త్యాగమే మహోన్నతం | Eid ul Adha 2026 sacrifice and most significant Islamic festivals | Sakshi
Sakshi News home page

Eid ul Adha 2026 త్యాగమే మహోన్నతం

May 28 2026 10:43 AM | Updated on May 28 2026 10:43 AM

Eid ul Adha 2026 sacrifice and most significant Islamic festivals

ఈదుల్‌ అజ్హా– బక్రీద్‌ కేవలం ఒక మతపరమైన పర్వదినం కాదు. అది మనిషిలోని స్వార్థాన్ని అణిచి, ప్రేమను పంచే ఆత్మీయ సాధన. ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలాం) చూపిన త్యాగస్ఫూర్తి, అంకితభావం, దేవుని ఆజ్ఞ పట్ల విశ్వాసం ఈ పండుగకు మూలాధారాలు. కానీ బక్రీద్‌ సందేశం అక్కడితో ఆగిపోదు. ‘మనకు అత్యంత ప్రియమైనదాన్ని కూడా సమాజ మేలుకోసం విడిచిపెట్టగలగడం’ అనే గొప్ప మానవీయ విలువను ఇది ప్రపంచానికి గుర్తు చేస్తుంది. ఈ రోజున చేసే ఖుర్బానీ కేవలం జంతు తర్పణం కాదు; మనలోని అహంకారం, ద్వేషం, అసూయ, స్వార్థాన్ని త్యజించే ఆత్మపరిశీలన కూడా.

నేటి ప్రపంచంలో మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. మతం, కులం, భాష, రాజకీయాల పేరుతో మనసులు విడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బక్రీద్‌ మనకు... పంచుకోవడం, పరస్పర సహకారం, పేదల పట్ల కరుణ, ఆకలితో ఉన్నవారిని గుర్తు చేసుకోవడం వంటి విలువలను నేర్పుతుంది. 

ఖుర్బానీ మాంసాన్నిబంధువులకు, పొరుగువారికి, అవసరమైనవారికి పంచడం వెనుక ఉన్న అసలు భావం కూడా ఇదే. సమాజంలో మనిషి మనిషికి అండగా నిలబడితేనే శాంతి సాధ్యమవుతుంది. నిజమైన భక్తి అనేది తోటి మనిషి కన్నీరు తుడిచినప్పుడే పరిపూర్ణమవుతుందని ఈ పండుగ చాటిచెబుతుంది. హృదయాల్లోని సంకుచితత్వాన్ని వీడి, అందరి శ్రేయస్సును ఆకాంక్షించడమే బక్రీద్‌ నేర్పే పాఠం. ఈ త్యాగనిరతి కేవలం ఒక్క రోజుకే పరిమితం కాకుండా మన నిత్య జీవితంలో అంతర్భాగం కావాలి. అప్పుడే సమాజంలో ద్వేషాల స్థానంలో శాంతి, కరుణ, పరస్పర నమ్మకం చిగురిస్తాయి.
– యండి. ఉస్మాన్‌ ఖాన్‌ (బక్రీద్‌ పర్వదినం సందర్భంగా) 

Advertisement
 
Advertisement
Advertisement