కోడికి ‘కిక్‌’! | Eradicating Bacteria In Chickens With Grape Wasteage | Sakshi
Sakshi News home page

ద్రాక్ష పిప్పితో కోళ్లలో బ్యాక్టీరియాకు చెక్‌!

May 29 2026 1:43 PM | Updated on May 29 2026 1:43 PM

Eradicating Bacteria In Chickens With Grape Wasteage

వైన్‌ తయారీ తర్వాత మిగిలే వ్యర్థంతో సత్ఫలితాలు..

అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: కోళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు ద్రాక్ష పండ్ల పిప్పి (గ్రేప్‌ పోమేస్‌)ని ఉపయోగించవచ్చని వెల్లడైంది. వైన్‌ తయారీ తర్వాత మిగిలిపోయే వ్యర్థ పదార్థం ( పిప్పి) సాంప్రదాయ యాంటీబయాటిక్స్‌ మాదిరిగానే కోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుందని అమెరికాలో జరిగిన ఒక తాజా అధ్యయనంలో తేలింది.

ద్రాక్ష పండ్లతో వైన్‌ తయారు చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది టన్నుల పిప్పి (ద్రాక్ష తొక్కలు, గింజలు క్రష్‌ అయిన తర్వాత మిగిలేది) మిగిలిపోతుంటుంది. ఈ వ్యర్థ పదార్థంలో అద్భుతమైన ఆహార ప్రయోజనం దాగి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. బయోఫిల్మ్‌ అండ్‌ మైక్రోబయోమ్స్‌ జర్నల్‌లో ఇటీవల ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. కార్నెల్‌ యూనివర్సిటీ ఆహార శాస్త్ర విభాగం పరిశోధకులు మిలన్‌ కె.శర్మ తదితరులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

సాధారణ దాణాకు ద్రాక్ష పిప్పి కలిపి..
అమెరికాలో ఔషధ నిరోధకత, పర్యావరణ నష్టం గురించి పెరుగుతున్న భయాల నేపథ్యంలో.. మాంసం కోసం కోళ్లను పెంచే బ్రాయిలర్‌ ఫారాల్లో యాంటీబయాటిక్స్‌ వాడాకాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కోళ్ల పేగుల్లో వాపును కలిగించే, అనారోగ్యానికి గురిచేసే, పెరుగుదలను తగ్గించే హానికరమైన పేగు బ్యాక్టీరియాను అదుపులో ఉంచడానికి కోళ్ల దాణాలో యాంటీబయాటిక్స్‌ కలుపుతూ ఉంటారు. 30% బియ్యపు తవుడు కలిగిన దాణాలో జింక్‌–బ్రాసిట్రాసిన్‌ అనే యాంటీబయాటిక్‌ను కలిపి ఇస్తుంటారు. తాజా అధ్యయనంలో ప్రయోగాత్మకంగా యాంటీబయాటిక్‌కు బదులు దాణాతో ద్రాక్ష పిప్పిని కలిపి కోళ్లను మేపారు.  

పులిసిన పిప్పిలో యాంటీబయాటిక్‌ గుణాలు!
మొత్తం దాణా బరువులో 0.5% మోతాదులో మాత్రమే ద్రాక్ష పిప్పిని కలిపారు. ఎంతో ఆశ్చర్యకరమైన ఫలితంవెలువడింది. కోళ్లకు ఎటువంటి అనారోగ్యం లేకపోగా 20% అదనపు బరువు పెరిగాయి. వైన్‌ తయారీలో భాగంగా ద్రాక్షపండ్లను పులియబెడతారు.

పులిసిన ద్రాక్షతో వైన్‌ తయారీ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలే పిప్పిలో బ్యాక్టీరియాను అరికట్టే యాంటీబయాటిక్‌ గుణాలు ఉండటం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలుభావిస్తున్నారు. పిప్పిలోని ఫ్లేవనా యిడ్లు, పాలిఫెనాల్స్, టానిన్లు వంటి అనేక జీవక్రియాశీల సమ్మేళనాలు బ్యాక్టీరియా నిరోధకంగా పని చేస్తున్నాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement