కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు ముంపు భూముల పేరుతో కుక్కునూరు, వే లేరుపాడు మండలాల్లో మిర్చి సాగు చేస్తున్న రైతులకు యూరియా, డీఏపీ అందక ఇబ్బందులు పడుతున్నారంటూ గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ పాషా ఆదేశాల మేరకు కేఆర్‌పురం సహాయ వ్యవసాయ సంచాలకుడు పీజీ బుచ్చిబాబు పర్యవేక్షణలో అధికారులు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పోలవరం ప్రాజెక్టు పరిధిలో మిర్చి సాగు చేస్తున్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. అర్హత కలిగిన రైతుల వివరాలను ఏపీ ఏఐఎంఎస్ ఆన్‌లైన్ విధానంలో నమోదు చేసి యూరియా, డీఏపీ వంటి ఎరువులు అందించే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ‘సాక్షి’కి మిర్చి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ పథకాల ద్వారా చేతివృత్తిదారులు తమ నైపుణ్యం పెంపొందించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. భగవాన్ విశ్వకర్మ వృత్తి నైపుణ్యానికి ప్రతీక అన్నారు. వడ్రంగులు, కమ్మరివారు, స్వర్ణకారులు, శిల్పులు వంటి చేతివృత్తిదారులు విశ్వకర్మను తమ గురువుగా, దైవంగా భావించి, విశ్వకర్మ జయంతి రోజున విశ్వకర్మను పూజిస్తారన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయ చేతివృత్తుల వారి జీవనోపాధికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోందని, టూల్ కిట్స్ కూడా అందిస్తోందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి విశ్వమోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి అండర్ 14,16,18,20 బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులను వచ్చేనెల 2 నుంచి 4 వరకు కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని చెప్పారు. మరిన్ని వివరాలకు 9989363978, 96762 51733 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


