● 18 ఏళ్లుగా అవే కష్టాలు
● సర్వీసుల క్రమబద్ధీకరణకు ఎదురుచూపులు
● మొదట్లో 200 మంది.. ప్రస్తుతం 80 మంది విధులు
నూజివీడు: ఐదుసార్లు వడబోసి ఎంతో మెరిట్‌తో ఎంపికయ్యారు.. 18 ఏళ్లుగా పీయూసీ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నా వారి జీవితాల్లో మాత్రం వెలుగులు లేవు.. సర్వీసుల క్రమబద్ధీకరణకు నోచుకోక, తక్కువ జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న మెంటార్లు. 2008లో రాష్ట్రంలో ట్రిపుల్‌ఐటీలను ప్రభుత్వం స్థాపించింది. విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విద్యలో భాగంగా మొదటి రెండేళ్లు పీయూసీ కోర్సు బోధనకు అ ప్పట్లో ఐదు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా దాదాపు 200 మంది మెంటార్లను నియమించారు.
హామీల అమలెప్పుడు?
ఆర్జీయూకేటీ వ్యవస్థాపక చాన్సలర్ ఆచార్య డి.రా జ్‌రెడ్డి మెంటార్లను నియమించేటప్పుడు పదేళ్ల స ర్వీసు తర్వాత రెగ్యులరైజేషన్ దిశగా పరిశీలి స్తామని హామీ ఇచ్చారు. దీంతో మెంటార్లు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. హామీ ఇచ్చి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేకుండా, పర్మినెంట్ కాకుండా అరకొర జీతాలతోనే వీరు జీవితాలను నెట్టుకొస్తున్నారు. సర్వీసుల క్రమబద్ధీకరణకు మెంటార్లు కోర్టును ఆశ్రయించగా వారి అభ్యర్థనను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
జూనియర్ లెక్చరర్ల కంటే జీతం తక్కువే..
రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్ల కంటే మెంటార్ల జీతాలు తక్కువగా ఉన్నాయి. జూనియర్ లెక్చరర్లకు రూ.57 వేల జీతం చెల్లిస్తుండగా మెంటార్లకు రూ. 45 వేల నుంచి రూ.50 వేల వరకు మాత్రమే ఇస్తున్నారు. అర్హతలు, విధులు, బోధనా బాధ్యతలు అన్నీ జూనియర్ లెక్చరర్లతో సమానంగా ఉన్నా జీతాల విషయంలో వీరికి న్యాయం జరగడం లేదు.
ఎంటీఎస్‌లో కూడా మొండిచేయే
యూనివర్సిట్లో కాంట్రాక్ట్ బోధనా సిబ్బందికి మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్)ను అమలు చేసిన ప్రభుత్వం ఈ విషయంలో ట్రిపుల్‌ఐటీల్లో మెంటార్లకు మాత్రం మొండిచేయి చూపింది. తమపై వివక్ష దారుణమని వీరంతా ఆవేదన చెందుతున్నాయి.
ప్రభుత్వం స్పందించాలని వినతి
ట్రిపుల్‌ఐటీల ప్రారంభంలో మొత్తంగా 200 మంది మెంటార్లు విధుల్లో చేరారు. సర్వీసులు క్రమబద్ధీకరణ కాకపోవడంతో చాలా మంది వేరే ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం 80 మంది వరకు పనిచేస్తుండగా వీరి వయసు 45 ఏళ్లకు చేరింది. కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఇంకా తాత్కాలిక ఉద్యోగాలతోనే వీరు కొనసాగుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని మెంటార్లు విజ్ఞప్తి చేస్తున్నారు.


