ముసునూరు: ముసునూరు మండలంలో గ్రావెల్, మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అయితే నాకెందుకులే అన్నట్లు నీటిపారుదల, మైనింగ్, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖలు వ్యవహరిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు గ్రావెల్, మట్టి దోపిడీని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. మండల కేంద్రమైన ముసునూరులోని నల్లచెరువు నుంచి రెండు జేసీబీలు, 20 ట్రాక్టర్లతో వలసపల్లి వెళ్లే దారిలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలకు పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు 300 ట్రక్కులకు పైగా మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు.
వలసపల్లిలో దోపిడీ
గుడిపాడు, వలసపల్లి గ్రామాల మధ్య ఉన్న నల్లచెరువు నుంచి ఇరు గ్రామాలకూ చెందిన, జేసీబీలు ఉన్న రాజకీయ నేతలు గ్రావెల్‌ను నిరంతరాయంగా తరలిస్తూ విక్రయిస్తున్నారు. రక్షిత మంచి నీటి సరఫరా బోరుకు అతి సమీపంలో ఏకంగా 30 అడుగుల లోతుకు తవ్వేయడంతో చెరువు లోయలా మారిపోయింది. వర్షాకాలంలో చెరువు నిండిన తర్వాత పశువులకు, మనుషులకు సైతం ఇది తీవ్ర ప్రమాదకరంగా మారుతుందని ఇరు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోపవరంలో కంసాలి కుంట చెరువులో మట్టిని మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా అక్రమంగా తరలిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు.
అడుగడుగునా నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్యం, నేతల ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ మట్టి, గ్రావెల్ దోపిడీని భరించలేక స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందిస్తున్నారు. సమాచారం అందించిన కాసేపటికే అధికార పార్టీకి చెందిన గ్రామ, మండల స్థాయి నేతల నుంచి ఫిర్యాదుదారులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో ఎవరికి వారు భయంతో మిన్నకుండిపోతున్నారు.
సహజ సంపదైన గ్రావెల్, మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నా మండల రెవెన్యూ అధికారులు కానీ, నూజివీడు సబ్ కలెక్టర్ కానీ ఈ తోలకాలను నియంత్రించే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, నీటిపారుదల, గనుల శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే, మండలంలోని చోటా నేతలు దూరాన్ని బట్టి ట్రాక్టర్ ట్రక్కుకు రూ.800 నుంచి రూ.1000 వరకు ధర నిర్ణయించి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు.
చివరకు సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పేరు చెప్పుకుని అధికారులను బెదిరిస్తూ.. వాణిజ్య అవసరాలకు, భూస్వాముల తోటలకు, పౌల్ట్రీ ఫాంలకు వేలాది ట్రాక్టర్ల మట్టిని తరలిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అధికారులు మాత్రం సమాచారం ఇచ్చిన వారికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ దోపిడీని అడ్డుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
అక్రమ మట్టి రవాణాపై మండల తహసీల్దార్ డి.ప్రశాంతిని వివరణ కోరగా... తక్షణమే వీఆర్వోను పంపి, అక్రమ తోలకాలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మొద్దు నిద్రలో మైనింగ్, రెవెన్యూ శాఖలు
వలసపల్లి నల్లచెరువులో 30 అడుగుల లోతున గ్రావెల్ తవ్వకం
ముసునూరు నల్లచెరువు నుంచి తోలకాలు


