దేవదాయశాఖ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రంలో 90 శాతానికి పైగా చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. కేశఖండన నుంచి దర్శనం, ప్రసాదం, ఇతర సేవా టికెట్లు, గదులు, కల్యాణ మండపాల రిజర్వేషన్ల వరకు డిజిటల్ చెల్లింపులే అధికంగా ఉన్నాయి. నెలకు రూ.కోటిన్నరకు పైగా యూపీఐ ద్వారా దేవస్థానానికి రాబడి వస్తోంది. యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీల విషయంలో కేంద్ర ఆర్థికశాఖ సూచనల నేపథ్యంలో.. ఆ భారం దేవస్థానంపైనే పడుతుందా? లేక భక్తులపై ఏదైనా రూపంలో మోపుతారా? అనే చర్చ జరుగుతోంది. దీనిపై దేవదాయశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే రూ.1,000 అద్దె దాటిన గదులు, కల్యాణ మండపాల అద్దెలపై 5 శాతం జీఎస్టీని భక్తులే చెల్లిస్తున్నారు. పర్వదినాలు, వారాంతాల్లో డిజిటల్ లా వాదేవీలు మరింత పెరుగుతున్నాయి.


