
2023 జనవరి 7న ఒకేరోజు హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన ఐదు పోలీసుస్టేషన్ల పరిధిలో పంకజ్ అలియాస్ పింకు నేతృత్వంలోని గ్యాంగ్ విరుచుకుపడింది. కేవలం రెండున్నర గంటల వ్యవధిలో ఏడు చైన్ స్నాచింగ్స్ చేసిన ఈ ముఠా 20 తులాలకు పైగా బంగారం కాజేసింది. వీళ్లను పట్టుకోవడానికి టాస్క్‌ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్‌లకు (ఎస్‌వోటీ) చెందిన 14 ప్రత్యేక బృందాలు ఐదు రాష్ట్రాల్లో గాలించినా, పాత్రధారి తప్ప సూత్రధారి చిక్కలేదు. 2016లోనూ ఇదే పంథాలో పంజా విసిరిన ఈ ముఠా నాయకుడు అప్పట్లో ‘చిక్కడం–పారిపోవడం’తో ఇప్పటికీ వాంటెడ్‌గానే ఉన్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఉన్న 12 గ్రామాలకు చెందిన కొందరు దేశవ్యాప్తంగా స్నాచింగ్స్ చేయడాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. పోలీసు పరిభాషలో వీటిని బవారియా గ్యాంగ్స్‌గా పిలుస్తారు. ఆ జిల్లాలోని బడా కాన్పూర్ గ్రామానికి చెందిన మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ నేతృత్వంలో పనిచేసే ముఠాలో పింకుతో పాటు రాజీవ్, గోవింద్ సభ్యులుగా ఉండేవారు. 2016 ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చిన మంగళ్ గ్యాంగ్ శాస్త్రీపురంలో డెన్ ఏర్పాటు చేసుకుంది. సైబరాబాద్ పరిధిలో సీరియల్ స్నాచింగ్స్ చేసింది. ఆ ముఠాలో సభ్యుడిగా ఉన్న గోవింద్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అదే ఏడాది మార్చిలో అరెస్టు చేశారు. అప్పటికి పరారీలోనే ఉన్న మంగళ్ షామ్లీ జిల్లాలోని అహ్మద్‌గఢ్, బడా కాన్పూర్ కాలా, నయాబస్ గ్రామాలకు చెందిన సోను కుమార్, రాజీవ్ కోహ్లీ, పింకులతో మరో ముఠా కట్టాడు.
ఈ గ్యాంగ్ 2016 మార్చి రెండో వారంలో హైదరాబాద్ వచ్చింది. వస్తూ వస్తూ ఢిల్లీ నుంచి రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రైలులో పార్సిల్ ద్వారా తీసుకువచ్చింది. వీళ్లు పీర్జాదిగూడ ఆదర్శ్‌నగర్ కాలనీలో డెన్ ఏర్పాటు చేసుకున్నారు. 2016 మార్చి 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని సైదాబాద్, చందానగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మీర్‌పేట్ తదితర ఠాణాల పరిధిలో పన్నెండు స్నాచింగ్స్ చేశారు. వీటితో పాటు మరో రెండు చోట్ల స్నాచింగ్‌కు విఫలయత్నాలు చేశారు. అప్పట్లో ఈ ఉదంతాలు సంచలనం సృష్టించడంతో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
2016లో రెండో దఫా జరిగిన సీరియల్ స్నాచింగ్స్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా వేటాడి వారం రోజుల్లోనే పింకును పట్టుకున్నారు. అతడిని అదుపులో ఉంచుకుని మిగిలిన వారి కోసం గాలిస్తుండగా, అదను చూసుకుని పారిపోయాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు అనేక ప్రాంతాల్లో గాలించారు. రాజస్థాన్‌లో నయాబస్ గ్రామంలో అతడి ఆచూకీ కనిపెట్టి, మరోసారి పట్టుకున్నారు. ఈ ప్రయత్నాల్లో అతడికి గాయం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులే అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. దీన్నీ పింకు తనకు అనువుగా మార్చుకున్నాడు. ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ తీసుకురావాలని పోలీసులు భావించారు. ఈ విషయం అక్కడి న్యాయస్థానం వరకు వెళ్లడంతో చికిత్స పూర్తయ్యే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు వచ్చాయి.
దీంతో పింకు కోసం ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడే ఉంచిన అధికారులు కొన్ని రోజులు అతడిపై కన్నేసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు. గాయాల నుంచి కోలుకున్న పింకు ఆ విషయం బయటపడనీయకుండా క్షతగాత్రుడిగానే నటిస్తూ వచ్చాడు. ఒకరోజు హాస్పిటల్ వద్ద కాపలాగా ఉన్న పోలీసు కళ్లుగప్పి పారిపోయాడు. దీంతో అవాక్కైన అధికారులు ఇక్కడ నుంచి అదనపు సిబ్బందిని పంపారు. వాళ్ల కృషి ఫలితంగా ఒక స్నాచర్ చిక్కగా, పింకు సహా ముగ్గురు పరారీలోనే ఉండిపోయారు. కొన్నాళ్లకు పింకు విషయాన్ని పోలీసులు మరచిపోయారు. ఇలాంటి అదను కోసమే వేచి ఉన్న అతడు 2023లో మరోసారి పంజా విసిరాడు.
మరో ముగ్గురితో ముఠా కట్టి ఆ ఏడాది జనవరి 8న బెంగళూరులో నేరాలు చేసి, మరుసటి రోజు హైదరాబాద్ వచ్చాడు. నాంపల్లిలో ద్విచక్ర వాహనాన్ని తస్కరించిన ఈ ముఠా, ఉప్పల్‌లో మొదలెట్టి రామ్‌గోపాల్‌పేట వరకు వరుసపెట్టి ఏడు చైన్ స్నాచింగ్స్ చేసింది. ఈ నేరాలు చేయడానికి పింకు సహా నలుగురు హైదరాబాద్ రాగా, ఇద్దరు కాచిగూడ రైల్వేస్టేషన్‌లోనే వేచి ఉన్నారు. స్నాచింగ్స్ చేయడానికి వాడిన వాహనాన్ని పింకు, మరో నిందితుడు రామ్‌గోపాల్‌పేటలో వదిలేసి కాచిగూడ వచ్చి మిగిలిన ఇద్దరితో కలిసి పారిపోయారు.
బవారియా గ్యాంగ్ 2016–23 మధ్య హైదరాబాద్‌పై మూడుసార్లు పంజా విసిరింది. 2016 ఫిబ్రవరిలో మంగళ్ నేతృత్వంలో పింకు సహా నలుగురు వచ్చి స్నాచింగ్స్ చేయగా, గోవింద్ ఒక్కడే చిక్కాడు. అదే ఏడాది మార్చిలో మంగళ్ లీడర్‌గా పింకుతో పాటు మరో ఇద్దరితో కలిసి వచ్చి నేరాలు చేశారు. ఆ కేసుల్లో కేవలం సోను మాత్రమే చిక్కాడు. 2023 జనవరిలో పింకు నేతృత్వంలో మంగళ్ (ఇతడు మరో మంగళ్), లక్ష్మణ్, సెహ్వాగ్ వచ్చి రాచకొండ, హైదరాబాద్‌ల్లో ఏడు స్నాచింగ్స్ సహా తొమ్మిది నేరాలు చేశారు. ఈసారి మంగళ్ మాత్రమే చిక్కగా, పింకు సహా ముగ్గురు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. చోరీ సొత్తు సైతం వారి వద్దే ఉండిపోవడంతో రికవరీ కాలేదు. ఈ స్నాచర్ల కోసం పోలీసులు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో గాలించారు. టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ బృందాలు ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ, బవారియాలలో గాలించినా, పింకు మాత్రం చిక్కలేదు.