
మొదటి రోజున అమ్మవారిని శ్రీ బాలాత్రిపురసుందరీదేవి రూపంలో గులాబిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం సమర్పిస్తారు.
రెండో రోజున శ్రీ గాయత్రీదేవి రూపంలో నారింజరంగు చీరతో అలంకరిస్తారు. కొబ్బరి అన్నం, అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.
మూడో రోజున శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో నీలిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా మినప వడలు, పులిహోర సమర్పిస్తారు.
నాలుగో రోజున శ్రీ కాత్యాయనీదేవి రూపంలో పసుపురంగు చీరతో అలంకరిస్తారు. పాయసం, రవ్వకేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఐదో రోజున శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో గులాబిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, రవ్వకేసరి సమర్పిస్తారు.
ఆరో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవి రూపంలో పసుపురంగు చీరతో అలంకరిస్తారు. రవ్వకేసరి, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.
ఏడో రోజున శ్రీ మహాచండీదేవి రూపంలో బంగారురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా కట్టుపొంగలి సమర్పిస్తారు.
మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి రూపంలో తెలుపురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పాయసం, శాకాన్నం సమర్పిస్తారు.
దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి రూపంలో ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా కదంబం సమర్పిస్తారు.
మహర్నవమి రోజున
శ్రీ మహిషాసురమర్దిని రూపంలో నీలిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా చక్కెరపొంగలి సమర్పిస్తారు.
చివరిగా విజయదశమి రోజున
శ్రీ రాజరాజేశ్వరి రూపంలో ఆకుపచ్చ చీరతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం సహా మహానైవేద్యాన్ని సమర్పిస్తారు.
దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ తొమ్మిది రోజుల వేడుకలు దసరా నవరాత్రులకు ఒకరోజు ముందుగానే, భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. బతుకమ్మ వేడుకల్లో రంగురంగుల పూలతో బతుకమ్మను వాకిళ్లలో కొలువుదీర్చి; బాలికలు, మహిళలు బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడతారు.
బతుకమ్మ వేడుకల తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఈ రోజున బియ్యంపిండి, నువ్వులు కలిపిన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు.
రెండో రోజు అటుకుల బతుకమ్మ. ఈ రోజున చప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు.
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యంగా సమర్పిస్తారు.
నాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ. ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.
ఐదో రోజు అట్ల బతుకమ్మ. ఈ రోజున నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు.
ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజున నైవేద్యం ఏమీ సమర్పించరు.
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. ఈ రోజున బియ్యంపిండిని బాగా వేపి, వేపకాయల్లా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిది రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ. ఈ రోజున ఐదురకాల నైవేద్యాలను సమర్పిస్తారు.
బతుకమ్మ వేడుకలు ముగిశాక విజయదశమి నాడు దసరా పండుగను ఊరూరా ఘనంగా జరుపుకొంటారు. శమీవృక్షానికి– అంటే, జమ్మిచెట్టుకుపూజ చేస్తారు. ఒకరికొకరు జమ్మి ఆకులను ‘బంగారం’గా ఇచ్చుకుని, అభినందనలు తెలుపుకుంటారు. విందు వినోదాలతో దసరా పండుగను ఆనందంగా జరుపుకొంటారు.