డాక్టర్‌ అందమైన జ్ఞాపకం.. రాక్‌చమ్‌ కుగ్రామం

Doctor Shilpa Moves To Mountain Village To Serve The Neglected - Sakshi

డాక్టర్‌ శిల్ప న్యూఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌నారాయణ్‌ హాస్పిటల్‌లో డాక్టర్‌. అది గత ఏడాది అక్టోబర్‌ వరకు. ఇప్పుడామె హిమాచల్‌ ప్రదేశ్‌లోని సంగ్లా బ్లాక్‌ హాస్పిటల్‌లో డ్యూటీ చేస్తోంది. ఈ రెండింటి మధ్య ఓ అందమైన జ్ఞాపకం కిన్నౌర్‌ జిల్లా, రాక్‌చమ్‌ అనే కుగ్రామం. ఆ అందమైన జ్ఞాపకం శిల్పకు మాత్రమే కాదు ఆ గ్రామస్థులకు కూడా. 

డాక్టర్‌ లేని హాస్పిటల్‌
డాక్టర్‌ శిల్ప పుట్టింది చత్తీస్‌గడ్‌లో. అప్పటికి ఆమె తండ్రి అక్కడ కేంద్ర పరిశ్రమల భద్రత విభాగం అధికారిగా ఉన్నారు. తండ్రి బదలీలతోపాటు ఆమె అనేక ప్రదేశాలను చూసింది. ముంబయి వంటి మహా నగరాల్లో అందుబాటులో ఉన్న వైద్యసేవలను గమనించింది. ఒక మోస్తరు పట్టణాల్లో ఉండే చిన్న హాస్పిటళ్లనూ చూసింది. ఇవేకాక... ఒకసారి స్నేహితులతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌లో టూర్‌కెళ్లినప్పుడు మనదేశంలో డాక్టర్‌ ముఖం చూడని గ్రామాలు కూడా ఉన్నాయని తెలుసుకుంది. ప్రభుత్వ వైద్యకేంద్రాలలో పోస్టింగ్‌ అందుకున్న డాక్టర్లు ఆ మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేయడానికి వెళ్లకపోవడమనే వాస్తవం ఆమెను కలచివేసింది. ఇదంతా ముప్పై ఏళ్ల లోపే. అందుకే న్యూఢిల్లీ నుంచి నేరుగా హిమాలయాల బాట పట్టింది. ఆ వెళ్లడం బదలీ మీద కాదు, స్వచ్ఛందంగా. న్యూఢిల్లీ ఉద్యోగాన్ని వదిలేసి సిమ్లా పరిపాలన విభాగం నిర్వహించిన వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలో పేరు నమోదు చేసుకుంది శిల్ప.

ఆమెను ఇంటర్వ్యూ చేసిన వైద్య అధికారులు హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా, రాక్‌చమ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌ పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వం అక్కడ హాస్పిటల్‌ ఏర్పాటు చేయగలిగింది, కానీ డాక్టర్లను పంపించలేకపోతోంది. ఎవర్ని నియమించినా సెలవు మీద వెళ్లే వాళ్లే కానీ వైద్యం చేయడానికి ఆ గ్రామానికి వెళ్లేవారు కాదు. శిల్ప ఆ ఇంటర్వ్యూ వెళ్లడంలో ఉద్దేశమే వైద్యం అందని గ్రామాలకు వైద్య సేవలనందించడం. దాంతో ఆమె సంతోషంగా వెళ్లింది. రాక్‌చమ్‌లోని పీహెచ్‌సీ తాళాలు తీసి గ్రామస్థుల సహాయంతో శుభ్రం చేయించింది. నర్సు కానీ, ఇతర వైద్య సిబ్బంది కానీ ఎవరూ లేరు. డాక్టర్‌ శిల్ప అన్నీ తానే అయి వైద్య సేవలు మొదలు పెట్టింది.

డాక్టర్‌ డ్యూటీ మానరాదు
రాక్‌చమ్‌లో ఎనిమిది వందల మంది నివసిస్తున్నారు. నడి వయసు దాటిన వారిలో దాదాపుగా ఓ యాభై మందికి పైగా బీపీ, డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కానీ తమకు అనారోగ్యం ఉందన్న సంగతి వాళ్లకు తెలియదు. వాళ్లకు క్రమం తప్పకుండా మందులు వాడడం, హాస్పిటల్‌కు వచ్చి పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసింది డాక్టర్‌ శిల్ప. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు... అందరికీ వైద్య ప్రదాత ఆమె. కరోనా సమయంలో ఇంటికి రమ్మని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులు పిలిచినప్పుడు ‘డాక్టర్‌ రోగానికి భయపడకూడదు. అలా భయపడి పారిపోవడం వైద్యవృత్తికే అవమానం’ అని చెప్పింది శిల్ప. ఆమె అన్నట్లుగానే... కరోనాకు వెరవకుండా రాక్‌చమ్‌ గ్రామంలో ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి ఎవరిలోనైనా వ్యాధి లక్షణాలున్నాయేమోనని పరీక్ష చేసింది.

అనుమానం వచ్చిన వారికి జాగ్రత్తలు సూచిస్తూ అవసరమైన వారిని సంగ్లా గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు పంపించేది. అలా నోటి మాట ద్వారా ఆమె సేవలు తెలుసుకున్న సంగ్లా వైద్య అధికారులు కోవిడ్‌ మహమ్మారిని తరిమి కొట్టాల్సిన సమయంలో ప్రత్యేకమైన వైద్య సేవల కోసం శిల్పను సంగ్లాకు బదలీ చేశారు. ఇప్పుడామె సంగ్లాలో విధులు నిర్వర్తిస్తోంది. కానీ రాక్‌చమ్‌ గ్రామస్థులు అప్పుడప్పుడూ ఆమెను చూడడానికి వస్తుంటారు. అనారోగ్యంతో వచ్చిన వాళ్లు డాక్టర్‌ శిల్ప దగ్గరే చూపించుకుంటామని పట్టుపడుతున్నారు. వైద్యరంగం, డాక్టర్లు డబ్బు కోసం రోగి ప్రాణాలతో ఆడుకుంటున్న రోజుల్లో ఇలాంటి డాక్టర్‌ గురించి తెలిస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. 

పుట్టింటి ఆత్మీయత
రాక్‌చమ్‌ నాకు డ్యూటీ స్టేషన్‌ మాత్రమే కాదు, పుట్టింటితో సమానం. గ్రామస్థులు నన్ను ఎంతగానో ప్రేమించేవారు. మహిళలు రోజూ ఎవరో ఒకరు హాస్పిటల్‌కు వచ్చి నేను పేషెంట్‌లను చూడడం పూర్తయ్యే వరకు నాకు తోడుగా ఉండేవారు. వాళ్లింటికి భోజనానికి, టీకి తీసుకెళ్లేవారు. భోజనం అయిన తర్వాత నన్ను ఇంటి దగ్గర దించి వెళ్లేవాళ్లు. నేను వాళ్లకు వైద్యం మాత్రమే చేశాను. వాళ్లు నాకు ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమను పంచారు. – డాక్టర్‌ శిల్ప

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top