నిల్వ మాంసం మరింత ప్రమాదకరం
హోటళ్లు, రెస్టారెంట్‌లలో నిల్వ మాంసంతో వంటకాల తయారీ
జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండెజబ్బులు, కొల్రస్టాల్, ఒబెసిటీ వచ్చే అవకాశం
గింజలు, పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు మేలంటున్న వైద్యులు
ఒకప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే మాంసాహారం తీసుకునే వాళ్లు. కొందరు ఏదైనా ప్రత్యేక సందర్భంగా మాత్రమే మాంసాహారం తినేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిరోజూ మాంసాహారం తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా మాంసాహారం లాగించేస్తున్నారు. అలాంటి వాళ్లు జబ్బులను కూడా కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో జీర్ణకోశ వ్యాధులతో పాటు, గుండెజబ్బులు, అధిక కొల్రస్టాల్, ఒబెసిటీతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్‌లు కూడా సోకుతున్నాయంటున్నారు. వారంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే మాంసాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవే నిదర్శనం
లబ్బీపేటకు చెందిన రాజేష్ వారంలో ఐదు రోజులు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఫుడ్‌కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుంటాడు. ఇటీవల అర్ధరాత్రి బిర్యానీ తిని ఇంటికి వెళ్లిన తర్వాత కడుపులో తీవ్రమైన మంట రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఎండోస్కోపీ చేయగా అల్సర్స్ వచ్చినట్లు నిర్ధారించారు.
పటమటకు చెందిన అన్వర్ ఎక్కువగా మటన్ తీసుకుంటుంటాడు. ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. గుండె రక్తనాళంలో పూడికలు ఉన్నట్లు నిర్ధారించారు. కొల్రస్టాల్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఇలా వీరిద్దరే కాదు కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలతో వైద్యుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారమిలా..
మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. వారానికి ఒకటీ, రెండు సార్లు మాత్రమే తీసుకోవడం మంచిది.కొవ్వు తక్కువగా ఉండే స్కిన్‌లెస్ చికెన్, చేపలు వంటివి ఎంచుకోవాలి.
పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మాంసాహారం వల్ల కలిగే దు్రష్పభావాలను తగ్గించవచ్చు.
వేపుడు కంటే ఉడికించిన కూరలు తినడం మేలు.
జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి, లేట్ నైట్ మాంసాహారం తీసుకోకూడదు.
ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
సమస్యలు ఇలా...
మటన్, బీఫ్, ఫోర్క్ వంటి రెడ్‌మీట్‌లో జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.రెడ్‌మీట్ తినేవారిలో జీర్ణం కావడానికి అధిక సమయం పట్టడంతో పాటు, పేగుపై వత్తిడి పెరుగుతుంది.
నిల్వ ఆహారం తినడం వలన కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది.
రంగు, రుచి కోసం మాంసాహారంలో కొన్ని రకాల రంగులు వాడుతుంటారు. వాటి కారణంగా క్యాన్సర్‌లు పెరుగుతున్నాయి.
సమయ పాలన లేకుండా జంక్‌ఫుడ్స్ తీసుకోవడం వలన జీర్ణకోశ సమస్యలతో పాటు, క్యాన్సర్‌లకు దారి తీస్తున్నాయి.
మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 12 గంటలకు ఆహారం తీసుకోవడం మంచిది కాదు, ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటించాలి.
మాంసాహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలె్రస్టాల్ స్థాయిలను పెంచుతాయి, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
మాంసాహారంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల, అధికంగా తింటే శరీర బరువు పెరుగుతుంది.
జీర్ణకోశ సమస్యలు పెరిగాయి
అధిక మాంసాహారం తీసుకునే వారిలో జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండె జబ్బులు, ఒబెసిటీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రెడ్‌మీట్ తినే వారిలో పేగులపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం, జంక్‌ఫుడ్స్ తినే వారిలో అల్సర్స్, క్యాన్సర్‌లు సోకే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి సమస్యలతో మా వద్దకు ఎక్కువగా వస్తున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వాలి.
– డాక్టర్ వీర అభినవ్ చింతా, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సెంటినీ విజయవాడ


