● మరోమారు మొదటి ర్యాంకు ● వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెల్లడి
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆల యాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికే మళ్లీ మొదటి ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? ఆలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుద్ధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే ఈ నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అందులో ప్రతి నెలా ఏదో ఒక అంశంలో మొదటి ర్యాంకు సాధిస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం, గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించింది. తాజాగా మూడు రోజుల క్రితం వెలువడిన మే నెలకు సంబంధించిన సర్వేలో ద్వారకాతిరుమల దేవస్థానం మళ్లీ అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ పొందింది. అయితే ఈసారి దర్శనం ఇతర అంశాల్లో శ్రీశైలం దేవస్థానం, సౌకర్యాల కల్పనలో సింహాచలం దేవస్థానం ఆఖరి స్థానాల్లో నిలిచాయి.
దర్శనం, ఇతర అంశాల్లో..
ద్వారకాతిరుమల 73.4 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీకాళహస్తి 73.1 శాతంతో రెండో, విజయవాడ 71.4 శాతంతో మూడో, కాణిపాకం 70.8 శాతంతో నాల్గో, అన్నవరం 70.7 శాతంతో ఐదో, సింహాచలం 70.4 శాతంతో ఆరో, శ్రీశైలం 70.1 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచాయి.
సౌకర్యాల కల్పనలో..
ద్వారకాతిరుమల 73.25 శాతంతో మొదటి ర్యాంక్, శ్రీకాళహస్తి 72.73 శాతంతో రెండో, విజయ వాడ 71.42 శాతంతో మూడో, కాణిపాకం 70.86 శాతంతో నాల్గో, అన్నవరం 70.55 శాతంతో ఐదో, శ్రీశైలం 69.85 శాతంతో ఆరో, సింహాచలం 69.79 శాతంతో చివరి ర్యాంకు సాధించాయి.


