వైరల్
అందాల పోటీలు అంటేనే మేకప్... ఇంకా చెప్పాలంటే భా...రీ మేకప్! అయితే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఆల్‌స్టార్స్‌లో పాల్గొన్న మహిళలు (పోటీదారులు) వేదికపైనే మేకప్ తొలగించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆకర్షణీయమైన గౌన్లు ధరించిన ఈ అందాల రాణులు మేకప్‌ను తుడిచి వేసి ఎలాంటి మేకప్ లేకుండానే ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌పై నడిచారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
సౌందర్య సాధనాలకు అతీతంగా సహజ సౌందర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పేందుకు తొలిసారిగా ఈ పోటీలో ‘బేర్ ఫేస్ ఛాలెంజ్’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఛాలెంజ్ థాయ్‌లాండ్‌లో జరుగుతున్న అందాల పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ రౌండ్‌లో పోటీదారులు పూర్తి మేకప్‌తో వెలుగులు వెదజల్లుతున్న వేదికపైకి అడుగు పెడతారు. వేదిక మధ్యలో వేసిన కుర్చీలలో కూర్చుని ప్రేక్షకులు చూస్తుండగా బోల్డ్ లిప్‌స్టిక్ నుంచి ఐ మేకప్ వరకు మేకప్ మొత్తం తుడుచుకుంటారు. ‘అందాల పోటీలు సాధారణంగా ఆడంబరమైన మేకప్, స్టైలింగ్ తో నిండి ఉంటాయి.
ఈ సంప్రదాయానికి విరుద్ధంగా ఇంటర్నేషనల్ ఆల్‌స్టార్స్ పోటీ ఒక సాహసోపేతమైన అడుగువేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే... ‘సహజమైన సౌందర్యమే అసలు సిసలు సౌందర్యం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు నెటిజనులు. పోటీకి సంబంధించి గ్రాండ్ ఫినాలే ఈరోజు థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. అక్కడ పోటీదారులు ‘ఆల్‌స్టార్స్’ కిరీటం కోసం పోటీపడతారు.


