జీవరసాయనం

Brandon Taylor Real Life Novel - Sakshi

కొత్త బంగారం

మిడ్‌వెస్టర్న్‌ అమెరికాలోని ఒక యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న వాలెస్‌ ఆ విభాగంలోకి మూడు దశాబ్దాల వ్యవధి తరువాత చేర్చుకోబడ్డ తొలి నల్లజాతీయుడు. అతను తప్ప సహవిద్యార్థులందరూ తెల్లవారే. ఆ వేసవికాలపు ఆఖరి వారాంతంలో అతను చేస్తున్న ప్రయోగాలలోని సూక్ష్మక్రిములను ఎవరో నాశనం చేసినట్టు గమనించిన వాలెస్, దాన్ని పక్కనబెట్టి మిత్రులని కలవడానికి బయలుదేరడంతో మొదలయ్యే ఈ కాలేజ్‌ క్యాంపస్‌ నవల, అటుతర్వాత మూడురోజులపాటు ల్యాబ్‌ లోపలా, బయటా సాగి ముగుస్తుంది. స్వతహాగా నల్లజాతీయుడు, పైగా లైంగికంగా గే అయిన వాలెస్‌ పట్ల మిత్రులు ప్రవర్తించే తీరు భిన్నంగా ఉంటుంది. ఆ తెల్ల స్నేహితుల్లోనూ గేలు చాలామందే ఉన్నా అదెవరికీ అభ్యంతరకరంగా ఉండకపోవడం వాలెస్‌ గమనిస్తాడు. స్నేహాలు పైకి మామూలుగానే ఉన్నట్టనిపించినా దాని అడుగున అదృశ్యంగా ఉండే ఆధిపత్యపు భావనలు వాలెస్‌కి తెలుస్తూనే ఉంటాయి.

వాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు వాలెసే తీసుకోవాలి. ఆ స్నేహాలు ఎంత పలచగా ఉంటాయంటే, అంతకుమునుపే కొన్నివారాల క్రితం వాలెస్‌ తండ్రి మరణించాడన్న విషయం తెలుసుకున్న మిత్రులు అంత్యక్రియలకి వాలెస్‌ వెళ్లలేదన్న వాస్తవాన్ని గుర్తిస్తారే తప్ప, చిన్నతనంలోనే వాలెస్‌ మీద జరిగిన లైంగిక దాడులని చూస్తూకూడా ఆ తండ్రి మిన్నకుండిపోయాడన్న విషయాన్ని తెలుసుకునే ఆసక్తి వారికుండదు.  ఆ వారాంతంలోనే మిల్లర్‌ అనే శ్వేతజాతీయుడి ప్రేమలో పడిన వాలెస్‌ తరువాతి రెండుమూడు రోజులపాటు క్లిష్టమైన మానసిక సంక్షోభాలకి గురవుతాడు. మిల్లర్‌ ప్రేమలో కూడా విడమరిచి వివరించడానికి వీలుకాని గందరగోళాంశాలు కనిపించడం అసలే అంతర్ముఖుడైన వాలెస్‌ని మరింత ఆత్మావలోకనంలోకి తోసేస్తుంది. రెండుమూడు రోజులపాటు స్నేహితులతో గడిపిన క్షణాలూ, వారి స్పందనలూ, మిల్లర్‌తో సన్నిహితంగా గడిపిన సన్నివేశాలూ వాలెస్‌ని తన జీవితాన్ని పునస్సమీక్షించుకోమంటాయి.

భవిష్యత్తేమిటో నిర్ణయించుకోమంటాయి. నిజమైన జీవితం అంటే ఏమిటో బలమైన ఎరుకని ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని వాలెస్‌ గుర్తిస్తుండగా నవల ఓపెన్‌–ఎండెడ్‌గానే ముగుస్తుంది. సమాజం తనని స్వీకరించకపోవడం తన ఒంటరితనానికి కారణమనీ, తను కోరుకున్నదేదీ తనని కోరుకోలేదనీ అనుకుంటూ వస్తున్న వాలెస్, సమాజాన్ని తానూ అంగీకరించాలనే సానుకూలాంశంతో నవల ముగియడం– అది ఆశావహమైన ముగింపే కావొచ్చన్న సూచననిస్తుంది. ‘జ్ఞాపకాలనేవి వాస్తవాలతో నిమిత్తం లేని గతకాలపు విషాదాల ఉరామరికమైన తూకమే’ అయివుండవచ్చు. అయినప్పటికీ గతాన్ని విస్మరించి ముందుకు సాగడమే అవసరం; ఎందుకంటే, గతానికేమీ భవిష్యత్తు అక్కర్లేదు! 

సమాజం తన హోమోఫోబియా(స్వలింగ సంపర్కాల పట్ల విముఖత)ని పరోక్షంగా ఏదో రూపంలో చూపిస్తుంటుంది. వాలెస్‌ జీవితం ఒక సంక్లిష్టమైన చిత్రం. అతని ప్రయోగాన్ని నాశనం చేసిన సహవిద్యార్థిని జాతివివక్ష గురించి చెప్పితీరాల్సివచ్చిన సందర్భంలో అంతా విన్న ప్రొఫెసర్‌ అతన్ని స్త్రీద్వేషి అని ప్రత్యారోపణ చేస్తుంది. వివక్షని తమదైన పద్ధతిలో విశ్లేషించి అసలది వివక్షే కాదన్న తీర్పూ ఇచ్చి దాన్నే బలంగా నమ్మడం శ్వేతసమాజపు సహజలక్షణం. జాతి, మతం, కులం, జెండర్, లైంగికత, శరీరవర్ణం లాంటి విశేషాలన్నీ వివిధ పరిమాణాలలో కలగలిపి, ఇరుకైన ఒక ఇంటర్‌సెక్షనల్‌ అస్తిత్వాన్ని సమాజం మనిషికి అంటగట్టి, దానిమీదే తేరుకోలేని దాడి చేస్తుంది. 

బుకర్‌ ప్రైజ్, 2020 షార్ట్‌లిస్ట్‌లోని ఈ మూడవ నవల రచయిత బ్రాండన్‌ టేలర్‌ తొలినవల. కథాంశం కొత్తది కాకపోయినా, లైంగికతాంశపు దృష్టికోణం నుంచి సమస్యని చూపడం రియల్‌ లైఫ్‌ ముఖ్యాంశం కాగా, స్వయంగా నల్లజాతీయుడైన రచయిత వల్ల నవలకి సాధికారత లభించినట్టయింది. వాలెస్‌ ఆంతరంగికత మీదనే ఎక్కువగా నడిచే కథ కొన్నిచోట్ల అవసరాన్ని మించి విస్తరిస్తూంటుంది. పాత్ర భావోద్వేగాలని ఆయా భాగాల్లో వేరుచేసుకుని జాగ్రత్తగా గమనించవలసి వస్తుంది. అనుభవాల నుంచి చేసే సూత్రీకరణలు ఆకట్టుకుంటూనే, కొన్నిభాగాల్లోని ప్రేమలూ, విరహాలూ, కోపతాపాలూ, ఈసునసూయలూ సగటు శృంగార ప్రేమకథని చదువుతున్న భ్రాంతిని కలగజేస్తాయి. అయినప్పటికీ, ఇది ప్రస్తుత సందర్భాలలోని అసమంజసతలని సున్నితంగా విమర్శించిన వాణి.
- ఎ.వి.రమణమూర్తి

నవల: రియల్‌ లైఫ్‌
రచన: బ్రాండన్‌ టేలర్‌
ప్రచురణ: రివర్‌హెడ్‌ బుక్స్‌; 2020

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top