ఆన్‌లైన్‌ ఫార్మసీలతో అనర్థాలు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ఫార్మసీలతో అనర్థాలు

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

ఆన్‌లైన్‌ ఫార్మసీలతో అనర్థాలు

మెడికల్‌ షాపుల బంద్‌.. వ్యాపారుల ర్యాలీ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆన్‌లైన్‌ ఫార్మసీల నియంత్రణ లేని కార్యకలాపాలు, కార్పొరేట్‌ సంస్థల భారీ డిస్కౌంట్ల వల్ల మెడికల్‌ షాపుల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గురువారం చేపట్టిన మెడికల్‌ షాపుల బంద్‌లో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గుత్తా రవిచంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఔషధ పంపిణీదారులు ఆన్‌లైన్‌ మెడికల్‌ వ్యాపార కార్యకలాపాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని, సుమారు 5 కోట్ల కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదని, దీంతో బంద్‌ చేపట్టామన్నారు. ఈ–ఫార్మసీ నో టిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఏలూరు కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా వసంతమహల్‌ సెంటర్‌ మీదుగా ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ చేశారు. సెక్రటరీ వజ్రపు శేఖర్‌, ఈసీ మెంబర్లు నెరుసు కృష్ణ చైతన్య, చెన్నా రామ్‌కుమార్‌, ఎం. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement