మాజీ మంత్రి ఆళ్ల నానికి కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి ఆళ్ల నానికి కన్నీటి వీడ్కోలు

Sep 18 2026 1:39 AM | Updated on Sep 18 2026 1:39 AM

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ఏలూరు టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) పార్థీవదేహానికి గురువారం ఏలూరు శనివారపుపేట ఆయన స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా వేలాదిగా రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు తరలివచ్చారు. నానిని కడసారి చూడాలనే కోరికతో భారీసంఖ్యలో ఏలూరు చేరుకున్నారు. ఆయన పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఇంటి వద్దనే ఉంచారు. అనంతరం అంత్యక్రియల నేపథ్యంలో పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి పురవీధుల్లో తిరిగారు. ప్రధాన రహదారుల వెంబడి ప్రజలు ఆయనకు జోహార్లు అర్పించారు. ఆ సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావటంతో భారీ వర్షం కురిసింది. వర్షం కురుస్తున్నా అభిమానులు ఆయన కోసం తడుస్తూనే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నాని ఫ్లెక్సీలతో యువత తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అధికార లాంఛనాలతో.. ఏలూరు శనివారపుపేట ప్రాంతంలోని నాని స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది అధికార లాంఛనాలతో గౌరవ వందనం చేస్తూ గన్‌ సెల్యూట్‌ సమర్పించారు. గౌరవ సూచకంగా గాలిలోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం చేశారు. అనంతరం గౌరవ వందనంగా ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. అంత్యక్రియల్లో నాని సతీమణి, ఇద్దరు కుమారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రార్థనలు : ఏలూరు రోమన్‌ కథోలిక్‌ పీఠానికి చెందిన వికార్‌ జనరల్‌ డాక్టర్‌ బాల, ప్రొక్యూటర్‌ మైకేల్‌, ఫాదర్‌ రాజు, వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్‌ వింగ్‌ కార్యదర్శి జక్కుల బెనర్జీ ఘనంగా నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కుటుంబసభ్యులకు సంతాపం : ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ నాని పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ మునిరాజా నాని కుటుంబసభ్యులకు సతాపం తెలిపారు.

వైఎస్సార్‌సీపీ నేతల హాజరు

జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, ఉండి సమన్వయకర్త మంతెన యోగీంద్రకుమార్‌, నరసాపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జి గూడూరు ఉమాబాల, పీఏసీ సభ్యుడు జాన్స్‌న్‌ మేడిది తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌, నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్‌, మాజీ ఇడా చైర్మన్‌ బొద్దాని శ్రీనివాస్‌, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ మంచెం మైబాబు, సుంకర చంద్రశేఖర్‌, డాక్టర్‌ దిరిశాల వరప్రసాద్‌, బుద్దాల రాము, సుధీర్‌బాబు, చిరంజీవి, మున్నుల జాన్‌, దాసరి రమేష్‌, రిజ్వాన్‌, ప్రత్తిపాటి తంబి తదితరులు నివాళి అర్పించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు

రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఎమ్మెల్యేలు సొంగా రోషన్‌కుమార్‌, ప్రభాకర్‌, ధర్మరాజు, ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, అప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజియన్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, ఏలూరు ఉడా చైర్మన్‌ పెద్దబోయిన శివప్రసాద్‌, జెడ్పీ కో–ఆప్షన్‌ సభ్యుడు ఘంటా ప్రసాద్‌, మాజీ మంత్రి మరడాని రంగారావు, మాజీ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ తదితరులు నాని పార్థీవదేహం వద్ద నివాళులర్పించారు.

నాని పార్థీవదేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ఫాదర్‌ బాల, మైఖేల్‌, రాజు

ఆళ్ల నాని అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement