మ, యువ దర్శకురాలు

ఐపీయూ (ఇంటర్‌– పార్లమెంటరీ యూనియన్‌) అనేది ప్రపంచవ్యాప్తంగా జాతీయ  పార్లమెంట్‌లకు సంబంధించిన సంస్థ. దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి  ఏర్పాటైంది.  పార్లమెంట్‌లు మరింత బలంగా, పర్యావరణహితంగా ఉండడానికి, లింగసమానత్వం సాధించడానికి కృషి చేస్తోంది ఐపీయూ. ∙ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకత్వంలో మహిళలప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనీ, అత్యంత శక్తిమంతమైన నిర్ణయాలు ఇప్పటికీ పురుషులే తీసుకుంటున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

ఐపీయూ, యూఎన్‌ ఉమెన్‌ విడుదల చేసిన గణాంకాలలో ముఖ్యాంశాలు...

27.5%
ప్రపంచవ్యాప్తంగా  పార్లమెంటరీ సీట్లలో 27.5 శాతం మహిళలు ఉన్నారు. ఇది  2025 నాటి 27.2 శాతం కంటే కొద్దిగా ఎక్కువ. రాజకీయప్రాతినిధ్యానికి  సంబంధించి మహిళలు ఎంత నెమ్మదిగా పురోగమిస్తున్నారో ఇది తెలియజేస్తుంది.

19.9%
జనవరి 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 54 మంది మహిళలు  పార్లమెంట్‌ స్పీకర్‌లుగా ఉన్నారు. మొత్తం స్పీకర్‌లలో ఇది 19.9 శాతం.

76%
రాజకీయాల్లోని మహిళలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వివిధ రకాలుగా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మహిళా  పార్లమెంటేరియన్‌లలో 76 శాతం మంది బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. సమాన రాజకీయ అధికారం దిశగా మహిళల పురోగతిని మందగింపచేసే ప్రయత్నాల్లో భాగమే ఈ బెదిరింపులు.

మహిళలు నాయకత్వ స్థానాలకు చేరుకున్నప్పటికీ తరచుగా అ్ర పాధాన్య శాఖలకే పరిమితమవుతున్నారు
రక్షణ, హోం, న్యాయ, ఆర్థిక, ఆరోగ్య, విద్య వంటి మంత్రిత్వశాఖలను దాదాపుగా పురుషులే నిర్వహిస్తున్నారు.
                              
14 దేశాలు
ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల క్యాబినెట్‌లో లింగసమానత్వాన్ని సాధించాయి. సమానప్రాతినిధ్యం సాధ్యమేనని నిరూపించాయి. ఎనిమిది దేశాలలో ఇప్పటికీ ఒక్క మహిళా మంత్రి కూడా లేరు.

Advertisement
 
Advertisement
Advertisement