డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద ఉణుదుర్రు బాధితుల నిరసన
ఉండి: ఉణుదుర్రు ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఇళ్ళు కోల్పోయిన బాధితులకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోవడంతో చివరికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లారు. ఉణుదుర్రు బాధితులు సుమారు 30 మంది వరకు మంగళగిరికి వెళ్లారు. అక్కడ మండుటెండలో మాకు న్యాయం చెయ్యండి అంటూ బ్యానర్ పట్టుకుని నిరసనకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో కార్యాలయ అధికారిగా భావిస్తున్న ఓ వ్యక్తికి తమ సమస్య చెప్పి వినతి పత్రాలను ఆయనకు అందజేసినట్లు బాధితులు తెలిపారు. పవన్‌కు కలిసేందుకు రాత్రి వరకు ఎదురు చూశారు. ఆలకోడు భూముల్లో ఉన్న ఇళ్లను గ్రామానికి చెందిన కొందరు కూల్చేసేందుకు పన్నాగం పన్నారని తెలిపారు. ఈ నెల 13న ఇళ్ళలో నుంచి బయటకు గెంటేసి దౌర్జన్యంగా ఇళ్ళు కూల్చేసారని వాపోయారు. చాలా మందికి అద్దె ఇళ్ళు కూడా దొరక్కపోవడంతో సీపీఎం నాయకుల సహాయంతో గ్రామంలోని హైస్కూల్‌లో తలదాచుకున్నామని వారి సహకారంతోనే భోజనాలు చేస్తున్నట్లు తెలిపారు. తమపై కక్షకట్టిన గ్రామానికి చెందిన కొందరు నాయకులు, ఆక్వా రైతులు గ్రామంలోని హైస్కూల్‌లో తలదాచుకుంటున్న తమను ఖాళీ చేయించారని తెలిపారు.


