
పండుగల్లో జరుపుకొనే సంబరాలకు సాహస విన్యాసాలు కూడా తోడైతే, ఆ మజానే వేరుంటుంది. కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్‌కు చెందిన కాల్గరీ నగరంలో జరిగే ‘కాల్గరీ స్టాంపీడ్ ఫెస్టివల్’ అలాంటిదే! ఇది కెనడియన్ పశ్చిమ సంస్కృతికి ప్రతీక. ప్రతి ఘట్టంలోనూ ఉద్వేగం, ప్రతి క్షణమూ ఆశ్చర్యం ఈ వేడుక ప్రత్యేకత! హార్స్ రైడింగ్‌లు, బుల్ ఫైటింగ్‌లతో ఈ సంబరాలు హోరెత్తిపోతాయి.
ఈ పండుగను ‘ప్రపంచంలోనే గొప్ప ఔట్‌డోర్ షో’ అని పిలుస్తారు. ఈ పండుగను జూలై మొదటి శుక్రవారం నుంచి ప్రారంభించి, పదిరోజుల పాటు నిర్వహిస్తారు. ఈసారి జూలై 4న మొదలైన ఈ వేడుక జూలై 13వ తేదీ వరకు జరగనుంది. కెనడా చరిత్రను కళ్ళకు కట్టే ‘చక్–వ్యాగన్’ రేసులను ‘హాఫ్–మైల్ ఆఫ్ హెల్’ అని పిలుస్తారంటే అర్థం చేసుకోవచ్చు, ఆ పోటీల్లో ఎంతటి ఉత్కంఠ ఉంటుందో! ‘ఇవి కేవలం ఆటలు కాదు, నైపుణ్యానికి, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనాలు’ అంటారు స్థానికులు.
ఈ పదిరోజులు రాత్రిపూట కల్గరీ నగరం విద్యుద్దీపాల ధగధగలతో మెరిసిపోతుంది. అలాగే అంతర్జాతీయ కళాకారుల సంగీత కచేరీలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది. ఇక్కడ పాశ్చాత్య సంగీతానికి చిందులు వేస్తూ అలుపు లేకుండా ఆనందించవచ్చు. స్థానిక కళలు, రుచికరమైన ఆహార పదార్థాలు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అద్భుతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన పోటీలు, స్నేహపూర్వక వాతావరణం కలగలిసిన కాల్గరీ స్టాంపీడ్, జీవితంలో ఒక్కసారైనా చూడదగిన అద్భుతమైన పండుగ!