
నేడు ఆత్మహత్యా నివారణ దినోత్సవం
బతుకులో జ్వాలలు ఉన్నాయని శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వడం పరిష్కారం ఎలా అవుతుంది అంటారు విజ్ఞులు. ‘అన్ని కష్టాలకు విముక్తి చావే’ అనే మాటకు మించిన అవివేకం లేదంటారు కౌన్సెలర్లు. బలవన్మరణం ఆ వ్యక్తిని చనిపోయాక కూడా వెంటాడుతుంది. ఒక అపప్రథగా... కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తుంది. మనిషి లేని లోటు ఏం చేసినా తిరిగి రాదు. అటువంటి సమయంలో మరణం ఎందుకు? నిరాశ, నిస్పృహ పరిస్థితులు, సవాళ్లు ఎవరికీ కొత్త కాదు. బతకడమే చేయవలసింది. నిపుణుల సలహాలతో కథనం.
అంకెలు దుర్మార్గమైనవి. అవి నిజమైన నష్టాన్ని చూపించవు. కావాలంటే ఈ అంకె– 1,80,000 చూడండి. దీనిని చూస్తే ఏమీ అనిపించదు. కాని మన దేశంలో ప్రతి ఏటా ఇంతమంది ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారు. వీరందరి ఫొటోలను సముద్రతీరం వెంబడి ప్రదర్శిస్తే ఎన్ని కిలోమీటర్ల తీరం కావాలి? అలా ప్రదర్శిస్తే తెలుస్తుంది తీవ్రత,,, ఇంత మంది చనిపోతున్నారా అని. వీరిలో కనీసం 1,20,000 మంది పురుషులు. ఇప్పుడు ఆలోచించండి.
పితృస్వామ్య ఆధారితమైన మన సమాజంలో పురుషుడు చనిపోతే ఆ ఇంట్లోని ఎంతమంది సభ్యులు దిక్కులేనివారు అవుతారు. జీవితాలు తల్లకిందులు చేసుకుంటారు. మరెన్నో కష్టాల్లో కూరుకుపోతారు. కరోనా అనో మరోటనో మహమ్మారులను చూసి భయపడటం కాదు.
ఈ భూగ్రహాన్ని పీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి ఆత్మహత్యే. ప్రతి ఏటా అన్ని దేశాలలో కలిపి 8 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారు. ఇది ఒక రకంగా కాకిలెక్కే. అసలు లెక్క తెలియక పోవడమే మంచిది. మరో విషయం తెలుసా? ప్రతి మరణానికీ ఒకరు చనిపోవడమే కనిపిస్తుంది... కాని ఆ సమయానికి మరో ఇరవై మంది ఆత్మహత్యాయత్నం చేసి బతికి బయటపడ్డ వాళ్లు ఉంటారు.
ఆరుకు ఒకరు
ప్రస్తుతం మన దేశంలో 15 నుంచి 29 మధ్య వయసు లో ఉన్న పురుషులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే దేశంలోని ప్రతి ఆరు ఆత్మహత్యల్లో ఒకటి ఈ ఏజ్ గ్రూప్ నుంచే ఉంది. బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ఆత్మహత్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం–
∙చదువు ఒత్తిడి ∙పని చోట పీడన∙బంధాలలో దగా ∙ఆర్థిక సమస్యలు ∙అన్ని జీవన పార్శా్వలలో బెస్ట్‌గా ఉండమని కోరే సాంఘిక నియమం
ఇదొక జబ్బు
ఆత్మహత్యను జబ్బుగా ఎవరూ చూడరు. కాని ఇదొక జబ్బు. పట్టలేని ఉద్వేగం వల్ల, క్షణికావేశం వల్ల, నేను చస్తే అవతలివాళ్లు పశ్చాత్తాపంతో బాధ పడాలి అన్నట్టుగా, సమస్యలకు పరిష్కారమే ఉండదన్న నెగెటివ్ స్వభావం వల్ల, పరువు ప్రతిష్టలకు ఎక్కువ విలువివ్వాలనే భావన వల్ల, నోరు తెరిచి సమస్యను బయటపడేయని స్వభావం వల్ల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. తరచి చూస్తే ఇవన్నీ మెదడు చేసే విన్యాసాలే.
కెమికల్ రియాక్షన్సే. ఉద్వేగాలను, ఆవేశాలను దాటి వస్తే, మనం పోయి మరొకరిని సాధించడమనే భావన ఎంతటి హాస్యాస్పదమో ఎరుకలోకి వస్తే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే నమ్మకం కలిగి ఉంటే, పరువు ప్రతిష్టలు తర్వాత ముందు ప్రాణం ముఖ్యం అనుకుంటే, ఆత్మాభిమానం కంటే సమస్య నుంచి బయటపడటం ముఖ్యం అనుకుంటే ఆత్మహత్యలు జరగవు.
మరో విషయం ఏమిటంటే ఒకరికి ప్రపంచ సమస్యగా ఉండేది ఎదుటివారికి అసలు సమస్యే కాకపోవచ్చు. ‘ఇంత చిన్న విషయానికి చనిపోయాడా?’ అని ఆశ్చర్యపోతారు తప్ప జాలి కూడా చూపరు. మరి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? ఆత్మహత్య ఆలోచనలు వస్తే జ్వరానికి మాత్ర మింగినట్టు ఆ ఆలోచనలు పోయే కౌన్సిలింగ్ తీసుకోవాలి. మిత్రుల సహకారం తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో మందులు వాడాలి. అంతే చేయవలసింది. చనిపోవడం కాదు.
భళ్లున తెల్లారుతుంది
ఈ చీకటి రాత్రి విషమ పరీక్షలు ఎన్ని పెట్టినా ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంటే మరునాడు భళ్లున తెల్లారుతుంది. ఆ వెలుతురు దారి చూపిస్తుంది. కొత్త ఊపిరి వస్తుంది. కాని రాత్రే శాశ్వతం అన్నట్టు ప్రాణాలు తీసుకుంటారు కొంత మంది. గత రాత్రి వ్యక్తి చనిపోయినా మరుసటి రోజు లోకం స్తంభించదు. అందరూ ఎవరి పనుల్లో వారుంటారు. సినిమా లు ఆడుతుంటాయి. కెఫేలు బిజీగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు జరుగుతుంటాయి.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నిర్జీవం కావడం తప్ప అంతా మామూలుగా ఉంటుంది. ఆ అంతా మామూలుగా ఉండే జగత్తులో ఉంటూ జీవితాన్ని మిస్ కాకుండా ఉండాలనే భావన కలిగించుకుంటూ ఉండాలి. అందరూ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారని ఎవరిని కదిపినా తెలుస్తుంది. మరి వారంతా చనిపోనప్పుడు మనం ఎందుకు చనిపోవాలి అనుకోవడంలోనే ఉంది విజ్ఞత. ఈ కమ్యూనికేషన్ రోజుల్లో 24 గంటలు ఎన్నో కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
కాల్ చేస్తే సాయం చేస్తారు. ఆ సాయం పొందాలి. వ్యక్తులు బలహీనంగా ఉన్నప్పుడు కుటుంబ బలాన్ని, బంధుబలాన్ని, స్నేహబలాన్ని, సమాజ బలాన్ని తోడు తీసుకోవాలి. సోషల్ మీడియాలో సమస్యను పంచుకుని బయటపడినవారు ఉన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, ప్రజాప్రతినిధులు వీరంతా పౌరులకు ఏదో ఒక మార్గం చూపాల్సినవారే. వారి సాయం పొందాలి. అన్నింటికి మించి జీవితాన్ని సరళంగా, సులభం గా నిర్మించుకుంటే, ఆరోగ్యకరమైన జీవన విధానాలు, అలవాట్లు, క్రమశిక్షణ, ఆహారం, స్నేహితులు.. తోడు చేసుకుంటే జీవించడంలో ఆనందం తెలుస్తుంది.
చెప్పుకునే మనిషీ కోరుకునే అండ
మనిషి తనకొచ్చే కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోడు. ఆ కష్టాలను వినే మనిషి లేకపోవడం వల్ల, నేనున్నాననే భరోసా దొరకకపోవడం వల్ల, నిస్సహాయత ఫీలయ్యి ఆత్మహత్య శరణ్యం అనుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవడం ఒక నిమిషపు నిర్ణయం కాదు చాలామంది విషయంలో. కొందరు రోజుల తరబడి దీని గురించి ఆలోచిస్తారు. ఆలోచిస్తూ ఉంటారు. చివరకు ప్రయత్నిస్తారు. అందుకు సంబంధించిన మార్పులు వ్యక్తులలో, కుటుంబ సభ్యులలో గుర్తించడం చాలామటుకు సాధ్యం. సమస్య ఏమిటో తెలుసుకుంటే, వారిని కదిలించి రాబట్టగలిగితే వారు ప్రమాదపు అంచుకు వెళ్లరు. దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులే ఒకరిని మరొకరు గమనించలేనంతగా బిజీగా ఉంటూ అంతా అయ్యాక కళ్లు తెరుస్తున్నారు.