
అందుబాటులో ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్
ప్రజల్లో ఇంకా పెరగాల్సిన అవగాహన
మార్కెట్‌లో నకిలీ గ్రీన్ క్రాకర్స్
వెలుగుల పండుగ అయిన దీపావళికి నగరం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే నగరంలో బాణాసంచా హడావుడి మొదలైంది. పలువురు పిల్లలు, పెద్దలు ఇప్పటికే టపాసులు కాల్చుతూ సందడి చేస్తున్నారు. అయితే అక్టోబర్ 20న దేశవ్యాప్తంగా దీపావళిని జరుపుకునేందుకు ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే నగరంలో పలు చోట్ల బాణాసంచా దుకాణాలు ఏర్పాటయ్యాయి. అయితే పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన కారణంగా ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మరోవైపు నకిలీ గ్రీన్ క్రాకర్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వీటిపై ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని పలువురు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. – సాక్షి,సిటీబ్యూరో
గ్రీన్ క్రాకర్స్ పేరుతో మోసాలు..
పర్యావరణ వేత్తలు పిలుపు మేరకు కొంత మంది ప్రజలు గ్రీన్ క్రాకర్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది వ్యాపారులు గ్రీన్ క్రాకర్స్ పేరుతో నకలీ టపాలు విక్రయిస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్ పేరుతో సాధారణ క్రాకర్స్ అమ్మేస్తున్నారు. తేడా తెలియనివారు అధిక ధరలకు కొనుగోలు చేసి మోసపోతున్నారు.
ఎన్ని రకాలు?
గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలు. స్వాస్, సఫల్, స్టార్. స్వాస్ క్రాకర్స్ దుమ్మును పీల్చుకుని సన్నని నీటి బిందువులను విడుదల చేస్తుంది. సఫల్ క్రాకర్స్‌లో సురక్షితమైన మోతాదులో అల్యూమినియం ఉంటుంది. ఇది శబ్దాన్ని తగ్గిస్తుంది. స్టార్ క్రాకర్స్‌లో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉండదు. తక్కువ పొగను విడుదల చేస్తుంది.
ఎలా గుర్తించాలి?
అసలు గ్రీన్ క్రాకర్స్‌ని ఎలా గుర్తించాలి.. గ్రీన్ క్రాకర్స్, సాధారణ క్రాకర్స్ మధ్య తేడా ఏంటి? అనే సందేహం తలెత్తక మానదు. ఇవి సాధారణ క్రాకర్స్ కంటే తక్కువ పొగను, శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిని నేషనల్ ఎన్విరాన్Œమెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఐఎస్‌ఆర్–ఎన్‌ఈఈఆర్‌ఐ) కనిపెట్టింది. గ్రీన్ క్రాకర్స్ 110–125 డెసిబల్స్ శబ్దాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. సాధారణ క్రాకర్స్ 160 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రతి బాణాసంచా బాక్స్‌పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీని ఆధారంగా నకిలీనా.. నిజమైనదా గుర్తించవచ్చు. ఎన్‌ఈఈఆర్‌ఐ యాప్‌ని ఉపయోగించి.. ఈ కోడ్‌ను స్కాన్ చేయాలి. దీంతో ఆ క్రాకర్స్ ఒరిజినలా.. నకిలీవా అని తేలిపోతుంది.