Guru Purnima 2022: ఒక గురువు... వేలాది మంది శిష్యులు

Article On Paramahansa Yogananda On The Occasion Of Guru Purnima - Sakshi

గురు శిష్య సంబంధం అనేది మన జీవితాల్లో  ఒక ప్రధాన అంశం. మన సాంప్రదాయక విలువల్లో విధిగా అది ఒక భాగం. మన భారతీయ సమాజం గురువుని అత్యున్నత పీఠంపై నిలిపింది. అలాగే పరమహంస యోగానంద శిష్యురాలూ, యోగదా సత్సంగ సమాజానికి పూర్వ అధ్యక్షురాలు మృణాళినీ మాత తాను రచించిన ‘గురుశిష్య సంబంధం’ అనే పుస్తకంలో శిష్యుడి జీవితాన్ని మరెవరూ మార్చలేని విధంగా ఒక గురువు మార్చగలరన్న సత్యాన్ని శక్తివంతంగా ఉద్ఘాటించారు. శిష్యుడిని అన్ని విధాలా తనకు ప్రతిరూపంగా తయారుచేయడానికి కావలసిన శక్తిని, సహజమైన సామర్థ్యాన్ని గురువు కలిగి ఉంటారు.
చదవండి: నిన్ను వెలిగించే దీపం... నవ్వు

నేటి ప్రపంచంలో బాగా పేరున్న ఒక గురువును పట్టుకోవడం తేలికే. అయితే యోగానంద గురువును ఎంచుకోవడంలో జాగ్రత్త వహించమని సలహా ఇచ్చారు: ‘‘జీవితమనే లోయలో నీవు గుడ్డిగా తప్పటడుగులు వేస్తూ వెళ్తున్నపుడు, కళ్ళున్నవారి సహాయం నీకు కావాలి. ఆ మార్గం సత్యమైనదా, కాదా అని తెలుసుకోవడానికి, దాని వెనుక ఎటువంటి గురువు ఉన్నారు, ఆయన చేసే పనులు తాను భగవంతుని చేత నడపబడుతున్నట్టు ఉన్నాయా, లేక తన స్వంత అహంతో నడపబడుతున్నట్టు ఉన్నాయా అని విచక్షణతో తెలుసుకోండి. ఆత్మసాక్షాత్కారం పొందని గురువుకు ఎంత పెద్ద శిష్యబృందం ఉన్నా అతడు మీకు దైవ సామ్రాజ్యాన్ని చూపలేరు.’’ అని చెప్పేవారాయన.

శతాబ్దాలుగా హిమాలయాల్లో జీవించి ఉన్న మహావతార బాబాజీ తన గొప్ప శిష్యులలో ఒకరైన లాహిరీ మహాశయులకు 1861లో ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయిన క్రియాయోగంలో దీక్ష ఇచ్చారు. ఆ తరువాత ఆయన శిష్యులైన యుక్తేశ్వర్‌ గిరి వై.ఎస్‌.ఎస్‌./ ఎస్‌.ఆర్‌.ఎఫ్‌. సంస్థలను స్థాపించి ఈ మార్గంలోకి వేలాదిమందిని తీసుకువచ్చిన పరమహంస యోగానందకి శిక్షణనిచ్చి ఆయనను సిద్ధం చేసే బాధ్యత స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా జీవితాల్ని మార్చగల ఉజ్జ్వల ఆధ్యాత్మిక కావ్యంగా ప్రఖ్యాతి పొందిన తన ‘ఒక యోగి ఆత్మకథ’లో గురుశిష్య సంబంధాన్ని గురించి యోగానంద అత్యంత విశదంగా వివరించారు.

ఎంతో జాగ్రత్తతోనూ సూక్ష్మదృష్టితో శ్రీ యుక్తేశ్వర్‌ యోగానందకి ఇచ్చిన శిక్షణతో యోగానంద భగవంతుడితోనూ గురువుతోనూ అనుసంధానంలో ఉండడం ఎలాగో చూపించిన ఒక నిజమైన దృష్టాంతంగా రూపుదిద్దుకొన్నారు. ఇక యోగానంద తన వంతుగా యోగధ్యానం, సమతుల జీవనాన్ని బోధించే తన సార్వత్రిక బోధల ద్వారా తన జీవిత కాలంలో వేలకొద్దీ శిష్యులకు, అనంతరం లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకునిగా, తత్వవేత్తగా తోడ్పాటు నందించారు.

పతంజలి బోధించిన అష్టాంగయోగ మార్గంపై ఆధారపడిన తన ఆధ్యాత్మిక సాధనా పద్ధతిని విశ్వాసంతో, స్థిరంగా అభ్యసించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు యోగానంద. ప్రతి వ్యక్తీ ఒక ఆత్మ అనీ అంతర్గతంగా అది పరమాత్మ తో తన ఏకత్వాన్ని పునఃస్థాపించుకోవడానికి తపిస్తుంటుందనీ బోధించారు. సత్యాన్వేషకులందరూ లోతుగా అర్థం చేసుకోవడం కోసం... ఆయన రచించిన జీవించడం ఎలాగో నేర్పే గహాధ్యయన పాఠాలు ఆయన బోధలకు ఆనవాళ్లు. భారతదేశపు గొప్ప గురువులకు మనం అందించగల అత్యంత గొప్ప నివాళి గురుపూర్ణిమ. గురువు ఆదర్శాలకు ఈ ముఖ్యమైన రోజున పునరంకితం కావడం ద్వారా చిత్తశుద్ధి గల శిష్యుడు ఆత్మసాక్షాత్కార నిచ్చెనపై తరువాతి మెట్టును ఎక్కుతాడు.
(నేడు గురుపూర్ణిమ) 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top