సైన్‌ లాంగ్వేజ్‌ ఇకపై సులభం! | AI software to translate sign language into words Priyanjali Gupta | Sakshi
Sakshi News home page

సైన్‌ లాంగ్వేజ్‌ ఇకపై సులభం!

May 1 2026 10:25 AM | Updated on May 1 2026 11:02 AM

AI software to translate sign language into words Priyanjali Gupta

యంగ్‌ టాలెంట్‌ 

చెవిటి, మూగ వారి భాష సంజ్ఞలు మాత్రమే. వీటిని కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల వారు సమాజంలో అన్ని చోట్లా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికోసమే సంజ్ఞల భాషను.. మాటల్లోకి మార్చే ఏఐ మోడల్‌ను రూపొందించింది 20 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యార్థిని ప్రియాంజలి  గుప్తా (Priyanjali Gupta). టెన్సర్‌ఫ్లో పైథాన్‌ ను ఉపయోగించి, అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ని తక్షణమే ఇంగ్లీష్‌ పదాలుగా మార్చే సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది. గూగుల్‌ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్‌ సాంకేతికతలను దివ్యాంగులకు మరింత దగ్గర చేయడంలో ఇది ఒక కీలక అడుగుగా  మారనుంది...

తమిళనాడుకు చెందిన ప్రియాంజాలి గుప్తా వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె వెబ్‌క్యామ్, ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి, సంజ్ఞలను గుర్తించి.. వాటిని తక్షణమే పదాలుగా మార్చే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.  సంజ్ఞల భాషను అందరూ అర్థం చేసుకోవడం అనేది చాలా పెద్ద, కష్టమైన సమస్య అని ప్రియాంజలికి ఉన్న బలమైన నమ్మకం. ఒక చిన్న స్థాయి సాఫ్ట్‌వేర్‌ దీనిని పరిష్కరించలేదని ఆమె ఆలోచన. సైన్‌ లాంగ్వేజ్‌లో ముఖ కవళికలు, భుజాల కదలికలతోపాటు మరిన్ని అంశాలు ఉంటాయని.. వాటన్నింటినీ అర్థం చేసుకోవడానికి చాలా బాగా శిక్షణపొందిన ఒక నెట్‌వర్క్‌ అవసరమని ఆమె భావించింది. అందుకే ఏఐ సాయంతో ఆమె ఈ మోడల్‌ని రూపొందించింది. సుమారు 300 చిత్రాల డేటా సెట్‌ను మాన్యువల్‌గా సిద్ధం చేసి, పైథాన్‌ భాషలో దీని కోడింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతానికి, ఈ వినూత్న సాఫ్ట్‌వేర్‌ కేవలం అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ను మాత్రమే అనువదిస్తుంది. ప్రతి భాషలో సంజ్ఞలు వేర్వేరుగా ఉంటాయి. 

కేవలం చేతి కదలికలే కాకుండా, ముఖ కవళికలను కూడా అర్థం చేసుకునేలా దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని ప్రియాంజలి చెబుతోంది. ఆమె రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌ ప్రస్తుతానికి అవును, కాదు, దయచేసి, ధన్యవాదాలు, ఐ లవ్‌ యు, హలో వంటి ఆరు సంజ్ఞలను విజయవంతంగా అనువదిస్తోంది. మరిన్ని డేటా సెట్లతో దీనిని పూర్తిస్థాయి మోడల్‌గా మార్చేందుకు ఆమె కృషి చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ చేతులు, వేళ్ల వంటి శరీర భాగాల కదలికలను విశ్లేషించడం ద్వారా సంజ్ఞలను విజయవంతంగా టెక్ట్స్‌గా మారుస్తుంది. ఈ ఏఐ సాఫ్ట్‌వేర్‌ వినికిడి లోపం ఉన్నవారితో అప్పటికప్పుడే కమ్యూనికేట్‌ చేయడానికి ఒక డైనమిక్‌ మార్గంగా తోడ్పడుతుంది.

ప్రియాంజలి తన ఆవిష్కరణను లింక్డ్‌ ఇన్‌ వేదికగా పంచుకోగా, అది విపరీతంగా వైరలయ్యింది. దాంతో ఎన్నోవేల మందికి ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌పై ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ అందరికీ అందుబాటులో ఉంది. అందువల్ల శాస్త్రవేత్తలు దీనిని ఇతర భాషలకు అనుగుణంగా, మరింత మెరుగ్గా మార్చవచ్చు. ఈ చిన్న ప్రయత్నం భవిష్యత్తులో దివ్యాంగుల కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

నా భవిష్యత్‌ లక్ష్యం
సాంకేతిక రంగంలో దివ్యాంగుల కోసం తగినంత సదుపాయాలు లేవని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మూగ, చెవుడు ఉన్నవారు గూగుల్, ఎకో లేదా అలెక్సా వంటి వాయిస్‌ అసిస్టెంట్‌లను ఉపయోగించాలనుకుంటే పరిస్థితి ఏంటి? మన దగ్గర దానికి సరైన పరిష్కారాలు లేవు. మా అమ్మ దగ్గరికి చదువుకునేందుకు ఒక వినికిడి లోపం ఉన్న విద్యార్థిని వస్తుండేది. ఆమె తన ఆలోచనలను వ్యక్తీకరించడంలో పడుతునన ఇబ్బందిని స్వయంగా చూశాను. అందువల్ల అటువంటి వారి గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను. అందుకే ఈ చిన్న స్థాయి మోడల్‌ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. అలా ఆ ప్రయత్నం నుంచి వచ్చిందే ఈ సైన్‌ లాంగ్వేజ్‌ సాఫ్ట్‌వేర్‌.  ప్రపంచ సమస్యలను పరిష్కరించే సాంకేతికతను నిర్మించడమే నా భవిష్యత్‌ లక్ష్యం.   – ప్రియాంజలి గుప్తా

 

Advertisement
 
Advertisement
Advertisement