Anupama Saxena: అమ్మాయిల్లో ఆకాష్‌ను చూస్తూ...

Anupama Saxena From Uttar Pradesh Started Education Foundation Lost Son - Sakshi

జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు లోనవుతుంటాము. మనకెంతో ఇష్టమైన వారిని శాశ్వతంగా కోల్పోయినప్పుడైతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ దూరమైన వారే సర్వసం అయినప్పుడు జీవితం మొత్తం శూన్యమైపోయినట్లు అనిపిస్తుంది. అనుపమా సక్సేనాకు కూడా తన కొడుకు చనిపోయినప్పుడు తీవ్రమైన నైరాశ్యం ఆవహించి, జీవితం మొత్తం చీకటైపోయింది. 

ఎప్పటికీ ఈ బాధనుంచి తేరుకోలేననుకుంది. కానీ తన కొడుకుకున్న ఒక మంచి లక్షణంతో ఊరట పొంది, కొడుకు పేరుమీద ఫౌండేషన్‌ను స్థాపించి వందలమంది అమ్మాయిలకు చదువు చెబుతూ..  వారి భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. తన కొడుకుని ఆ అమ్మాయిల్లో చూసుకుంటూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది అనుపమ.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన వందల మంది అమ్మాయిల టీచరమ్మే అనుపమా సక్సేనా. ఆమె భర్త స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగి. అనుపమ దంపతులకు ‘ఆకాష్‌’ ఒక్కగానొక్క సంతానం. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తల్లిదండ్రుల మాటలను బుద్దిగా పాటిస్తూ చక్కగా చదువుకున్నాడు ఆకాష్‌. డిగ్రీ పూర్తి కాగానే మంచి కంపెనీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాడు.

ఉద్యోగం వచ్చిన తరువాత తల్లిదండ్రులు మంచి అమ్మాయితో 2008 నవంబర్‌లో నిశ్చితార్థం చేశారు. మరికొద్దిరోజుల్లో పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించారు. కాబోయే అమ్మాయి పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకుంటూ, ఆకాష్‌తో తన కొత్త జీవితంపై కలలు కంటోంది. ఇంతలో 2009 జనవరి 7న లక్నోలో ఆకాష్‌కు యాక్సిడెంట్‌ అయ్యింది. ఈ యాక్సిడెంట్‌లో తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయాడు. కేవలం 25 ఏళ్లకే తన కొడుకుకు నిండు నూరేళ్లు నిండాయని అనుపమ కుప్పకూలిపోయింది.  

ఆకాష్‌ మైండ్‌ వాల్‌ ఫౌండేషన్‌ 
రెండేళ్లపాటు ఆకాషపకాల్లో కూరుకుపోయిన అనుపమ ..పదేపదే ఆకాష్‌నే గుర్తుచేసుకుంటూ బాధపడుతుండేది. అలా తనతో ఆకాష్‌ ఊసులాడిన సందర్భాలు గుర్తు చేసుకుంటోన్న క్రమంలో... ఎవరైనా సాయం కావాలని అడిగితే వారికి కాదనకుండా వీలైనంత సాయం అందించడానికి ఆకాష్‌ ప్రయత్నించడం గుర్తుకొచ్చింది. ‘ఆకాష్‌లా నేనెందుకు చేయకూడదు. వాడికి నచ్చిన పనిచేస్తే నా కొడుకు కళ్ల ముందే ఉంటాడు కదా...’ అన్న ఆలోచన వచ్చింది అనుపమ కు. భర్త, బంధువుల సాయంతో 2011లో ‘ఆకాష్‌ మైండ్‌ వాల్‌ ఫౌండేషన్‌’ను స్థాపించింది. 

అర్ధంతరానికి ఆయువు పోసి... 
ఘజియాబాద్‌లోని వైశాలీలో టీచర్‌గా పనిచేస్తోన్న అనుపమకు..ఆ ప్రాంతంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేదని తెలిసింది. అంతేగాకుండా చదువుకోవడానికి ఎనిమిదో తరగతి వరకే అవకాశం ఉంది. నిరుపేద బాలికలు పై చదువులు చదువుకునే స్థోమత లేక అక్కడితో చదువుని ఆపేస్తున్నారు. ఇలా చదువు ఆపేసిన వారు కొంత మంది ఇళ్లలో పనులు చేస్తుంటే, మరికొందరు చిన్న వయసులో పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది.

వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూసిన అనుపమ.. అర్ధాంతరంగా ఆగిపోయిన చదువులకు ఆయువు పోసేందుకు పాఠాలు చెప్పడం ప్రారంభించింది. తన దగ్గరకు వచ్చే అమ్మాయిలందరికి ఉచితంగా చదువు చెప్పి నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) ద్వారా పరీక్షలు రాయించి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు పూర్తి చేయించడమే పనిగా పెట్టుకుంది. ఇంకా పై చదువులు చదివించడానికి, స్కూల్‌ ఆఫ్‌ ఓపెన్‌ లెర్నింగ్‌(ఎస్‌ఓఎల్‌)లో డిగ్రీలు కూడా చేయిస్తోంది. బ్యాచ్‌కు ఇరవై మంది చొప్పున పదుల సంఖ్యలో బ్యాచ్‌లు నడుపుతోంది. వీరికి సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయలకు పైగా అయ్యేఖర్చు మొత్తాన్ని అనుపమ దంపతులే భరిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top