ద్వారకాతిరుమల: నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు కానుండటంతో వ్యాపారులు, వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఫోన్‌పై, గూగుల్‌పే, పేటీఎం తదితర యూపీఐ యాప్‌ల ద్వారా ప్రజలు నగదు అవసరం లేకుండానే సులభంగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే.. వచ్చేనెల 15 నుంచి రూ.2 వేలకు మించిన కొన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ విధించే విధానం అమల్లోకి రానున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌న్‌పీసీఐ) ప్రకటించింది. దీంతో డిజిటల్ చెల్లింపులపై అదనపు వ్యయం పడుతుందేమోనన్న సందేహాలు అంతటా నెలకొన్నాయి. ఎండీఆర్ నేరుగా వ్యాపారులపై విధించే చార్జీ అయినా.. దీని ప్ర భావం పరోక్షంగా వినియోగదారులపైనా పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపారులు అదనపు లావాదేవీ వ్యయాన్ని వస్తువులు, సేవల ధరల్లో సర్దుబాటు చేస్తే చివరికి ఆ భారం వినియోగదారులపై పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎండీఆర్ అమలు విధానం ఎలా ఉండబోతోంది? ఏయే లావాదేవీలకు ఇది వర్తిస్తుంది? దీని ప్రభావం వ్యాపారులు, వినియోగదారులపై ఏ మేరకు ఉంటుంది? అనే అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
● సేవా టికెట్లు : ద్వారకాతిరుమల క్షేత్రంలో యూపీఐ చెల్లింపుల్లో ఎక్కువగా రూ.2 వేల లోపే ఉంటున్నాయి. శ్రీవారి పుష్పాలంకరణ సేవ టికెట్ ధర రూ. 2,116, సర్వకై ంకర్య సేవ రూ.3,116, వస్త్రాలంకరణ సేవ రూ.10,116, శాశ్వత సహస్రదీపాలంకరణ సేవ (10 ఏళ్లకు) రూ.5,000గా ఉన్నా యి. ఆయా లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించే అవకాశం ఉంది.
● కాటేజీలు : చినవెంకన్న కొండపైన 29 కాటేజీలు ఉండగా అద్దెలు రూ.2 వేలకు పైనే ఉన్నాయి. అద్దెలు జీఎస్టీతో కలిపి శ్రీ లక్ష్మీవల్లభ కాటేజీ రూ. 2,157, శ్రీనివాస నిలయం రూ.3,287, శ్రీనిలయం, శ్రీహరివాసం, వెంకటరత్నగిరి, సుదర్శనం ఒక్కొ క్కటి రూ.3,281, సీతానిలయం, బైరాజు నిలయం, శ్రీధర నిలయం ఒక్కొక్కటి రూ.4,969, శ్రీచక్ర పంచజన్య, శ్రీసత్య నిలయం ఒక్కొక్కటి రూ.4,500, ద్వారకానిలయం, కౌస్తుభం, భగీరథ, గోవింద, వాసుదేవ, వేంకటేశ్వర నిలయం, చంద్రశేఖర్ నిలయం ఒక్కొక్కటి రూ.6,750, ఆకాశరాజు కాటేజీ రూ. 15,000, శ్రీహరి నిలయం, లక్ష్మీపతి, రమ నిలయం, శ్రీరామ నిలయం, శేషాద్రి, శ్రీవిభూ, శ్రీవత్స, సూర్య నిలయం ఒక్కొక్కటి రూ.4,969. సూర్యనందక, సత్యానందక కాటేజీలు ఒక్కొక్కటి రూ. 12,799గా ఉంది. యూపీఐ ద్వారా అద్దె చెల్లింపులు జరిపితే ఎండీఆర్ భారం పడే అవకాశం ఉంది.
● కల్యాణ మండపాలు
కొండపైన దేవస్థానానికి సంబంధించి 15 కల్యాణ మండపాలు ఉన్నాయి. వీటి అద్దెలు రూ.15,300 నుంచి రూ.1,00,009 వరకు ఉన్నాయి. యూపీఐ ద్వారా అద్దె చెల్లింపులు జరిగితే ఎండీఆర్ భారం పడే అవకాశం ఉంది.
రూ.2 వేలు పైబడి లావాదేవీలపై ఎండీఆర్ ప్రభావం
చినవెంకన్న క్షేత్రంలో సేవా టికెట్లు, కాటేజీల అద్దెలపై అదనపు భారం పడే అవకాశం
భారం భగవంతుడిపైనా.. భక్తులపైనా?
వచ్చేనెల 15 నుంచి వడ్డన !


