హామీ నిలబెట్టుకోవాలి
బదిలీల కోసం ఎదురు చూపులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ వర్గంపై చిన్నచూపును చంద్రబాబు ప్రభుత్వం మరోసారి చూపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారిని ముప్పతిప్పలు ఎలా పెట్టాలనే ఆలోచనతోనే వ్యవహరిస్తోందని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి విధితమే.
ఉపాధ్యాయుల కోరిక మేరకు ఏటా బదిలీలు నిర్వహిస్తామని గతంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ హామీ కేవలం నీటి మూట మాత్రమే అని ఉపాధ్యాయులకు ఈ ఏడాది అవగతమయింది. ఈ ఏడాది బదిలీలు జరుగుతాయి, తాము అనుకున్న ప్రాంతాలకు బదిలీ కావచ్చని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు విద్యా శాఖ ఈ ఏడాది బదిలీలు ఉండవని, కేవలం సర్దుబాటుతో సరిపెడతామనే సంకేతాలు పంపింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన గతంలో బదిలీ అయి సుదూర ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఆశలపై నీళ్ళు చల్లినట్టయ్యింది. ఈసారి వేసవి సెలవులు ప్రారంభమై నెల రోజులు గడిచినా టీచర్ల బదిలీల ఊసెత్తడం లేదు. బదిలీలకు బదులు సర్దుబాటు అంటూ కొత్త అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దీంతో ఏటా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తామని, పాఠశాలల పునఃప్రారంభం నాటికే బదిలీ స్థానంలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని లోకేష్ గతంలో చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కాకుండా కొత్త జిల్లా ప్రాతిపదికన బదిలీలకు బదులు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి సర్దుబాటు చేయాలని చంద్రబాబు సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
కొత్త జిల్లాల ప్రాతిపదికన..
కొత్త జిల్లాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్–2025 గెజిట్‌కు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు, బదిలీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రం మొత్తాన్ని ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించింది. ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను 3వ జోన్ పరిధిలోకి తెచ్చారు. ఉద్యోగ బదిలీలు, నియామకాలకు ఈ జోన్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు. సూపరింటెండెంట్, ఫస్ట్ గ్రేడ్ గెజిటెడ్ పోస్టులను జోనల్ పోస్టులుగా, డిప్యూటీ కలెక్టర్, దీనికి సమానమైన క్యాడర్లను మల్టీజోన్ పోస్టులుగా పరిగణిస్తారు. జూనియర్ అసిస్టెంట్, అంతకంటే దిగువన ఉండే పోస్టులను జిల్లా స్థాయి క్యాడర్‌గా పరిగణిస్తారు. దీని ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ ప్రధానోపాధ్యాయ గ్రేడ్–2 పోస్టులు జిల్లా క్యాడర్‌లోనే ఉంటాయి. అందుకే వీరి నియామకాలు, బదిలీలు ఇకపై జిల్లా స్థాయిలోనే జరుగనున్నాయి. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టును మాత్రం జోనల్ పోస్టుగా పరిగణించనున్నారు.
సందిగ్ధంలో పీఎస్ హెచ్‌ఎం పోస్టులు
గత ఏడాది టీచర్ల బదిలీల సమయంలో మోడల్ ప్రైమరీ స్కూళ్లకు తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించడంతో పాటు ప్రత్యేకంగా హెచ్‌ఎం పోస్టు కేటాయించి, హెచ్‌ఎంగా స్కూల్ అసిస్టెంట్‌ను నియమించారు. ఈసారి మోడల్ స్కూళ్లలో 40 మంది లోపు విద్యార్థులుంటే అక్కడున్న హెచ్‌ఎం పోస్టును రద్దు చేయాలని సర్కార్ ఆదేశించింది. సర్దుబాటు క్రమంలో అక్కడున్న హెచ్‌ఎంను ఎక్కడికి పంపాలో తెలియడం లేదని మండల విద్యాశాఖాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
పాఠశాలల పునఃప్రారంభం తర్వాతే
ఉపాధ్యాయులందరూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాతిపదికన నియామకాలు పొందారు. ఇప్పటి వరకూ ఇదే ప్రాతిపదికన బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసారి ప్రభుత్వం కొత్త జిల్లా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి నూతన జిల్లా ప్రాతిపదికన బదిలీలకు బదులు సర్దుబాటు చేయనున్నారు. జూన్ మొదటి వారంలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించినప్పటికీ పాఠశాలలు పునః ప్రారంభమైతే గానీ ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పక్కాగా తెలియదు. అందువల్ల పాఠశాలల ప్రారంభం తర్వాతే సర్దుబాటు చేయనున్నారు.
ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఏటా బదిలీలు చేస్తామని చెప్పి ఈ ఏడాది సర్దుబాటుకు పూనుకోవడం ఉపాధ్యాయులను మోసగించడమే. పైగా విద్యార్థుల సంఖ్యను బట్టి సర్దుబాటు చేస్తామనడం న్యాయసమ్మతం కాదు. మారుమూలన పని చేస్తున్న ఉపాధ్యాయులు ఈ సారి తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతామని ఎదురు చూస్తుండగా సర్దుబాటు వార్త తీవ్ర నిరాశ కలిగించింది.
– గెడ్డం సుధీర్, వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి
జిల్లాలో 1748 ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 7802 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వీరిలో ఒకే చోట ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. ఒకే స్కూల్‌లో రెండేళ్లు పనిచేసిన వారు బదిలీకి అర్హులు. ఇలాంటి వారు జిల్లాలో 3,200 మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీలపై ఎంతో ఆశపెట్టుకున్న ఉపాధ్యాయులంతా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు.
మాట తప్పుతున్న బాబు ప్రభుత్వం
ఏటా బదిలీలు చేస్తామన్న మాట నీటిమూటే
బదిలీల కోసం ఎదురు చూస్తున్న 3200 మంది ఉపాధ్యాయులు


