
వేసవిలో మామిడి సందడి తెలియనిది కాదు. పండ్లలో రారాజైన మామిడి రుచికైనా, ఆరోగ్యానికైనా ముందు వరుసలోనే నిలుస్తుంది. భిన్న ఆకారాలు, విభిన్న పరిమాణాలలో పండుతున్న మామిడి పండ్లలో నాణ్యతను గుర్తించడం ఎలా.? అసలు సిసలు మామిడి రుచులను ఎన్నుకోవడం ఎలా? మ్యాంగో లవర్స్‌కి ఇది పెద్ద సమస్యే. అయితే, మామిడిలో నిజమైన, అసలైన రుచులను చవిచూడాలంటే జీఐ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) పొందిన మామిడి రకాల వివరాలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాలు తెలుసుకుందామా?
లంగ్డా(ఉత్తరప్రదేశ్)
వారణాసి ప్రాంతానికి చెందిన ఈ మామిడి పండు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. కొద్దిగా పులుపు, తీపితో చాలామందికి ఇది నచ్చుతుంది. పైగా ఈ కాయ, ముగ్గిన తర్వాత కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది.
కుట్టియత్తూర్ (కేరళ)
కేరళలోని కన్నూర్ జిల్లాలో పండించే ఈ మామిడి పండు మృదువైన, మచ్చలేని తొక్కతో ఉంటుంది. మెత్తని గుజ్జుతో తీపిగా చాలామందికి నచ్చుతుంది. ఇది సాధారణంగా చాలామంది ఇంటి పెరటిలో భాగమైంది.
బంగినపల్లి – బనగానపల్లె (ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ఈ మామిడి పండు తీపి రుచితో పాటు తక్కువ పీచు ఉంటుంది. అంతా గుజ్జే ఉంటుంది. పైగా ఎక్కువ కాలం నిల్వ ఉండటమే దీని ప్రత్యేకత.
మలిహాబాది దసేహరి (ఉత్తరప్రదేశ్)
ఉత్తరప్రదేశ్‌లోని మలిహాబాద్ ప్రాంతంలో పండించే ఈ మామిడి రకం తియ్యటి రుచి, చక్కటి సువాసనకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని సారవంతమైన నేల, వాతావరణం దీని ప్రత్యేకమైన రుచికి కారణం అవుతాయి.
రతౌల్ (ఉత్తరప్రదేశ్)
ఇవి ఉత్తరప్రదేశ్, బాగ్‌పత్ జిల్లా, రతౌల్ గ్రామంలో పండే ఒక ప్రత్యేకమైన మామిడి రకం. పాకిస్తాన్ లో కూడా ఈ రతౌల్ మామిడి సాగు చేస్తారు. అయితే భారతదేశంలో దీనిని రతౌల్ అని పిలిస్తే, పాకిస్తాన్ లో అన్వర్ రతౌల్ అని పిలుస్తారు.
జర్దాలు (బిహార్)
బిహార్‌లోని భగల్పూర్ ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు లేత పసుపు రంగులో ఉంటుంది. దీని సువాసన మరింత ఆకట్టుకుంటుంది. వీటిని ఎక్కువగా బహుమతులుగా ఇస్తుంటారు.
హిమసాగర్ (పశ్చిమ బెంగాల్)
పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, నాదియా జిల్లాల్లో పండించే ఈ మామిడిపండు పీచు లేని గుజ్జుతో తియ్యగా ఉంటుంది. వీటి పరిమళాన్ని చాలామంది ఇష్టపడతారు.
గిర్ కేసర్ (గుజరాత్)
గుజరాత్‌లోని గిర్నార్ కొండల ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు కుంకుమపువ్వు రంగు గుజ్జుతో, తియ్యని రుచికి ప్రసిద్ధి చెందింది. దీనిని ‘మామిడిపండ్ల రాణి’ అని పిలుస్తారు.
కరి ఇషాద్ (కర్ణాటక)
కర్ణాటక తీర ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు తియ్యటి గుజ్జుతో, ప్రత్యేకమైన రుచితో ప్రసిద్ధి చెందింది. దీనిని సాధారణంగా తొక్క, టెంకతో సహా మొత్తం తింటారు.
అల్ఫోన్సో (మహారాష్ట్ర)
‘మామిడిపండ్ల రాజు’ అని పిలువబడే అల్ఫోన్సో మ్యాంగో అద్భుతమైన రుచి, మృదువైన ఆకృతి, ఆకర్షణీయమైన సువాసనతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్, రాయ్‌గఢ్ ప్రాంతాలలో ఇది ప్రత్యేకంగా పండుతుంది.
ఫజ్లీ (పశ్చిమ బెంగాల్)
ఇది ఆలస్యంగా పరిపక్వం చెందే మామిడి రకం. అంటే ఇతర మామిడి పండ్లతో పోలిస్తే ఇవి సీజన్‌లో ఆలస్యంగా పండుతాయి. ఇవి బరువు ఎక్కువగా, పెద్ద పరిమాణంలో కాస్తాయి. వీటిని బంగ్లాదేశ్‌లో కూడా పండిస్తారు. వీటిని జామ్‌లు, పచ్చళ్ళ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.
లక్ష్మణ్ భోగ్ (పశ్చిమ బెంగాల్)
ఈ తియ్యటి మామిడిని పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో పండిస్తారు. వీటిని అధికంగా యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
అప్పెమిడి (కర్ణాటక)
దీన్ని కర్ణాటకలో మల్నాడు ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. ఇది చూడటానికి చిన్నగా ఉంటుంది. ఎక్కువగా ఊరగాయలకు వినియోగిస్తారు. ఈ జాతిలో కచప్ప అప్పెమిడి, కర్నాకుండల అప్పెమిడి వంటి అనేక ఉప రకాలు ఉన్నాయి. అవన్నీ ప్రత్యేకమైన రుచిని, సువాసనను కలిగి ఉంటాయి.
మరాఠ్వాడా కేసర్ (మహారాష్ట్ర)
ఇవి మహారాష్ట్రలోని, మరాఠ్వాడా ప్రాంతంలో సాగు చేసే ఒక రకం మామిడి. ఈ మామిడి కుంకుమపువ్వు రంగుతో గాఢమైన రుచికి, తియ్యదనానికి ప్రసిద్ధి చెందింది.
జీఐ ట్యాగ్ ఉన్న మామిడి పండ్లనే ఎన్నుకుని కొనుగోలు చేయడంతో నాణ్యమైన పండ్లు తినొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటినే ఎంచుకుని, కొనుగోలు చేయడంతో ఆయా పంటను పండించే రైతులకు మద్దతు ఇస్తున్నట్లు కూడా అవుతుంది. మరోవైపు ప్రపంచ దేశాల్లో మన దేశీయ వ్యాపారం మెరుగుపడుతుంది.