తంగేడు పూసింది గునుగు నవ్వింది | Bathukamma Festival 2025: Flowers, Traditions & Telangana’s Unique Celebrations | Sakshi
Sakshi News home page

తంగేడు పూసింది గునుగు నవ్వింది

Sep 21 2025 8:42 AM | Updated on Sep 21 2025 11:01 AM

Bathukamma Celebrations

నేటి నుంచి పూల జాతర  

ఎంగిలిపూలతో వేడుకలు ప్రారంభం

బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న ఆడపడుచులు 

చినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు ముత్యం మాదిరిగా గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది.

వీధులు.. పూల వనాలు
రామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలు గా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరి విగా పూసే పూలతో సిబ్బిలో పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. 

కనిపించని గునుగు
గునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు గునుగు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్‌లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్‌ ఏర్పడనుంది.

ఆడపడుచుల వేడుక
బతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు.

విభిన్నం బతుకమ్మ
ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే జిల్లాలోని విభిన్న సాంస్కృతుల కారణంగా బతుకమ్మను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వేములవాడ, మానకొండూర్‌ మండలం శ్రీని వాస్‌నగర్, రాఘవాపూర్, కరీంనగర్‌ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవా యితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావి లాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుమ్మ అనంతరం బావిని పూడ్చుతారు.

రాజన్న పాట వినాలి్సందే
ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుక మ్మ పాటల స్పెషలిస్ట్‌.  మ హిళలకన్నా మధురంగా పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. సొంత గ్రామంలో బతుక మ్మ పాటలు పాడుతూ.. గుర్తింపు తెచ్చుకున్నాడు.

60 ఏళ్లనుంచి ఆడుతున్న
మల్యాల: పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది.
– ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాల

నుదుటి సిందూరం 
పండుగల్లో ముఖ్యమైంది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత.        
– వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement