నిట్‌కు తగ్గిన కంపెనీల రాక
తాడేపల్లిగూడెం: జాతీయ విద్యాసంస్థల్లో సీటు సాధిస్తే చాలు ఉద్యోగాలకు ఢోకా లేదనే ధీమా ఉండేది. విద్యావ్యవస్థలో వస్తున్న వినూత్న మార్పులు, ఏఐ కారణంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్లు దాదాపుగా తగ్గాయి. ఒకప్పుడు నిట్‌లు, ఐఐటీలు వంటి జాతీయ విద్యాసంస్థలకు కంపెనీలు క్యూ కట్టేవి. వందల సంఖ్యలో సంస్థలు వచ్చి విద్యార్థులకు భారీ వేతనాలతో ఆఫర్ లెటర్లు ఇచ్చేవి. దేశంలో 31వ నిట్‌గా ఏర్పడిన ఏపీ నిట్ కూడా ఉద్యోగాల కల్పనలో తిరుచ్చి నిట్‌తో పోటీపడేది. ఇప్పుడు పరిస్థితి మారింది. గత రెండు మూడు సంవత్సరాలుగా ఏపీ నిట్‌కు కంపెనీల రాక తగ్గిపోవడంతో ఉద్యోగాల లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఏఐ ప్రభావం నేరుగా కొలువులపై పడడంతో కంపెనీల రాక పూర్తిగా తగ్గింది. 2019లో ఏపీ నిట్ తొలి బ్యాచ్ బయటకు వెళ్లినప్పటి నుంచి 2025–26 బ్యాచ్ వరకు గణాంకాలను పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ప్రతి బ్యాచ్‌లో దాదాపుగా 90 శాతానికి పైగా విద్యార్థులు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందేవారు, ఇప్పుడు వాతావరణం భిన్నంగా ఉంది.
● 2022 బ్యాచ్‌లో 270 కంపెనీలు రాగా 522 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు లభించాయి. అప్పుడు ప్లేస్‌మెంట్ శాతం 95.69గా ఉండగా, అత్యధిక వార్షిక వేతనం రూ.47.3 లక్షలుగా నమోదైంది.
● 2023 బ్యాచ్‌కు సంబంధించి 174 కంపెనీలు రాగా, కేవలం 352 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. దీంతో ప్లేస్‌మెంట్ శాతం 88.75కు పడిపోయింది. అత్యధిక వార్షిక వేతనం రూ.47 లక్షలుగా ఉంది.
● 2024 బ్యాచ్‌లో 174 కంపెనీలు మాత్రమే వచ్చి 361 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా, ప్లేస్‌మెంట్ శాతం 74.55కు తగ్గి, అత్యధిక వార్షిక వేతనం రూ.44.1 లక్షలుగా నమోదైంది.
● 2025–26 పాస్డ్ అవుట్ బ్యాచ్‌లో 180 కంపెనీలు వచ్చి 510 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా, ప్లేస్‌మెంట్ శాతం 80.94గా ఉంది. ఈ బ్యాచ్‌లో అత్యధిక వార్షిక వేతనం రూ. 65 లక్షలుగా నమోదైంది.


