ఏలూరు (టూటౌన్): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీదేవి, శనివారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ భవనంలో ఏలూరు ప్యానల్ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీదేవి న్యాయవాదులు కేసులు పురోగతి, కేసులు సత్వర విచారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేసుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని, అలసత్వం తగదని ప్యానల్ న్యాయవాదులకు సూచించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు శుకృవారం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు మొత్తం 3,938 మంది హాజరయ్యారు. ఉదయం ఇంగ్లీష్–1 పరీక్షకు మొత్తం 2987 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు మొత్తం 951 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.యోహాన్ తెలిపారు.
28న పరీక్షలు వాయిదా
ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఎకనామిక్స్–1, ద్వితీయ సంవత్సరం గణితం–2, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఒకేషనల్ పరీక్షలు బక్రీద్ నేపథ్యంలో వాయిదాపడ్డాయని తెలిపారు. ఈ పరీక్షలు జూన్ 5న జరుగుతాయని, విద్యార్థులు పాత హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరుకావచ్చన్నారు. జూన్ 5న జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జూన్ 12కి వాయిదా వేసినట్టు తెలిపారు.
బుట్టాయగూడెం: ‘విద్యుత్ కోతతో ఇక్కట్లు’ శీర్షిక సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనంపై విద్యుత్‌శాఖ అధికారులు స్పందించారు. బుట్టాయగూడెం, కొమ్ముగూడెం సెంటర్, బూసరాజుపల్లిలో నెలకొన్న విద్యుత్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్‌ఖాన్ తెలిపారు. కొమ్ముగూడెం సెంటర్ పరిధిలో మంగళవారం రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 7 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ట్రాన్స్‌ఫార్మర్ ట్రిప్ అయ్యిందన్నారు. విద్యుత్ కోత లేకుండా చూస్తున్నామని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సేకరిస్తున్న రెండో విడత భూసేకరణ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, దళారులు, అధికారులకు ఏటీఎంలా మారిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో విలేకర్లతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సుమారు 4 వేల ఎకరాల వరకూ భూసేకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ భూములను వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం మండలాల నిర్వాసితుల కోసం సేకరిస్తున్నారన్నారు. ఈ భూసేకరణలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. భూసేకరణ సమయంలో అధికారులు, దళారులు కమిషన్‌ల రూపంలో 15 నుంచి 20 శాతం వరకూ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంక్ చెక్‌లు ముందే తీసుకుంటున్నారని అన్నారు. భూములిచ్చే రైతుల వివరాలను బట్టి సమగ్రంగా విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. నిర్వాసితులకు జరిగే అన్యాయాలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన చేపడతామని చెప్పారు. ఇదే విషయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో భూసేకరణలో జరుగుతున్న అక్రమాలపై సిట్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


