ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు పారదర్శకంగా, వేగంగా అందిస్తున్నామని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. రిజిస్ట్రేషన్ జరిగిన గంటలోపు దస్తావేజులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ సేవల కోసం దళారులను ఆశ్రయించవద్దన్నారు. బుధవారం కార్యాలయంలో 40 రిజిస్ట్రేషన్లు జరగ్గా ఆయన స్వయంగా దస్తావేజులు అందించారు. ఏలూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1 బెల్లంకొండ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మాతాశిశు మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. జిల్లాలో మాతాశిశు మరణాల నివారణ, మెరుగైన వైద్య సేవలపై వైద్యులు, వైద్యాధికారులు, సిబ్బందితో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వాస్పత్రుల్లో 2,711 ప్రసవాలు జరగ్గా 16 మంది శిశువులు మృతి చెందడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సిబ్బంది కారణమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. మాతాశిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలన్నారు. డీఎంహెచ్‌ఓ డా.యు.శోభ, డీసీహెచ్‌ఎస్ డా.బి.పాల్ సతీష్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ పి.శారద తదితరులు పాల్గొన్నారు.
జల్‌జీవన్ మిషన్ పనులపై..
జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమాలను నిర్దేశిత సమయంలోపు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్‌దండేకు తెలిపారు. బుధవారం కాంతిలాల్ దండే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఆర్‌డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ తదితరులు హాజరయ్యారు.
ఏలూరు (టూటౌన్): రహదారి భద్రత అందరి బాధ్యతని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గతేడాదిలో జ నవరి నుంచి ఏప్రిల్ వరకు 240 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 113 మంది, ఈ ఏడాదిలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 194 ప్రమాదాలు జరగ్గా 154 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ఎన్‌ఫోర్స్‌లో భాగంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ తదితర కేసుల్లో పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. రవాణా శాఖ ఉప కమిషనర్ ఎస్‌కే కరీం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె.విజయరత్నం, జిల్లా ప్రజా రవాణాధికారి షేక్ షబ్నం, డీఎంహెచ్‌ఓ యు.శోభ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్ సంస్థల అభివృద్ధికి సాంకేతిక ఆవిష్కరణలు కీలకమని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్‌లో బుధవారం ‘ఆవిష్కరణల ద్వారా ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌ల బలోపేతం– మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, వాణిజ్యీకరణ’ అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ఉత్పత్తి ప్రక్రియలో సమయం, వనరుల వృథాను తగ్గించి తక్కువ వ్యయంతో అధిక నాణ్యత గల ఉత్పత్తులు తయారు చేయవచ్చని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు ప్రభుత్వం ద్వారా రుణ సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ సహా యం అందిస్తున్నట్టు చెప్పారు. విశాఖకు చెంది న ఎన్‌ఆర్‌డీసీ సైంటిస్టు, ప్రాజెక్టు హెడ్, పాలకొల్లు ఏపీ ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


