భారతదేశంలో విడాకులను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. పైగా చాలా జంటలు వైవాహిక జీవితంలో సంతోషంగా లేకపోయినా..సమాజం కోసం లేదా మరే ఇతర కారణాల వల్లనో కొనసాగతుంటారు. ఆ బంధం ఊపిరాడనంతగా చేస్తున్నా బలవంతంగా కలిసి ఉండేందుకే మొగ్గుచూపుతుంటారు. అయితే అలాంటి వివాహ బంధాన్నే భారత కుటుంబ వ్యవస్థ విజయవంతమైన వివాహ బంధంగా పేర్కొనడం విచిత్రం. ఇది నిజంగా ఎంత వరకు కరెక్ట్ అంటూ నిలదీశారు నాట్ డేటింగ్ యాప్ సీఈవో. అసలు విజయవంతమైన వివాహ బంధం అంటే అసలే ఏంటి అంటూ సోషల్‌మీడియా వేదికగా చర్చ లేవదీస్తూ..తన అభిప్రాయన్ని పంచుకున్నారు.
ఆయన ఏమన్నారంటే..ఇటీవల కాలంలో అసంతృప్తికరమైన వివాహాలు, భావోద్వేగ అనుకూలత గురించిన సంభాషణలు ఆన్‌లైన్‌లో సర్వసాధారణంగా మారాయి. ఆ నేపథ్యంలో నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు సీఈవో జస్వీర్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న వివాహంలో కొనసాగడాన్ని విజయవంతమైన వైవాహికి బంధంగా పరగణించాలా అనే ప్రశ్నను లెవనెత్తారు. చాలామంది తమ ఆనందం కోసం కాకుండా సామాజిక అంచనాల కారణంగా సంబంధాలను కొనసాగిస్తున్నారని వాదించారు.
ఈ మేరకు జస్వీర్‌సింగ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఇలా రాశారు. భారత దేశానికి తక్కువ విడాకులు రేట్లు అవసరం లేదు. ఊపిరాడకుండే చేసే వివాహాలు తక్కువగా కావాలన్నారు. భారత్‌లో విడాకులు రేట్లు తక్కువగా ఉన్నాయనేది గొప్పగా విజయం సాధించనట్లుగా గర్వంగా చెబుతుంటారు. కానీ లక్షలాదిమంది తమ వివాహ బంధంలో మానసికంగా చచ్చిపోయి, బయటకు రావడానికి చాలా భయపడుతున్నారు.
వాళ్లంతా ప్రతిరోజూ తమ లోపల చనిపోతున్నారు. అందుకు ఉదాహరణ ట్విషా శర్మ ఉదంతమే. 30 ఏళ్ల వివాహం దాని విజయానికి తప్పనిసరిగా హామీ ఇవ్వదని, ఎందుకంటే కొంతమంది భాగస్వాములు నిజంగా కలిసి జీవించకుండా కేవలం ఒకరినొకరు భరిస్తారని పేర్కొన్నారు. సంతోషంగా లేని ఇద్దరు వ్యక్తులను దశాబ్దాల పాటు కలిసి ఉండమని బలవంతం చేయడం, విడాకుల కన్నా చాలా బాధాకరమైనది.
మీరు ప్రతిరోజూ చిక్కుకుపోయినట్లుగా, మానసికంగా అలసిపోయినట్లుగా, ఒంటరిగా, ఊపిరాడనట్లుగా భావిస్తూ నిద్రలేస్తే, వాళ్లు ఒక వివాహాన్ని కాపాడటం లేదు. సమాజ పరువును కాపాడుతున్నారు, అని ఆ సీఈఓ పోస్ట్‌లో పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే భారతీయ కుటుంబాలు వివాహం అంటే సర్దుబాటు అని చెప్పి..కొనసాగించాడమే పరవు అని నొక్కి చెబుతుంది. ఆమె లేదా అతడు మానసికంగా లోలోపల కుంగిపోయినా అలా కాపురం చేస్తే..దాన్ని విజయవంతమైన వివాహం అనే చెబుతుంటారు. నిజం చెప్పాలంటే ఇది నిజంగా భావోద్వేగ బంధనం.
ఇక్కడ విడాకులు నిషిద్ధంగా చూడకూడదు. జీవితాంతం దుఃఖంలో మునిగిపోవడమే నిషిద్ధం కావాలి అంటూ పోస్టుని ముగించారు. నెటిజన్లు ఆయన మాటలకు ఏకీభవిస్తూ భారతదేశంలో విడాకులను సాధారణీకరించాలి. మనకు విఫలమైన వ్యాపారాలు ఉన్నట్లే, విఫలమైన సంబంధాలు కూడా ఉంటాయని అంగీకరించాలి, సాధారణ విషయంగా పరిగణించాలి. అయితే భారతదేశం సంతోషంగా కలిసి జీవించడాని కంటే కలిసి ఉండటానికే ప్రాధాన్యత ఇస్తుందని అదే అసలైన సమస్య అని పోస్టులు పెట్టారు. కాగా, ఈ చర్య మానసిక ఆరోగ్యం, విడాకులపై మారుతున్న అభిప్రాయాలను హైలెట్ చేసింది.
(చదవండి: నిస్వార్థమెంత గొప్పదో.. ఈ ఘటనే రుజువు ..!)


